ఖలీల్‌వాడి, డిసెంబర్ 30 : మన ఊరు – మన బడి కార్యక్రమంలో భాగంగా పాఠశాలల్లో చేపడుతున్న అభివృద్ధి పనులన్నీ జనవరి మొదటివారం ముగిసే సరికి పూర్తయ్యేలా చర్యలు చేపట్టాలని కలెక్టర్ నారాయణరెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం సాయంత్రం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మన ఊరు – మన బడి, స్వయం సహాయక సంఘాలకు బ్యాంకు లింకేజీ రుణాల పంపిణీ, తెలంగాణ క్రీడా ప్రాంగణాల ఏర్పాటు, హరితహారం, పల్లె ప్రకృతి, బృహత్ పల్లెప్రకృతి వనాలు, పారిశుద్ధ్య నిర్వహణ తదితర అంశాలపై సంబంధిత శాఖల అధికారులతో మండలాల వారీగా సమీక్షించారు. ప్రతి మండలంలో కనీసం రెండు పాఠశాలల్లో జనవరి 8వ తేదీ నాటికి అన్ని పనులు పూర్తిచేయించి ప్రారంభోత్సవాలకు సిద్ధం చేయాలని ఆదేశించారు. ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు అందిన నేపథ్యంలో నిర్ణీత గడువులోగా పనులను పూర్తి చేయించాలన్నారు. టాయిలెట్స్, కిచెన్‌షెడ్స్, ప్రహారీలు, రెయిలింగ్, ప్లాంటేషన్‌తో పాటు పెయింటింగ్ తదితర పనులన్నీ పూర్తికావాలని సూచించారు.
మెట్లు, ర్యాంప్తోపాటు మొదటి అంతస్తు కలిగి ఉన్న బడుల్లో డ్రాప్వాల్ దగ్గర రెయిలింగ్ తప్పనిసరిగా వేయించాలని స్పష్టం చేశారు. నిర్ణీత సమయంలో పనులు పూర్తి కాకుంటే ఎంపీడీవోలు, ఏఈలపై చర్యలు తప్పవని హెచ్చరించారు. తక్షణ బిల్లుల చెల్లింపు కోసం ఉపాధిహామీ పథకం కింద పూర్తయిన పనులకు ఎఫ్‌టీవోలు జనరేట్ చేయాలన్నారు. స్వయం సహాయక సంఘాలకు బ్యాంకు లింకేజీ రుణాల పంపిణీలో మరింత ప్రగతి సాధించాలని సూచించారు. జిల్లాలో సగటున 69 శాతం లింకేజీ రుణాల పంపిణీ జరగగా, కొన్ని క్లస్టర్లు పూర్తిగా వెనుకబడి ఉన్నాయన్నారు. వచ్చే వారం నాటికి అన్ని క్లస్టర్ల పరిధిలో 90 శాతం లక్ష్యాన్ని సాధించాలని ఆదేశించారు. జిల్లాలోని అన్ని గ్రామపంచాయతీల పరిధిలో తెలంగాణ క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేయాలని, మొక్కలను సంరక్షించేలా చర్యలు తీసుకోవాలని, పారిశుద్ధ్యంపై ప్రత్యేక శ్రద్ధ కనబర్చాలని సూచించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో జడ్పీ సీఈవో గోవింద్, డీఆర్డీవో చందర్, డీపీవో జయసుధ, మెప్మా పీడీ రాములు, లీడ్ బ్యాంక్ మేనేజర్ శ్రీనివాస్‌రావు, జిల్లా వ్యవసాయాధికారి తిరుమల ప్రసాద్, డీఈవో దుర్గాప్రసాద్, హన్మంత్‌రావు, డీటీడబ్ల్యూ నాగూరావు, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ రమేశ్, ఎన్ఐసీ జిల్లా మేనేజర్ కార్తీక్, ఇంజినీరింగ్ విభాగం అధికారులు దేవీదాస్, భావన్న, మురళి పాల్గొన్నారు.