ఉత్తర తెలంగాణ వరప్రదాయిని శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ నీటినిల్వ సామర్థ్యం ఏటా తగ్గుతూ వస్తున్నది. ప్రాజెక్ట్ నిర్మాణ సమయం నుంచి 2022 సంవత్సరం వరకు ఈ ప్రాజెక్ట్ సామర్థ్యం దాదాపు 31.5టీఎంసీలు తగ్గింది. ప్రస్తుతం మరింత తగ్గి ఉండవచ్చన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 1994, 2022 సంవత్సరాల్లో చేయించిన సర్వేలో ప్రాజెక్ట్ నీటి నిల్వ సామర్థ్యం 31.5 టీఎంసీలు తగ్గిందన్న విషయం వెల్లడయ్యింది. ఏటా సామర్థ్యం తగ్గుతూ వస్తే ప్రాజెక్ట్ పరిధిలోని జిల్లాలకు సాగు నీటి సరఫరా క్లిష్టతరమయ్యే అవకాశాలున్నాయి.
వేసవికాలంలో ఎస్సారెస్పీలో నీరు తగ్గిన ప్రతిసారి వ్యవసాయ క్షేత్రాలకు నల్లమట్టిని తరలించేవారు. జలాశయం ఉన్న ముప్కాల్ మండల పరిధిలో మొరంతో, మిగతా భాగమంతా నల్లమట్టితో నిండి ఉంటుంది. ప్రతి వేసవిలో వేలాది టిప్పర్ల ద్వారా నల్లమట్టిని వ్యవసాయ క్షేత్రాలు, వివిధ అవసరాలకు మొరంనూ తరలించేవారు. ప్రాజెక్టులోని నల్లమట్టి భూమిసారవంతం కోసం ఉపయోగపడుతుండడంతో మట్టిని పొలాల్లో వేసుకునేందుకు రైతులు ముందుకువచ్చేవారు. ఇలా దాదాపు ఐదారేండ్లు పొక్లెయిన్లు పెట్టి నల్లమట్టిని తరలించారు. అయితే అటు నిర్మల్, ఇటు నిజామాబాద్ జిల్లాలకు చెందిన అధికారులు, ఎస్సారెస్పీ అధికారులు ఈ తతంగాలు జరగాలంటే తమ చేతులు తడపాల్సిందే అనడం, లేకుంటే అడ్డుపడడంతో రెండేండ్లుగా మట్టి తొలగింపు పనులు కొనసాగడం లేదని తెలిసింది. ప్రతి వేసవిలో పూడికను తొలగిస్తున్న వారిని అధికారులు ప్రోత్సహిస్తే ఏటా కొంత పూడిక తొలగిపోయి ఎస్సారెస్పీలో మరింత పూడికచేరకుండా ఉండే అవకాశాలు ఉంటాయన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వం సైతం పూడిక తొలగింపు పనులు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.
శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ నిర్మాణానికి 1963లో శంకుస్థాపన చేయగా 1978లో పనులు పూర్తయ్యాయి. 1091 అడుగులు, 112 టీఎంసీల నీటినిల్వ సామర్థ్యంతో ఎస్సారెస్పీని నిర్మించారు. దీని ద్వారా 18లక్షల ఎకరాలకు సాగునీరందించేలా రూపకల్పన చేశారు. ప్రాజెక్ట్ ఆయకట్టుకు నీటిని అందించేందుకు కాకతీయ, సరస్వతి, లక్ష్మీకాలువ, వరదకాలువలను నిర్మించారు. వీటి ద్వారా ఉమ్మడి కరీంనగర్, వరంగల్, ఖమ్మం, నిర్మల్ జిల్లాలతోపాటు, బాల్కొండ నియోజకవర్గానికి సాగునీటిని అందిస్తున్నారు. సాగు, తాగునీటిని అందించడంతోపాటు 36 మెగావాట్ల విద్యుదుత్పత్తి సామర్థ్యం గల జలవిద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని 1988లో ప్రారంభించారు.
112 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించిన ఎస్సారెస్పీ సామర్థ్యం 2022లో చేసిన సర్వే ప్రకారం 31.5 టీఎంసీలు తగ్గి 80.5టీఎంసీలకు చేరింది. ఎస్సారెస్పీకి వచ్చే వరద ప్రాంతాలు నల్లరేగడి భూములు ఉండడంతో ఈ జలాశయంలోకి భారీగా పూడిక వచ్చిచేరుతుంది. ఇది గమనించిన అధికారులు ప్రభుత్వానికి నివేదికలు పంపించగా 1994లో సర్వే చేయించగా 21.687 టీఎంసీల పూడికచేరిందని తేల్చారు. దీంతో ప్రాజెక్ట్ సామర్థ్యం 112 టీఎంసీల నుంచి 90.313టీఎంసీలకు తగ్గించి లెక్కించారు. తిరిగి పూడిక విషయంలో అనుమానాలు రేకెత్తడంతో 2022, మేలో చెన్నైకి చెందిన సీకాం కంపెనీతో పూడిక సర్వే చేయించారు. ఈసర్వే ప్రకారం 9.813 నీటినిల్వ సామర్థ్యం పడిపోయిందని తేలింది. అప్పటి నుంచి ప్రాజెక్ట్ సామర్థ్యం 80.5 టీఎంసీలుగా లెక్కిస్తున్నారు. ప్రస్తుతం ప్రాజెక్ట్‌లో 6.39టీఎంసీల నీరు ఉండగా పాత గణాంకాల ప్రకారం డెడ్‌స్టోరేజీ 5 టీఎంసీలు మాత్రమే. రెండుసార్లు చేసిన సర్వేలో ఏకంగా 31.5 టీఎంసీల పూడిక చేరినట్లు తేలగా ఈ రెండు సంవత్సరాల్లో పూడిక ఎంత మేరకు చేరి ఉంటుందోననే ఆందోళనవ్యక్తమవుతున్నది. ప్రస్తుత పరిస్థితుల్లో డెడ్‌స్టోరేజీ ఎంత అనేది అధికారులు మాత్రం వెలువరించడం లేదు.