లింగంపేట/బాన్సువాడ రూరల్, ఫిబ్రవరి 27: కామారెడ్డి జిల్లాలో జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాలు నలుగురిని బలిగొన్నాయి. లింగంపేట మండలం సజ్జన్పల్లి గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. స్థానిక సర్పంచ్ పుట్టి పోశయ్య తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన మంత్రి పోశయ్య(25), మంత్రి విజయ్‌వీర్(28) మెదక్ జిల్లా హవేళిఘన్పూర్ మండలం చౌట్లపల్లి గ్రామంలో పెళ్లివిందుకు హాజరయ్యేందుకు అదివారం రాత్రి ద్విచక్రవాహనంపై బయల్దేరారు. ఘన్పూర్ గ్రామ శివారులో బైక్ అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఇద్దరు అక్కడిక్కడే మృతి చెందినట్లు సర్పంచ్ వివరించారు. విజయ్‌వీర్‌కు భార్య మహేశ్వరి, కూతురు అలేఖ్య ఉన్నారని, పోశయ్యకు వివాహం కాలేదని తెలిపారు. మృతులిద్దరూ సోదరులు కావడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటనపై హవేళిఘన్పూర్ పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాలను పోస్టుమార్టం కోసం మెదక్ పట్టణంలోని ప్రభుత్వ దవాఖానకు తరలించారు. వారి అంత్యక్రియలను సోమవారం సాయంత్రం స్వగ్రామం సజ్జన్‌పల్లిలో నిర్వహించారు.
బైక్‌లు ఢీకొని ఇద్దరు..
బాన్సువాడ మండలంలోని మొండిసడక్ అటవీ ప్రాంతంలో సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతిచెందారు. ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం.. బాన్సువాడ మండలం కోనాపూర్ గ్రామానికి చెందిన అరవింద్ గౌడ్ (28) బైక్‌పై బావమరిది కృష్ణాగౌడ్‌తో కలిసి బాన్సువాడ నుంచి స్వగ్రామానికి వెళ్తున్నాడు. బిచ్కుంద మండలం పుల్కల్ గ్రామానికి చెందిన ఎల్లుగొండ (55 ) గాంధారి నుంచి బాన్సువాడ వైపు వస్తున్నాడు. ఈ క్రమంలో వీరి బైక్‌లు మొండిసడక్ అటవీ ప్రాంతంలో ఎదురెదుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో పుల్కల్ గ్రామానికి చెందిన ఎల్లుగొండ అక్కడికక్కడే మృతి చెందాడు. తీవ్రంగా గాయపడిన అరవింద్ గౌడ్, కృష్ణాగౌడ్‌ను చికిత్స కోసం బాన్సువాడ ఏరియా దవాఖానకు తరలించారు. చికిత్స పొందుతూ అరవింద్ గౌడ్ మృతి చెందాడు. చేతికి అందివచ్చిన ఒక్కగానొక్క కొడుకును రోడ్డు ప్రమాదం కబళించడంతో అరవింద్ గౌడ్ తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించారు.