కర్షకుల కండ్లల్లో ‘పది’ంతల ఆనందం కనిపిస్తున్నది. రైతు ముఖంలో సంతోషం వెల్లివెరిస్తున్నది. రైతుబంధు సాయం అందడంతో రైతాంగం మురిసి పోతున్నది. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వం రైతుబంధు పథకాన్ని అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. బుధవారం నుంచి పదో విడుత పెట్టుబడి సాయం పంపిణీ ప్రారంభమైంది. తొలి రోజు ఎకరం లోపు భూమి ఉన్న రైతుల ఖాతాల్లో డబ్బులు జమ అయ్యాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ అందించిన ఆర్థిక సాయాన్ని అందుకున్న రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. చేతిలో చిల్లిగవ్వ లేని తరుణంలో పెట్టుబడికి డబ్బులు ఇచ్చి ఆదుకుంటు న్నారని మురిసి పోతున్నారు. ఆర్థిక సాయంతో పాటు ఉచిత కరెంట్, కాలువల ద్వారా కావాల్సినన్ని నీళ్లు ఇస్తున్న రైతుబాంధవుడు కేసీఆర్ కలకాలం సల్లంగుండాలని ఉమ్మడి జిల్లా రైతులు దీవిస్తున్నారు.
ఉదయం తొమ్మిది గంటలు దాటింది…
ఎకరంలోపు భూమి ఉన్న రైతుల ఫోన్లు ట్రింగ్ ట్రింగ్‌మంటూ మెసేజ్‌ల మోత మోగాయి. తెలంగాణ ప్రభుత్వం రైతుబంధు (యాసంగి-2022) పథకం ద్వారా రూపాయలు మీ బ్యాంకు ఖాతాలో జమ చేసింది. ఈ సహాయం పెట్టుబడి మరియు ఇతర వ్యవసాయ పనుల కొరకు ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. మీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, ముఖ్యమంత్రి అంటూ వచ్చింది. మెసేజ్ చూసిన రైతుల ముఖాల్లో సంతోషం కనిపించింది. సమీపంలోని బ్యాంకులకు వెళ్లి కేసీఆర్ పైసలొచ్చాయంటూ ఆనందంతో నగదును విత్ డ్రా చేసుకున్నారు.
మనది రైతు ప్రభుత్వం ఎమ్మెల్యే హన్మంత్‌షిండే
నిజాంసాగర్, డిసెంబర్ 28: రాష్ట్ర ప్రభుత్వం ముమ్మాటికీ రైతు ప్రభుత్వమేనని జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్‌షిండే అన్నారు. జుక్కల్ మండల కేంద్రంలో బుధవారం ఓ కార్యక్రమానికి హాజరైన సందర్భంగా అక్కడే ఉన్న ఓ రైతుకు ఫోన్‌కు రైతుబంధు డబ్బులు జమ అయినట్లు మెసేజ్ రావడంతో దానిని చూయిస్తూ మాట్లాడారు. దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేనివిధంగా పంట పెట్టుబడికి ఎకరానికి రూ.5వేలు కేసీఆర్ ప్రభుత్వం అందిస్తున్నదని అన్నారు. అందుకే రాష్ట్రంలో ప్రతి రైతూ ఉత్సాహంగా సాగు చేస్తున్నారన్నారు. ఆయన వెంట మార్కెట్ కమిటీ అధ్యక్షుడు సాయాగౌడ్, నాయకులు నీలుపటేల్, మాధవ్‌రావ్ దేశాయ్, గంగాధర్ ఉన్నారు.
ఇంతకన్నా ఏం కావాలి…
రైతులను ఆదుకుంటున్న ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది సీఎం కేసీఆర్ ప్రభుత్వమే. మేము నిశ్చింతగా వ్యవసాయం చేసుకోవడానికి నీళ్లు, కరెంటు, పెట్టుబడి సాయం అందిస్తున్నరు. వ్యవసాయం ఒక పండుగలా మారింది. పండించిన ధాన్యానికి మద్దతు ధర రైతు ఖాతాలో వేస్తున్నరు. రైతుగా మాకు ఇంతకన్నా ఏం కావాలి.
– మూత చిన్న భూమన్న,రైతు, భీమ్‌గల్
రైతు సంక్షేమం కేసీఆర్‌తోనే సాధ్యం…
రైతు సంక్షేమం సీఎం కేసీఆర్‌తోనే సాధ్యం. కేసీఆర్ అమలు చేస్తున్న రైతుబంధు, రైతు బీమా, ధాన్యం కొనుగోలు కేంద్రాలు, సాగు నీటి రంగ అభివృద్ధి కార్యక్రమాలు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. ఏటా సకాలంలో పంట సాగు ప్రారంభించే సమయానికి రైతుబంధు డబ్బులు ఖాతాల్లో జమ అవుతున్నాయి.
-శ్రావణ్, రైతు, కమ్మర్పల్లి
కేసీఆర్‌కు రుణపడి ఉంటాం..
ముఖ్యమంత్రి కేసీఆర్ రైతులకు అండగా ఉంటున్నారు. ఏడాదిలో రెండు పంటల సాగుకు రైతుబంధు పథకం ద్వారా మాకు పెట్టుబడి సాయం అందిస్తున్నడు. పంట పెట్టుబడి సాయంతో మాకు ఎంతో మేలు జరుగుతుంది. పంట సాగు ప్రారంభించే సమయానికి రైతుబంధు డబ్బులు ఖాతాల్లో జమ అవుతున్నాయి. సీఎం కేసీఆర్‌కు రుణపడి ఉంటాం.
– బాలకిషన్, వేల్పూర్
పెట్టుబడి సాయం వచ్చింది
కేసీఆర్ ప్రభుత్వం పంట సాగు కోసం అందిస్తున్న పెట్టుబడి సాయం అందింది. సీఎం కేసీఆర్ అందించిన పెట్టుబడి సాయంతో వ్యవసాయ పనులు మొదలుపెట్టాను. నాట్లు వేసుకోవడానికి, మందులు కొనుక్కోవడానికి ఈ పైసలు ఆసరా అవుతాయి. రైతుల కోసం ఇంత చేస్తున్న కేసీఆర్ సారుకు రుణపడి ఉంటాం.
– వీణా, మహిళా రైతు, రామన్నపేట్
ఫస్టు రోజే పైసలొచ్చినయ్..
రైతుబంధు వచ్చిన మొదటిరోజే నా ఖాతాలోకి పైసలొచ్చినయ్. ఏడాదికి రెండుసార్లు పంటలు వేసే సమయానికే డబ్బులు ఖాతాలోకి రావడం సంతోషమనిపిస్తుంది. దేశంలో ఎక్కడా లేనట్లు తెలంగాణలో సీఎం రైతుబంధు ఇస్తుండు. రైతుల కోసం ఎన్నో పథకాలను తీసుకొచ్చిండు. ఇలాంటి సీఎం ఉంటే రైతులకు కష్టాలు రావనిపిస్తుంది.
– కిషన్ రైతు, మోర్తాడ్