వినాయక్‌నగర్, ఏప్రిల్ 2: నిజామాబాద్ కమిషనరేట్ పరిధిలోని ఆరో టౌన్ పోలీస్‌స్టేషన్‌లో విచారణ కోసం తీసుకొచ్చిన ఇద్దరు అనుమానితులు సిబ్బంది కండ్లుగప్పి తప్పించుకుపోయారు. వివరాలు ఇలా ఉన్నాయి. కొన్ని రోజులుగా వరుసగా చోరీ ఘటనలు జరుగుతుండడంతో కేసులను చేధించేందుకు పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇందులో భాగంగా కొంతమంది అనుమానితులను పోలీసులు స్టేషన్‌కు తీసుకువచ్చి విచారిస్తున్నారు. రెండు రోజుల క్రితం మహారాష్ట్రలోని నాందేడ్ ప్రాంతానికి చెందిన ఒకరితోపాటు జిల్లా కేంద్రంలోని ఆటోనగర్ ఏరియాకు చెందిన మరో అనుమానితుడిని ఆరోటౌన్ పోలీసులు విచారణ కోసం సోమవారం ఠాణాకు తీసుకువచ్చారు. సిబ్బంది పర్యవేక్షణలో ఉన్న ఇద్దరు అనుమానితులు అర్ధరాత్రి సమయంలో పరారయ్యారు. మంగళవారం ఉదయాన్నే ఠాణాలో ఉండాల్సిన ఇద్దరు అనుమానితులు లేకపోవడంతో పారిపోయినట్లుగా పోలీసులు గుర్తించారు.
ఈ విషయమై సౌత్ రూరల్ సీఐ ఎన్.సురేశ్ కుమార్‌ను వివరణ అడగగా ఈ మధ్యకాలంలో జరిగిన దొంగతనం కేసులో విచారించేందుకు ఆరోటౌన్ ఎస్సై రమేశ్ ఆధ్వర్యంలో ఇద్దరిని స్టేషన్‌కు తీసుకువచ్చిన విషయం వాస్తవమేనని తెలిపారు. అయితే వారిపై ఇంకా ఎలాంటి కేసులు నమోదు చేయలేదని, అనుమానితులుగా విచారించేందుకు తీసుకువచ్చి ఠాణాలో ఉంచామన్నారు. ఆ ఇద్దరు అనుమానితులు స్టేషన్ నుంచి పారిపోయారని, వారిని పట్టుకునేందుకు ఓ బృందాన్ని ఏర్పా టు చేసి గాలింపు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ఇదిలా ఉండగా పోలీస్ స్టేషన్ నుంచి ఇద్దరు అనుమానితులు పారిపోవడంపై సీపీ కల్మేశ్వర్ సింగెనవార్ సీరియస్ అయినట్లు సమాచారం. వెంటనే వారిని పట్టుకోవాలని సిబ్బందిని ఆదేశించినట్లు తెలిసింది.