కామారెడ్డి/లింగంపేట, డిసెంబర్ 11 : తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సర్వశిక్ష అభియాన్ సిబ్బంది సమ్మె చేపట్టడంతో జిల్లాలోని పలు మండలాల్లో బుధవారం విద్యావనరుల కేంద్రాలకు తాళాలు దర్శనమిచ్చాయి. నాలుగు రోజులపాటు వారు చేపట్టిన నిరసన దీక్షలకు స్పందించిన అధికారులు, రాష్ట్ర నాయకులతో చర్చలు చేపట్టగా విఫలమయ్యాయి. దీంతో వారు సమ్మెబాట పట్టారు. సీఎం రేవంత్ ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కోరుతూ జిల్లాలోని సమగ్ర శిక్ష ఉద్యోగులు జిల్లాకేంద్రంలోని మున్సిపల్ కార్యాలయం ఎదుట చేపట్టిన సమ్మె శిబిరంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తాము సమ్మెబాట పట్టడంతో మండల కేంద్రాల్లోని విద్యావనరుల కేంద్రాలు తెరుచుకోలేదన్నారు. కస్తూర్బా విద్యాలయాల్లో బోధన నిలిచిపోయినట్లు తెలిపారు. భవిత సెంటర్లు కూడా మూసిఉన్నట్లు చెప్పారు.
ప్రస్తుత సీఎం రేవంత్రెడ్డి గతంలో పీసీసీ చీఫ్ హోదాలో సర్వశిక్ష అభియాన్ ఉద్యోగుల సర్వీసును అధికారంలోకి రాగానే రెగ్యులర్ చేస్తామని హామీ ఇచ్చారని గుర్తుచేశారు. ఇచ్చిన హామీని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. హామీలను అమలు చేయడంలో జాప్యం కారణంగా సమ్మెకు పిలుపునిచ్చినట్లు కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు సత్యనారాయణ తెలిపారు. సమ్మెకు పీఆర్టీయూ, డీటీఎఫ్ నాయకులు మద్దతు పలికారు.కార్యక్రమంలో నాయకులు శ్రీనివాస్ రెడ్డి,శ్యాంకుమార్,జనరల్ సెక్రటరీ సంపత్, నాయకులు శ్రీధర్ కుమార్, రాములు, సంతోష్ రెడ్డి, శిల్ప, లావణ్య, సాయిలు,శైలజ, మాధవి, అజిత్, శ్రీనివాస్, రమేశ్, కాళిదాసు, కృష్ణ, శ్రీకాంత్, బన్సీలాల్, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.