అంధత్వ రహిత సమాజాన్ని నెలకొల్పాలన్న లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ‘కంటివెలుగు’ విజయవంతంగా కొనసాగుతున్నది. దృష్టి లోపాలతో బాధ పడుతున్న వారికి ఈ కార్యక్రమం ఉపయుక్తంగా మారింది. ఉమ్మడి జిల్లాలో ఇప్పటివరకు 75,104 మందికి కంటి పరీక్షలు చేసి, 32920 మందికి కళ్లద్దాలు పంపిణీ చేశారు. సరిగా కానరాక ఇన్నాళ్లు ఇబ్బందులు పడిన వారు సర్కారు అందించిన కళ్లద్దాలతో స్పష్టంగా చూడగలుగుతున్నారు.
– చందూర్/కోటగిరి/విద్యానగర్/ఖలీల్‌వాడి, జనవరి 25
కంటివెలుగు శిబిరాలు జోరుగా కొనసాగుతున్నాయి. నిజామాబాద్ జిల్లాలో బుధవారం 10,805 మందికి కంటి పరీక్షలు నిర్వహించగా 10,710మందికి అద్దాలు అందచేసినట్లు జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి సుదర్శనం తెలిపారు. ఇప్పటి వరకు మొత్తం 48,413 మంది కంటి పరీక్షలు నిర్వహించామన్నారు. కామారెడ్డి జిల్లాలో 5,485 మందికి కంటి పరీక్షలు నిర్వహించి 1,194 మందికి కండ్లద్దాలు పంపిణీ చేసినట్లు డీఎంహెచ్‌వో డాక్టర్ లక్ష్మణ్‌సింగ్ తెలిపారు. ఇప్పటి వరకు 26,691 మందికి పరీక్షలు నిర్వహించి 6,288 మందికి కండ్లద్దాలు అందజేశామని పేర్కొన్నారు.
– ఖలీల్‌వాడి/ విద్యానగర్, జనవరి 25
కోటగిరి, జనవరి 25 : సీఎం కేసీఆర్ సార్ ఏది చేసినా ప్రజల మంచి కోసమే. కంటి సమస్యలతో బాధపడే పేదలు ఇప్పటికీ ఎంతో మంది ఉన్నారు. వారికి కంటివెలుగు శిబిరాలు చాలా ఉపయోగపడతాయి. నేను ఎన్నో రోజుల నుంచి కంటి సమస్యతో బాధపడుతున్నా. శిబిరంలో వైద్యసిబ్బంది కంటి పరీక్షలు నిర్వహించి వెంటనే కళ్లద్దాలు ఇచ్చారు. మాలాంటి మధ్యతరగతి వాళ్లకు శిబిరాలు ఒక వరం.
– వసుధ, పొతంగల్, కోటగిరి మండలం
కోటగిరి, జనవరి 25 : సర్కారోళ్లు దేవుడోలే వచ్చిన్రు. అమ్మా నీకు కండ్లు మంచిగ కనపడుతున్నయా అని ఇంటికి వచ్చి అడిగిండ్రు. సక్కగా కనిపిస్తలేవని చెప్పంగనే పేరు రాసుకున్నరు. ఇయ్యాళ్ల శిబిరానికి రమ్మన్నరు. ఇక్కడికి వచ్చినంక అన్ని పరీక్షలు జేసి కళ్లద్దాలు ఇచ్చిన్రు. చాన సంబురమైంది. మాఅసోంటోళ్లు ఎంతో మందికి సీఎం కేసీఆర్ సార్ మంచి పని జేత్తుండు.
-జెండా సాయవ్వ, కోటగిరి
కోటగిరి, జనవరి 25 : నాకు శాన ఏండ్ల సంది చూపు సక్కగా లేకుండు. ఎటు చూసినా మసక మసకగ కనబడేది. దగ్గర చూపు మొత్తమే కనబడకపోయేది. మందులు వేసుకునేందుకు కూడా ఇబ్బందయ్యేది. ఇయ్యాల సర్కారు పెట్టిన కంటి వెలుగులో డాక్టర్లు నాకు కండ్ల పరీక్షలు చేసి అద్దాలు ఇచ్చిండ్రు. ఇప్పుడు నా చూపు మంచిగ కనబడుతున్నది.
– బొబ్బిలి రామారావు, కోటగిరి
మోస్రా (చందూర్), జనవరి 25: ఏండ్లుగా కంటి సమస్యతో బాధపడుతున్నా. దవాఖానలో చూపించుకుందామంటే సమయానికి డబ్బులు లేక వాయిదా వేసుకుంటూ వచ్చా. మా ఊరిలోనే కంటి వెలుగు శిబిరం పెట్టిండ్రని తెలుసుకొని వచ్చిన. పరీక్ష చేసి కండ్లద్దాలు ఇచ్చిండ్రు. కర్సు తప్పింది. ఇప్పుడంతా బాగున్నది. నాకు చూపునిచ్చిన సీఎం కేసీఆర్‌కు రుణపడి ఉంటా..
మోస్రా (చందూర్), జనవరి 25: కంటి వెలుగు ఎంతో బాగున్నది. నాకు కొద్దిగా కంటి సమస్యఉండేది. ఎన్నో రోజులుగా పరీక్షలు చేయించుకోవాలని అనుకుంటున్న. కంటి వెలుగు ద్వారా ఉచితంగా పరీక్షలు చేస్తున్నరని తెలుసుకొని వచ్చిన. డాక్టర్లు మంచిగ చూసి అన్ని పరీక్షలు చేసి మందులు, కండ్లద్దాలు ఇచ్చారు. సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు.
మోస్రా (చందూర్), జనవరి 25: మొన్నటి నుంచి నాకు కండ్లు మసకమసక అయితుండె. నిజామాబాద్ దవాఖానకు పోయి చూపిచ్చుకుంటే మందులు ఇచ్చిండ్రు. వాడిన, మళ్ల రమ్మన్నరు. పోదాం అనుకునేసరికి మా ఊర్లనే కంటి వెలుగు శిబిరం పెట్టిండ్రని తెలిసింది. ఇక్కడికి వస్తే పరీక్ష చేసి అద్దాలు ఇచ్చిండ్రు. ఊర్లకే వచ్చి పరీక్షలు చేసి అద్దాలిచ్చుడు బాగున్నది. కేసీఆర్ సారు సల్లంగ ఉండాలె.
– నాగారం బాలమణి, మోస్రా