పొద్దున లేవగానే పాఠశాలకు పరుగులు.. పొద్దుపోయే వరకూ తరగతులు.. సాయంత్రం వేళ ఆకలితో నీరసించిపోతున్న టెన్త్ విద్యార్థులు.. ఈ తరుణంలో అల్పాహారం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముందుకొచ్చింది. పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించాలన్న లక్ష్యంతో కేసీఆర్ సర్కారు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నది. విద్యార్థులు ఆకలితో అలమటించకుండా చదువుకోవాలని సాయంత్రం వేళ స్నాక్స్ అందించాలని నిర్ణయం తీసుకున్నది. దీంతో ఉమ్మడి జిల్లాలో 16,269 మందికి లబ్ధి చేకూరనున్నది. ప్రభుత్వ చేయూతతో విద్యార్థులు మరింత ఉత్సాహంతో చదివేందుకు సన్నద్ధమవుతున్నారు.
– కోటగిరి/కామారెడ్డి, ఫిబ్రవరి 14
ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి చదువుతున్న విద్యార్థులపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. పబ్లిక్ పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించేందుకు పక్కా ప్రణాళికలు అమలు చేస్తున్నది. దీనిలో భాగంగా ఉదయం, సాయంత్రం విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. తాజాగా పదో తరగతి విద్యార్థులకు సాయంత్రం స్నాక్స్ అందించాలని నిర్ణయం తీసుకున్నది. అందుకు సంబంధించిన నిధులను డీఈవోలకు మంజూరు చేస్తూ పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో నిజామాబాద్ జిల్లాలోని 263 పాఠశాలల్లోని 9217 మంది విద్యార్థులకు, కామారెడ్డి జిల్లాలోని 191 పాఠశాలల్లోని 7052 మందికి లబ్ధి కలుగుతుంది. నేటి నుంచి ప్రతి పాఠశాలలో యాజమాన్యాలు విద్యార్థులకు స్నాక్స్ అందించనున్నాయి.
అర్ధాకలితో ఉండొద్దు..
ప్రభుత్వ జిల్లా పరిషత్ పాఠశాలల్లో చదువుతున్న పదో తరగతి విద్యార్థులకు నెల రోజుల నుంచి ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. ఉపాధ్యాయులు తరగతుల సమయంలోనే కాకుండా స్పెషల్ క్లాసుల్లోనూ విద్యార్థుల సందేహాలను నివృత్తి చేస్తున్నారు. ఒక్కో సబ్జెక్టుకు ఒక్కో రోజు కేటాయించి వారిని పది పరీక్షలకు సిద్ధం చేస్తున్నారు. పిల్లలు తెల్లవారుజామునే ప్రత్యేక తరగతులకు హాజరవుతున్నారు. ఇంట్లో అప్పటికే తల్లులు వంట వండకపోవచ్చు. పిల్లలు తినే అవకాశం తక్కువ. ఎక్కువ మంది ఆకలితో బాధపడతారు. కొందరు అర్ధకాలితో ఇబ్బందిపడతారు. ఇప్పటికే ప్రతిరోజూ మధ్యాహ్న భోజనం అందజేస్తున్న సర్కారు ఇప్పుడు పది విద్యార్థులకు స్నాక్స్ కూడా అందించనున్నది. సాయంత్రం 5.45 గంటలకు యాజమాన్యాలు విద్యార్థులకు స్నాక్స్ ఇవ్వాల్సి ఉంటుంది.
ఉమ్మడి జిల్లాలో 16,269 మంది విద్యార్థులకు లబ్ధి..
నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా 263 ప్రభుత్వ ఉన్నత పాఠశాల యాజమాన్యాల పరిధిలో 9,217 మంది, కామారెడ్డి జిల్లాలోని 191 పాఠశాలల్లో 7,052 మంది విద్యార్థులు పదో తరగతి చదువుతున్నారు. వీరందరికీ సాయంత్రం పూట స్నాక్స్ అందనున్నాయి. ఏప్రిల్ 1వ తేదీ వరకు నిరంతరాయంగా 34 రోజులపాటు స్నాక్స్ పంపిణీ జరుగుతుంది. ఒక్కో విద్యార్థిపై రోజుకు రూ.15 వెచ్చించేలా సర్కారు నిధులు విడుదల చేసింది. నిజామాబాద్ జిల్లాకు రూ.47,670 లక్షలు, కామారెడ్డి జిల్లాకు రూ.35,96,520 నిధులు విడుదల చేసింది.
ఆనందంగా ఉంది..
నవంబర్ 15వ తేదీ నుంచి ప్రత్యేక తరగతులు కొనసాగుతున్నాయి. ఉదయం 7గంటలకు బయల్దేరి వచ్చి ప్రత్యేక తరగతులకు హాజరవుతున్నాను. సాయంత్రం 5.30 గంటల వరకు నీరసంగా ఉంటుంది. ప్రభుత్వం అల్పాహారానికి నిధులు మంజూరు చేసినట్లు మా ఉపాధ్యాయులు చెప్పడంతో సంతోషం కలిగింది. ఆకలి బాధలేకుండా, చదువుపై దృష్టి సారించి ఉత్తమ ఫలితాలు సాధిస్తా.
-ఈశ్వరీ,10వ తరగతి విద్యార్థిని బస్వాపూర్, కోటగిరి
మంచి ఫలితాలు..
పదో తరగతి విద్యార్థులకు నిర్వహిస్తున్న ప్రత్యేక తరగతులు మంచి ఫలితాలనిస్తున్నాయి. వెనుకబడిన విద్యార్థులపై ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారు. విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించేందుకు కృషి చేస్తున్నారు. విద్యార్థులకు సాయంత్రం స్నాక్స్ అందిస్తాం.
– గాలప్పా, ప్రధానోపాధ్యాయుడు,కోటగిరి
విద్యార్థులకు ప్రయోజనం..
ప్రభుత్వం పదో తరగతి విద్యార్థులను ప్రోత్సహించేందుకు అల్పాహారం అం దించడం అభినందనీయం. పది పరీక్షల్లో మెరుగైన ఫలితాలు సాధించేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నది.
– నాగ్నాథ్, ఎంఈవో,కోటగిరి
ఉత్సాహంతో చదువుకుంటారు..
ప్రభుత్వ ఆదేశాల మేరకు పదో తరగతి విద్యార్థులకు ఉద యం, సాయంత్రం ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నాం. ఉత్తమ ఫలితాల సాధనకు మూడు నెలల పాటు ప్రత్యేక తరగతులు కొనసాగుతాయి. విద్యార్థులు ఆకలితో బాధపడకుండా ఉండేందుకు అల్పాహారం అందించేందుకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. దీంతో విద్యార్థులు ఉత్సాహంగా చదువుకొని ఉత్తమ ఫలితాలు సాధిస్తారు. ప్రభు త్వ పాఠశాలల హెచ్ఎంలు పోషకాహారం అందించాలి.
– దుర్గాప్రసాద్, డీఈవో నిజామాబాద్