మోర్తాడ్, మే 13: వర్షాకాలం సమీపిస్తున్నది.. ఈసారి రుతుపవనాలు వస్తాయని వాతావరణ శాఖ చెబుతున్నది.. ఈ తరుణంలో వరద కాలువ ద్వారా నీటి విడుదలపై సందేహాలు నెలకొన్నాయి. గతేడాది భారీ వర్షాల కారణంగా మోర్తాడ్ మండలం గాండ్లపేట్ సమీపంలోని అక్విడెక్ట్ పక్కన వరద కాలువకు గండి పడింది. దాన్ని పూడ్చేందుకు చేపట్టిన పనులు కొనసా..గుతున్నాయి. ఈ నెలాఖరు వరకు పూర్తవుతాయని ఒకవైపు అధికారులు చెబుతున్నా, కష్టమేనన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రుతుపవనాలు ఈసారి తొందరగా వచ్చే అవకాశం ఉందన్న నేపథ్యంలో వరద కాలువకు సకాలంలో నీటి విడుదల కొనసాగుతుందా అన్న సందేహాలు వెల్లువెత్తుతున్నాయి. వరద కాలువలో నీళ్లు ఉంటేనే పంటల సాగుకు ఢోకా ఉండదు. అయితే, సకాలంలో పూర్తయి వరద కాలువకు నీటిని విడుదల చేయడం ప్రశ్నార్థకంగా మారింది.
కొనసాగుతున్న పనులు..
గతేడాది అక్టోబర్ 9న వరద కాలువకు గండి పడింది. అయితే, గత జనవరి చివర్లో పనులు ప్రారంభమయ్యాయి. దాదాపు నాలుగు నెలలవుతున్నా పనులు ఇంకా పూర్తి కాలేదు. గండి పూడ్చడానికి ప్రభుత్వం రూ.8.5 కోట్లు మంజూరు చేసింది. గండి పడిన సమయంలోనే మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి వెంటనే నిధులు మంజూరు చేసి మరమ్మతు పనులను త్వరితగతిన పూర్తిచేయాలని డిమాండ్ చేసినప్పటికీ, నిధుల విడుదలలో ఆలస్యం, టెండర్ ఖరారు, పనులు ప్రారంభం కావడానికి సమయం పట్టింది.
జనవరి చివర్లో మరమ్మతులు ప్రారంభించారు. అప్పటి నుంచి ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. గండి మరమ్మతులను ఇప్పటికి రెండు, మూడుసార్లు సీఈ సుమతీదేవీ పరిశీలించి, వేగం పెంచాలని సూచించారు. మే నెలాఖరు వరకు పనులు పూర్తవుతాయని అధికారులు మొదటి నుంచి చెప్తున్నారు. అయితే, మరో 15 రోజులు మాత్రమే మిగిలి ఉన్న నేపథ్యంలో నెలాఖరు వరకు పనులన్నీ పూర్తి చేసి, సమయానికి వరద కాలువకు నీళ్లు అధికారులు వదులుతారా? అన్నది సందేహాస్పదంగా మారింది.

ప్రారంభమైన సాగు పనులు..
వానకాలం సాగు పనులను రైతులు ఇప్పటికే ప్రారంభించారు. దుక్కులు దున్ని, ఎరువులు వేసి భూములు సిద్ధం చేశారు. గండి కారణంగా అక్టోబర్ నుంచి వరద కాలువకు అధికారులు నీటి విడుదలను నిలిపి వేశారు. అయితే, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి ఒత్తిడితో మూడుసార్లు రివర్స్ పంపింగ్ ద్వారా వరద కాలువకు నీటిని ఎత్తిపోశారు. దాంతో యాసంగి పంటలు గట్టెక్కాయి. వరద కాలువపైనే ఆధారపడి రైతులు వానకాలం, యాసంగి పంటలను సాగు చేస్తుంటారు.
ఇటువంటి పరిస్థితుల్లో పనులు సకాలంలో పూర్తి చేయడంతో పాటు వరద కాలువకు ఎస్సారెస్పీ ద్వారా నీటివిడుల జరిగేలా చూడాలని రైతులు కోరుతున్నారు. రుతుపవనాలు తొందరగా వస్తాయని అంటున్నా ఎల్‌నినో ప్రభావం కారణంగా వర్షాభావ పరిస్థితులు ఏర్పడితే మాత్రం రైతులకు సాగునీటి ఇబ్బందులు తప్పవు. ఇటువంటి పరిస్థితుల్లో ఈ ప్రాంత రైతులకు వరద కాలువనే వరప్రదాయిని కాబట్టి గండి పనులు ఎప్పుడు పూర్తవుతాయి, వరద కాలువకు నీటివిడుదలను ఎప్పుడు ప్రారంభిస్తారని రైతులు ఎదురు చూస్తున్నారు.
నెలాఖరుకు పూర్తి..
మే నెలాఖరు వరకు గండి పనులు పూర్తవుతాయి. మరమ్మతుల కోసం ప్రభుత్వం రూ.8.5 కోట్లు మంజూరు చేయడం, టెండర్ పూర్తవగానే పనులు ప్రారంభించడం జరిగింది. పనులు వేగంగా జరిగేలా తరచూ పర్యవేక్షిస్తున్నాం. సకాలంలో పూర్తయ్యేలా చూస్తాం.
– లాల్‌సింగ్, ఎస్సారెస్పీ ఈఈ