కామారెడ్డి, జూలై 15: పెన్షనర్ల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కామారెడ్డి కలెక్టరేట్ ఎదుట పెన్షనర్లు సోమవారం నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నాలుగు విడుతలుగా బకాయి ఉన్న కరువు భత్యం వాయిదాలను వెంటనే చెల్లించాలని, ఉద్యోగుల, ఆరోగ్య భద్రత పథకంలో భాగంగా ఈహెచ్ఎస్ కార్డులను అన్ని కార్పొరేట్, ప్రైవేట్ దవాఖానల్లో అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నగదురహిత చికిత్సను అందజేయాలని,జిల్లా కేంద్రంలో వెల్నెస్ సెంటర్ ప్రారంభించి పెన్షనర్లు, ఉద్యోగులకు చికిత్స సదుపాయాలు కల్పించాలని కోరారు. మధ్యంతర భృతి 5శాతం నుంచి 20శాతానికి పెంచాలని, స్పెషల్ టీచర్లకు నోషనల్ ఇంక్రిమెంట్లు మంజూరు చేయాలని అన్నారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న పెన్షనర్లకు ప్రత్యేక ఇన్సెంటివ్ను అందజేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఏపీటీఎఫ్ పూర్వ అధ్యక్షుడు వేణుగోపాల్, టీపీటీఎఫ్ పూర్వ అధ్యక్షుడు రమణ, డీటీఎఫ్ నిజామాబాద్ జిల్లా పూర్వ అధ్యక్షుడు విజయరామరాజు, పెన్షనర్ల బాధ్యులు హన్మంత్ రెడ్డి, శ్రీనివాస్, అంజయ్య, నాగరాజు శర్మ తదితరులు పాల్గొన్నారు.