దైనందిన జీవనంలో ప్లాస్టిక్ వినియోగం విచ్చలవిడిగా పెరిగి పోయింది. చివరకు తినే ఆహారం, తాగే ఛాయ్ సహా అన్నీ కవర్లలోనే మోసుకెళ్లడం అలవాటైంది. అదుపు లేకుండా పోతున్న ప్లాస్టిక్ వాడకంతో పర్యావరణానికి పెను ప్రమాదం ఏర్పడింది. భవిష్యత్తు తరాల మనుగడకు ముప్పుగా మారినా ప్లాస్టిక్‌ను నియంత్రించడంలో అధికార యంత్రాంగం పట్టనట్టు వ్యవహరిస్తున్నది. వాస్తవానికి ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో నిర్దేశిత పరిమాణం కంటే తక్కువ ఉన్న ప్లాస్టిక్‌పై నిషేధం ఉంది. కానీ, దాన్ని అమలు చేయడంలో వైఫల్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నది. అయితే, ప్లాస్టిక్‌ను నియంత్రిస్తున్నామని చెప్పుకోవడానికి అధికారులు అప్పుడప్పుడు తనిఖీలు నిర్వహిస్తుంటారు. ఏదో నాలుగు రోజులు హడావుడి చేసి, ఆ తర్వాత వదిలేస్తారు. మళ్లీ తాజాగా మొన్న బాన్సువాడలో, నిన్న నిజామాబాద్‌లో మున్సిపల్ అధికారులు ప్లాస్టిక్ నియంత్రణపై దృష్టి సారించడం గమనార్హం.
జిల్లాలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగం విపరీతంగా పెరిగింది. కవర్లలోనే అన్నీ మోసుకెళ్తున్నారు. నిత్యావసర సరుకుల నుంచి తినే ఆహార పదార్థాల వరకూ అన్నింటికీ ప్లాస్టికే దిక్కయింది. పల్లెలు, పట్నాలనే తేడా లేకుండా ఎక్కడ చూసినా వాటి వినియోగం విచ్చలవిడిగా పెరిగింది. రోడ్లు, డ్రెయినేజీలు ప్లాస్టిక్ కవర్లతో నిండి పోతున్నాయి. ఆహార వ్యర్థాలను కవర్లలో పెట్టి పాడేయడంతో వాటిని తిని పశువులు మృత్యువాత పడుతున్నాయి. ప్రకృతికి, జీవజాతి మనుగడకు ప్రమాదకరంగా మారిన ప్లాస్టిక్‌ను నియంత్రించాల్సిన బాధ్యతను అధికార యంత్రాంగం పూర్తిగా విస్మరించింది. దీంతో వ్యర్థాల నిర్వహణ స్థానిక సంస్థలకు జఠిలంగా మారింది.
సింగిల్ యూజ్ కవర్లను ప్రభుత్వం గతంలోనే నిషేధించింది. ప్లాస్టిక్ కవర్ల వినియోగంపై సర్కారు స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసింది. 20 మైక్రాన్ కంటే తక్కువ ఉన్న కవర్లను వాడొద్దని స్పష్టం చేసింది. దీంతో అప్పట్లో రాష్ట్రవ్యాప్తంగా అధికారులు కొంత హడావుడి చేశారు. కవర్లను విక్రయించే, వినియోగించే వారిపై జరిమానాలు విధించారు. నాలుగు రోజుల తర్వాత పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది. ఏడాదికోసారి హడావుడి చేయడం, ఆ తర్వాత వదిలేయడం అధికార యంత్రాంగానికి పరిపాటిగా మారింది. ప్రజలంతా ‘యూజ్ అండ్ త్రో’ విధానానికి అలవాటు పడిన తరుణంలో రీసైక్లింగ్ కవర్ల వినియోగాన్ని పెంచితే కొంత మార్పు వచ్చే అవకాశముంది. 20 మైక్రాన్ కంటే ఎక్కువ మందం కలిగిన కవర్ల ద్వారా పర్యావరణానికి ఎలాంటి హానీ కలుగదు. వీటిని రీసైక్లింగ్ చేసి మళ్లీ వినియోగించుకునే అవకాశముంటుంది. వ్యర్థాల నిర్వహణ కూడా సులువుగా మారుతుంది.
ప్లాస్టిక్ వినియోగంపైనే దృష్టి సారిస్తున్న అధికారులు.. అసలు సమస్య మూలాలను విస్మరిస్తున్నారు. వాస్తవానికి సింగిల్ యూజ్ కవర్ల తయారీపై కన్నేస్తే సమస్యకు పరిష్కారం దొరికినట్టే. కానీ అధికారులు ఆ దిశగా చర్యలు చేపట్టకుండా, కేవలం దుకాణాల్లో తనిఖీలకే పరిమితమవుతున్నారు. కనిపించిన కవర్లను పట్టుకుపోతున్నారు తప్పితే శాశ్వత పరిష్కారానికి చర్యలు చేపట్టడం లేదు. నిర్దేశిత ప్రమాణాల మేరకు కాకుండా తక్కువ మైక్రన్ కవర్లు తయారీ చేసే సంస్థలు లేదా వ్యక్తులపై చర్యలు తీసుకుంటే, సింగిల్ యూజ్ కవర్లు బహిరంగ మార్కెట్లో అందుబాటులోనే ఉండవు. తద్వారా ప్లాస్టిక్‌ను నియంత్రించడం సులువుగా మారుతుంది. ఆ దిశగా అధికారులు చర్యలు చేపడితే జీవ జాతితో పాటు పర్యావరణానికి మేలు చేసినవారవుతారు.
ఎల్లారెడ్డి రూరల్, మే 24: దుకాణాదారులు ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించాలని ఎల్లారెడ్డి మున్సిపల్ సిబ్బంది సూచించారు. పట్టణంలోని పలు దుకాణాల్లో వారు శుక్రవారం తనిఖీలు చేపట్టారు. ప్లాస్టిక్ వాడకంతో కలిగే అనర్థాలను దుకాణాదారులకు వివరించారు. నిబంధనలు అతిక్రమిస్తే జరిమానా విధిస్తామని బల్దియా కమిషనర్ శ్రీహరిరాజు హెచ్చరించారు. ఎల్లారెడ్డిని ప్లాస్టిక్ రహిత పట్టణంగా తీర్చిదిద్దేందుకు పట్టణ ప్రజలు, దుకాణాదారులు సహకరించాలని కోరారు.
ఖలీల్‌వాడి, మే 24: విచ్చలవిడిగా ప్లాస్టిక్ వినియోగం పెరిగిపోతున్న తరుణంలో నిజామాబాద్ మున్సిపల్ అధికారులు నిద్ర లేచారు. దుకాణాలు, వ్యాపార సముదాయాల్లో శుక్రవారం తనిఖీలు నిర్వహించారు. మెడికల్ హెల్త్ ఆఫీసర్ (ఎంహెచ్వో) సాజిద్ అలీ తన సిబ్బందితో కలిసి నగరంలోని పలు హోటళ్లను పరిశీలించారు. ప్లాస్టిక్ కవర్లు వాడితే కఠిన చర్యలు తీసుకుంటామని యజమానులను హెచ్చరించారు. పెద్దబజార్‌లోని కూరగాయల సముదాయాలతో పాటు చికెన్ సెంటర్ నిర్వాహకుల వద్ద ఉన్న కవర్లను స్వాధీనం చేసుకున్నారు. మరోసారి ప్లాస్టిక్ కవర్లలో విక్రయిస్తే రూ.2 వేల వరకూ జరిమానా విధిస్తామని హెచ్చరించారు.