వినాయక నగర్(నిజామాబాద్) : జల్సాల కోసం డబ్బులు సంపాదించేందుకు అడ్డదారులు తొక్కిన వ్యక్తి తన స్నేహితున్ని హతమార్చిన ఘటనను పోలీసులు 24 గంటల్లో ఛేదించారు. నిజామాబాద్ ఏసీపీ రాజా వెంకట్ రెడ్డి(ACP Raja Venkat Reddy) తన కార్యాలయంలో నార్త్ రూరల్ సీఐ శ్రీనివాస్ తో కలిసి నిర్వహించిన విలేకరుల సమావేశంలో నిందితుడి వివరాలను వెల్లడించారు.
నిజామాబాద్ (Nizamabad) జిల్లా కేంద్రంలోని నాగారం ప్రాంతంలో బ్రాహ్మణ కాలనీ లో నివాసం ఉండే కండెల సందీప్ (28) వృత్తిరీత్యా ఆటో డ్రైవర్. ఈ నెల 15వ తేదీన సందీప్ ఇంట్లోంచి బయలుదేరిన సమయంలో నాగారం 80 క్వార్టర్స్ లో నివాసముండే బైరగోని సతీష్ గౌడ్ అనే వ్యక్తి సైతం సందీప్ తో కలిసి ఆటోలో వెళ్లాడు. మరుసటి రోజు వరకు సందీప్ తిరిగి రాకపోవడంతో అతని భార్య కండెల లత నిజామాబాద్ 5వటౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా పోలీసులు మిస్సింగ్ కేసు (Missing Case) నమోదు చేశారు.
ఈనెల 17న డిచ్పల్లి సర్కిల్ పరిధిలోని ఇందల్వాయి అటవీ ప్రాంతంలో కాలిపోయిన మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. మృతదేహం ఒంటిపై ఉన్న ఆధారాలను బట్టి మృతుడు నిజామాబాద్ నాగారానికి చెందిన సందీప్ గా పోలీసులు నిర్ధారించారు.
దీంతో మిస్సింగ్ కేసును మర్డర్ కేసుగా నమోదు చేసి నిజామాబాద్ నార్త్ రూరల్ సీఐ శ్రీనివాస్ ఆధ్వర్యంలో 5వ టౌన్ ఎస్సై గంగాధర్ సిబ్బంది కలిసి దర్యాప్తు చేపట్టారు. తన భర్తతోపాటు వెళ్లిన సతీష్ గౌడ్ పైనే మృతుని భార్య అనుమానాలు వ్యక్తం చేయడంతో పోలీసులు అదే కోణంలో దర్యాప్తు చేపట్టారు. దీంతో బుధవారం పోలీసులు తనిఖీలు నిర్వహిస్తుండగా ఆటోలో అనుమానాస్పదంగా కనిపించిన సతీష్ గౌడును అదుపులోకి తీసుకొని విచారించినట్లు ఏసీపీ రాజా వెంకట్ రెడ్డి తెలిపారు.
విచారణలో భాగంగా సందీప్ ను ఇందల్వాయి అటవీ ప్రాంతంలో బండరాయితో మోది హత్య చేసి, అక్కడ ఉన్న గడ్డితో అతని మృతదేహాన్ని తగలబెట్టినట్లు నిందితుడు అంగీకరించినట్లు తెలిపారు. అనంతరం మృతుని ఆటోరిక్షాతో పాటు మొబైల్ ఫోన్లు తీసుకొని హైదరాబాద్‌కు పారిపోయినట్లు నిందితుడు తెలిపాడు. తిరిగి బుధవారం నిజామాబాదుకు రాగా పోలీసులు పట్టుకున్నట్లు వెల్లడించారు .
గతంలో పలు కేసుల్లో నేరస్థుడిగా ఉన్న సతీష్ గౌడ్ పై సందిప్ను చంపిన కేసులో నిందితుడిగా గుర్తించి కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలిస్తున్నట్లు పేర్కొన్నారు. నిందితుడు సతీష్ గౌడ్ పై పలు దొంగతనం కేసులతోపాటు హైదరాబాద్‌లోని వనస్థలిపురంలో ఓ మహిళను హత్య చేసి ఆమె ఒంటిపై ఉన్న నగలను ఎత్తుకెళ్లిన కేసులో సైతం జైలుకు వెళ్లి వచ్చినట్లు ఏసీపీ వివరించారు. ఈ కేసును ఛేదించిన నార్త్ రూరల్ సీఐ శ్రీనివాస్ తో పాటు, ఎస్సై గంగాధర్‌ను, సిబ్బందిని ఏసీపీ అభినందించారు.