నిజామాబాద్, జూన్ 19(నమస్తే తెలంగాణ ప్రతినిధి): తెలంగాణ ఆవిర్భావానికి ముందు ఆరు గంటల కరెంట్ అది కూడా రెండు విడుతలు లేదంటే మూడు అదీ కాకపోతే నాలుగు విడుతల్లో సరఫరా అయ్యేది. అరకొరగా వచ్చే కోతల కరెంట్‌తో పంటలు సరిగా పండక, పారిన మడులే మళ్లీ పారి రైతులు అరిగోస పడేది. అర్ధరాత్రి 12గంటల తర్వాత వచ్చే త్రీఫేజ్ కరెంట్ కోసం పొలాల వద్ద పడిగాపులు కాసేవారు. ఒక్కసారిగా మోటార్లు స్టార్టవ్వడంతో ఎగిరిపోయిన ప్యూజులను మార్చే క్రమంలో ప్రాణాలు కోల్పోయి రోడ్డున పడిన రైతు కుటుంబాలు కోకొల్లలు. దుర్భరమైన దుస్థితిలో నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలో త్రీఫేజ్ విద్యుత్ సరఫరా అస్తవ్యస్తంగా ఉండేది. పేరుకు తొమ్మిది గంటల విద్యుత్ సరఫరా అయినప్పటికీ ఎప్పుడు వస్తుందో ఎవరికీ తెలియని పరిస్థితి. పంటలను కాపాడుకునేందుకు రైతులు పొలాల వద్దనే నిరీక్షించాల్సి వచ్చేది. అధిక ఒత్తిడితో పటాకుల్లా పేలిపోయిన ట్రాన్స్ఫార్మర్లతో ఆర్థికంగా రైతన్నలు అవస్థలు పడిన సందర్భాలు అనేకం. బోరుబావుల్లో సమృద్ధిగా నీరున్నప్పటికీ పంటలకు అందక రైతులు ఆత్మహత్యలు చేసుకున్న ఘటనలున్నాయి. ఉచిత విద్యుత్ హామీని స్వయంగా నెరవేర్చలేక చతికిల బడిన కాంగ్రెస్ పార్టీ తీరు మూలంగా పదేండ్ల క్రితం రైతులు పడిన గోసకు స్వరాష్ర్టానికి తొలి సీఎంగా బాధ్యతలు చేపట్టిన అనతి కాలంలోనే కారు చీకట్లను కేసీఆర్ తొలగించారు. సాగుకు, పరిశ్రమలకు, గృహ అవసరాలకు 24గంటల నిరంతర విద్యుత్‌ను అందించి శభాష్ అనిపించుకున్నారు.
రైతులకే కాకుండా అన్నివర్గాలకు కరెంట్ ఇక్కట్లను సీఎంగా పని చేసినంత కాలం కేసీఆర్ తన దార్శనికత, దూరదృష్టితో దూరం చేశారు. 2014కు మునుపు నిత్యం పవర్ హాలిడేలు ఉండేవి. తద్వారా పిండి గిర్నీ నుంచి జిరాక్స్ సెంటర్ల వరకూ అన్నీ మూసేసుకునేది. వ్యాపారులు పని లేకుండా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పరిశ్రమలు మూతపడ్డాయి. ఉత్పత్తి లేక నష్టాలను చవిచూశాయి. బీఆర్ఎస్ ప్రభుత్వంలో పరిశ్రమలు, గృహ అవసరాలకు నిరంతర విద్యుత్ సక్రమంగా అందింది. పవర్ హాలిడే అన్న పదమే కనిపించలేదు. రైతులకు అందిస్తున్న ఉచిత విద్యుత్ మాదిరిగానే కులవృత్తిని నమ్ముకొని జీవనం సాగిస్తున్న సామాన్య పేద కుటుంబాలకు కేసీఆర్ అండగా నిలిచి వారి బతుకుల్లో వెలుగులు నింపారు. రజక, నాయీబ్రాహ్మణ వర్గాన్ని గతంలో ఎన్నడూ ఏ ప్రభుత్వాలూ పట్టించుకోలేదు. క్షౌరశాలలు, లాండ్రీ షాపులు, దోబీఘాట్లకు 250 యూనిట్లు వరకు విద్యుత్‌ను ఉచితంగా అందించారు. ఇప్పుడీ పథకానికి అతీగతీ లేకుండా పోయింది. నిజామాబాద్ జిల్లాలో 1031 లాండ్రీలు, 1371 సెలూన్లకు 250 యూనిట్ల ఉచిత విద్యుత్ సరఫరా పథకం అమలు చేశారు. కామారెడ్డి జిల్లాలో 686 సెలూన్లు, 477 దోబీఘాట్లకు మేలు చేకూర్చారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ఈ పథకం అమలుపై గందరగోళం చోటు చేసుకున్నది.
నిజామాబాద్ జిల్లాలో మొత్తం 7లక్షల 73వేల విద్యుత్ కనెక్షన్లలో 1,75,765 వ్యవసాయ కనెక్షన్లున్నాయి. కామారెడ్డి జిల్లాలో మొత్తం 3లక్షల 74వేల 46 విద్యుత్ కనెక్షన్లలో 95,901 వ్యవసాయ కనెక్షన్లున్నాయి. ఉమ్మడి జిల్లాలో 2లక్షల 71వేల 666 వ్యవసాయ కనెక్షన్లకు ఉచిత కరెంట్ అందుతున్నది. పల్లెటూర్లలో పండుగలు, ఏదైనా శుభకార్యాలు జరిగినప్పుడు పగటి పూటా అరగంట కరెంట్ కోసం ఆపసోపాలు పడిన నేపథ్యం ఇప్పటికీ విద్యుత్ ఉద్యోగుల, ప్రజల మనసుల్లో స్పష్టంగా ఉన్నది. గృహ, వాణిజ్య వినియోగదారులకు పట్టణ, నగర ప్రాంతాల్లో 4-8 గంటలు, గ్రామాల్లో 12 గంటల వరకు ఏకబిగిన కరెంట్ కోతలుండేవి. పవర్ హాలిడే కొనసాగిన దుర్భర పరిస్థితుల నుంచి దేశం మొత్తమ్మీద తొలిసారిగా రైతులకు 24గంటల ఉచిత విద్యుత్ అందించే స్థాయికి ఎదగడం కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వానికే చెల్లింది. పవర్ జనరేషన్, అందుకు తగిన విధంగా సరఫరా, డిస్కంల ద్వారా పంపిణీ ఇవన్నీ రెండింతలుపైగా మౌలిక సదుపాయాలను కల్పించి అభివృద్ధి చేసుకోవడంతోనే ఉచిత విద్యుత్ ఆటంకాల్లేకుండా సాగింది. కానిప్పుడు చీటికి మాటికీ గృహ అవసరాల్లో కరెంట్ కటకట తప్పడం లేదు. వ్యవసాయానికి చాలా చోట్ల కోతలు పెడుతున్నట్లుగా రైతులు ఆరోపిస్తున్నారు.
బోధన్ రూరల్, జూన్ 19: బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్ కోతలు లేని కరెంటు అందించారు. దీంతో మాకు చాలా వరకు పనులు ఆపుకోవాల్సిన పరిస్థితి ఏర్పడలేదు. చేతినిండా పనులు చేసుకున్నాం. ఏం చేశారో తెలియదు కానీ, బీఆర్ఎస్ ప్రభుత్వం అందించిన కరెంటుతో ఎలాంటి ఇబ్బందులు లేకుండా పనులు చేసుకున్నా. కరెంటు కష్టాలు అనేవి కంటికి కనిపించకుండా పోయాయి.
కేసీఆర్ హయాంలో రాష్ట్రంలో కోతలు లేని విద్యుత్ సరఫరాతో పనులు ఆగకుండా చేసుకున్నాం. ఆర్డర్ల మేరకు కేజ్‌వీల్స్, ట్రాక్టర్ ట్రాలీలు తయారు చేసి రైతులు కోరిన సమయంలో అందించేవాడిని. ఎలాంటి ఇబ్బందులు లేకుండా, కోతలు లేని కరెంటు అందడంతో పనులు సాఫీగా జరిగాయి. నాణ్యమైన, కోతలులేని విద్యుత్ సరఫరా అవ్వడంతోనే పనులు చేసుకున్నాం.
కేసీఆర్ ప్రభుత్వంలో మంచి కరెంటు అందింది. పంటల సాగుకు అనుకూలంగా కరెంటు అందడంతో ఒక్కసారి బోరు స్విచ్ ఆన్ చేసి ఇంటికి వస్తే మళ్లీ పంటకు సరిపోయే నీరు పట్టిన తర్వాతే వెళ్లి మోటరు బంద్ చేసేవాడిని. కరెంటు సరఫరా విషయంలో కేసీఆర్ రైతులకు దేవుడిగా మారాడు. ఏం చేసిండో ఏమో గానీ కరెంటు మాత్రం రైతులకు ఇబ్బంది పడకుండా అందించిండు.