Nizamabad | ఖలీల్ వాడి, నిజామాబాద్ : ఆగస్టు 7న బెంగళూరులో నిర్వహించే ఓబీసీ జాతీయ మహాసభను విజయవంతం చేయాలని బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు నరాల సుధాకర్ విజ్ఞప్తి చేశారు. ఆగస్టు 7న మండల్ సిఫార్సులు అమలులోకి వచ్చిన సందర్భంగా గత 11 సంవత్సరాలుగా జాతీయ స్థాయిలో ఓబీసీ మహాసభలను నిర్వహిస్తున్నట్టు ఆయన తెలిపారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని కేర్ డిగ్రీ కళాశాలలో ఆయన పలువురు నాయకులతో కలిసి కరపత్రాలను సోమవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఈ ఓబీసీ జాతీయ మహాసభ కార్యక్రమానికి బీసీలందరూ పెద్ద ఎత్తున హాజరు కావాలని అన్నారు. దేశవ్యాప్తంగా ఉన్న బీసీలంతా రాజకీయ పార్టీలకు అతీతంగా ఏకం కావాలని, వారిని ఏకతాటిపైకి తీసుకురావడమే లక్ష్యంగా వచ్చే నెల 7న బెంగళూరులో 11వ జాతీయ ఓబీసీ జాతీయ మహాసభను నిర్వహిస్తున్నారని అన్నారు. బీసీ సంక్షేమ సంఘం అన్ని విభాగాల అధ్యక్షులు, కార్యదర్శులు, నేతలతో కలిసి మహాసభకు సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు నరాల సుధాకర్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ఉన్న 80 కోట్ల మంది ఓబీసీల డిమాండ్ల పరిష్కారమే ధ్యేయంగా, రాజకీయ అధికారమే లక్ష్యంగా ఈ మహాసభను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. మండల కమిషన్ సిఫారసులను అమలు చేసిన రోజును పురస్కరించుకుని ఈ ఓబీసీ జాతీయ మహాసభను నిర్వహిస్తున్నామని రాష్ట్ర ఉపాధ్యక్షుడు బుస్సా ఆంజనేయులు పేర్కొన్నారు. ఈ ఏడాది 11వ జాతీయ మహాసభను బెంగళూరులోని డాక్టర్ మన్మోహన్ సింగ్ సిటీ యూనివర్సిటీ ఆడిటోరియంలో నిర్వహిస్తున్నారని తెలిపారు. ఈ మహాసభకు 29 రాష్ట్రాల నుంచి ఓబీసీ ప్రతినిధులు హాజరవుతున్నారని, రాష్ట్ర కార్యదర్శి ఆకుల ప్రసాద్ తెలిపారు. కరపత్రాల ఆవిష్కరణ కార్యక్రమంలో నరాల సుధాకర్ తో పాటు బుస్స ఆంజనేయులు, ఆకుల ప్రసాద్, పోల్కం గంగా కిషన్, దర్శనం దేవేందర్, కరిపే రవీందర్, మాడవేడి వినోద్ కుమార్, శ్రీలత, అపర్ణ, చంద్రమోహన్, రిటైర్డ్ ఎంపీడీవో గౌస్ మొహియుద్దీన్, దారం భూమన్న, గంగాధర్ సురేందర్ మహేష్, సత్యనారాయణ, రవి, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.