నర్సాపూర్, సెప్టెంబర్ 29 : బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలపై దాడి కేసులో హైకోర్టు వ్యాఖ్యలు కాంగ్రెస్ ప్రభుత్వానికి చెంపపెట్టులాంటిదని మాజీ మంత్రి, ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి అన్నారు. మంగళవారం మెదక్ జిల్లా నర్సాపూర్‌లోని తన నివాసంలో మీడియాతో ఆమె మాట్లాడారు. మహిళా ఎమ్మెల్యేలపై పోలీసులు చేసిన దాడి యావత్ దేశం చూసిందని, ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వానికి త్వరలోనే బుద్ధిచెబుతారని పేర్కొన్నారు. దాడి ఘటనపై విచారణ చేయాలని హైకోర్టు ఆదేశిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం 14 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై కేసులు పెట్టించిందని చెప్పారు.
మాజీ ఎమ్మెల్యే వినయ్‌భాస్కర్ ఏఏంజీ దవాఖాన సందర్శనకు వెళ్తే పోలీసులు దాడిచేసి చేయివిరగొట్టారని మండిపడ్డారు. 22-ఏ పై బీఆర్ఎస్ వాదన వినకుండా ప్రతిపక్షపార్టీ ఎమ్మెల్యేలను సభకు రాకుండా బహిష్కరించారని ధ్వజమెత్తారు. వినాయక నిమజ్జనంలో కేసీఆర్ పాటలు పెట్టి యుతవ డ్యాన్స్ చేస్తుంటే ఓర్వలేక డీజేలు బంద్ చేసి మైకులు గుంజుకున్నారని విమర్శించారు. బీఆర్ఎస్ నాయకులు ఎలాంటి తప్పు చేయలేదని కోర్టు తీర్పు ఇచ్చిందని.. ఇప్పటికైనా ప్రభుత్వం ఎన్నికల హామీలు అమలు చేసి, ప్రజల సమస్యలు పరిష్కరించాలని కోరారు.