అక్రమంగా ఇసుక తరలిస్తుండగా రోడ్డు కిందకు వెళ్లిన లారీ దిగబడిపోయింది. ఎంతకీ బయటికి రాకపోవడంతో అక్రమార్కుల గుండెల్లో దడ మొదలైంది. ఆలస్యం చేస్తే తమ దొంగతనం బయట పడుతుందనే భయంతో హుటాహుటిన మినీ జేసీబీని పిలిపించారు. రోడ్డుపైనే ఇసుకను పారబోయించి లారీని అక్కడి నుంచి తరలించారు. నిజామాబాద్ జిల్లా భీమ్గల్ మండలం బెజ్జోరా గ్రామంలో బుధవారం ఈ ఘటన చోటు చేసుకున్నది. స్థానికంగా ఉన్న కప్పలవాగు నుంచి కొంత కాలంగా ఇసుక అక్రమ రవాణా జోరుగా సాగుతున్నది. అధికార పార్టీ నేతల కనుసన్నల్లోనే ఈ తతంగం నడుస్తున్నదని ఇప్పటికే అధికారులకు అనేక ఫిర్యాదులు అందాయి. అయినా అక్రమ రవాణాకు అడ్డుకట్ట పడకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు, లారీ దిగబడిపోయిన చోట రోడ్డుపైనే ఇసుకను పారిబోసి పారిపోయిన వైనంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంత బహిరంగంగా ఇసుక అక్రమ రవాణా జరుగుతున్నా అధికారులు పట్టించుకోక పోవడంపై మండిపడ్డారు.