మోర్తాడ్, జనవరి 15: రైతుల సుదీర్ఘ పోరాటం, అప్పటి నిజామాబాద్ ఎంపీ కవిత కృషితో జిల్లా ప్రజల చిరకాల వాంఛ పసుపు బోర్డు ఏర్పాటు కల నెరవేరిందని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. ఈమేరకు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. నిజామాబాద్ కేంద్రంగా జాతీయ పసుపుబోర్డు ఏర్పాటు అయినందుకు పసుపు రైతులకు శుభాకాంక్షలు తెలిపారు. పసుపుబోర్డు ఏర్పాటు కోసం రైతులు సుదీర్ఘ పోరాటం చేశారని, ఆనాటి ఎంపీ కవితమ్మ నాయకత్వంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరూ అనేక సార్లు సంబంధిత కేంద్ర మంత్రులు, ప్రధానమంత్రిని కలిశారని గుర్తుచేశారు.
పసుపుబోర్డు ఏర్పాటు కోసం కవిత పార్లమెంట్లో గళమెత్తడం లాంటి పారాటాల ఫలితంగా పసుపుబోర్డు ఏర్పాటు కల ఫలించిందని పేర్కొన్నారు. పసుపుబోర్డు ఏర్పాటు కోసం పసుపు పండించే రాష్ర్టాల సీఎంలతో మాట్లాడి ఎమ్మెల్యేలతో కలిసి కేంద్రానికి లేఖలు ఇప్పించడం కోసం కవిత చేసిన కృషిని ఎమ్మెల్యే వేముల గుర్తు చేశారు. ఇప్పటికైనా పసుపు కనీసమద్దతు ధర క్వింటాలుకు రూ.15వేలు ఉండేలా చూడాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సూచిస్తున్నామని పేర్కొన్నారు.
బాల్కొండ నియోజకవర్గంలోని వేల్పూర్‌లో బీఆర్ఎస్ ప్రభు త్వ హయాంలోనే 42 ఎకరా ల్లో టర్మరిక్ స్పైస్‌పార్క్ ఏర్పా టు చేసి రోడ్లు, కంపౌండ్ వాల్ పనులు పూర్తిచేశారని తెలిపారు. ప్రస్తుతం నిజామాబాద్ కేంద్రంగా జాతీయ పసుపు బోర్డు ఏర్పాటైన సందర్భంగా వేల్పూర్‌లో పసుపు ఆధారిత పరిశ్రమలు ఏర్పాటు చేసి ఇక్కడి యువతకు ఉపాధి అవకాశాలు లభించేలా, పసుపునకు డిమాండ్ పెరిగేలా చూసే బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఉందని పేర్కొన్నారు. పసుపు బోర్డు నూతన చైర్మన్‌గా నియాయకమైన పల్లె గంగారెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు.