లోక్‌సభ ఎన్నికల పర్వం ముగిసింది. ప్రజాతీర్పు ఈవీఎంలలో నిక్షిప్తమైంది. అయితే, పెరిగిన పోలింగ్ శాతం ఏ పార్టీకి ప్రయోజనకరం అన్నది ఇప్పుడు ఉభయ జిల్లాల్లో చర్చనీయాంశంగా మారింది. 2019 ఎన్నికల్లో 68.10 శాతం పోలింగ్ నమోదు కాగా, తాజా సమరంలో 71.92 శాతం ఓటింగ్ నమోదైంది. ఓటు హక్కు వినియోగించుకున్న వారిలో పురుషుల కన్నా మహిళా ఓటర్లే అత్యధికంగా ఉన్నారు. వారు ఏ పార్టీ వైపు మొగ్గితే విజయం వారిదేనని విశ్లేషకులు చెబుతున్నారు. తొలి నుంచి కేసీఆర్‌కు మద్దతుగా నిలిచిన మహిళలు ఈసారి కూడా అండగా నిలబడ్డారని, విజయం తమదేనని బీఆర్ఎస్ నాయకులు పేర్కొంటున్నారు. అటు కాంగ్రెస్, బీజేపీ నేతలు సైతం గెలుపు తమదేనని చెబుతున్నారు.
కంఠేశ్వర్, మే 14: సార్వత్రిక సమరం ముగిసింది. గెలుపెవరిదో అన్నది ఉత్కంఠగా మారింది. ఈసారి పెరిగిన పోలింగ్ శాతం ఏ పార్టీకి అనుకూలంగా ఉంటుంది. విజయం ఎవరిని వరిస్తుందన్న దానిపై సర్వత్రా చర్చ జరుగుతున్నది. 2019 ఎన్నికల్లో 68.10 శాతం పోలింగ్ నమోదు కాగా, ఈసారి 71.92 శాతం ఓటింగ్ నమోదైంది. గత ఎలక్షన్ల కన్నా ఈసారి మూడు శాతం పెరగడం బాగానే ఉన్నా అది ఎవరికి లాభిస్తుందన్నది చర్చనీయాంశంగా మారింది. మొత్తం 29 మంది అభ్యర్థులు బరిలో ఉన్నప్పటికీ, ప్రధానంగా బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ మధ్యే పోటీ నెలకొంది. నిన్నటిదాకా ఓట్ల వేటలో బిజీగా గడిపిన నాయకులు ఇప్పుడు విజయావకాశాలపై లెక్కలు వేసుకుంటున్నారు. పెరిగిన పోలింగ్ శాతం తమకే అనుకూలమని అభ్యర్థులు చెబుతున్నారు.
అభ్యర్థుల ఖరారు నుంచి మొదలుకుని ప్రచారం వరకూ బీజేపీ, కాంగ్రెస్ వెనుకబడ్డాయి. బీజేపీ సిట్టింగ్ ఎంపీ ధర్మపురి అర్వింద్‌పై ప్రజల్లోనే కాదు, పార్టీ శ్రేణుల్లోనూ వ్యతిరేకత వెల్లువెత్తింది. పసుపుబోర్డు విషయంలో తమను నమ్మించి వంచించారని రైతాంగంలో తీవ్ర ఆగ్రహం నెలకొంది. ఈ ప్రభావం తాజా ఎన్నికల్లోనూ కనిపించిందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. మరోవైపు, ఇటీవల అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌పైనా ప్రజల్లో వ్యతిరేకత నెలకొంది. ఆరు గ్యారెంటీల పేరుతో ప్రజలను నమ్మించిన హస్తం పార్టీ.. ఐదు నెలలు గడిచినా హామీల అమలులో విఫలమైంది. మరోవైపు, కరెంట్ కోతలు, ధాన్యం సేకరణలో ఇబ్బందులతో కాంగ్రెస్ సర్కారుపై రైతాంగం గుర్రుగా ఉన్నది. అధికార పార్టీపై నెలకొన్న వ్యతిరేకత తాజా ఎన్నికల్లో ప్రస్ఫుటమైందని చెబుతున్నారు.
దాదాపు నెలన్నర పాటు సాగిన ఎన్నికల పర్వంలో బీఆర్ఎస్ ముందువరుసలో నిలిచింది. అభ్యర్థి ఖరారు నుంచి మొదలుకుని ప్రచార పర్వం, పోల్ మేనేజ్మెంట్ వరకూ అన్ని అంశాల్లోనూ ప్రణాళికాబద్ధంగా వ్యవహరించింది. క్షేత్ర స్థాయిలో పటిష్టమైన కేడర్ ఉండడం, బలమైన అభ్యర్థిని బరిలో నిలపడం గులాబీ పార్టీకి సానుకూలంగా మారింది. బీఆర్ఎస్ అభ్యర్థిగా ప్రకటించిన నాటి నుంచే బాజిరెడ్డి గోవర్ధన్ ఎన్నికల సమరంలోకి దూకారు. ప్రత్యర్థుల కన్నా ముందే ప్రచారం ప్రారంభించిన ఆయన.. ఏడు సెగ్మెంట్లను చుట్టేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో ఢీలా పడిన శ్రేణుల్లో.. పార్టీ అధినేత కేసీఆర్ పర్యటన కొత్త జోష్‌ను తెచ్చింది. దీంతో కేడర్ మరింత ఉత్సాహంతో పని చేయడం ఎన్నికల్లో బీఆర్ఎస్కు కలిసొచ్చింది. ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పార్టీ విజయం కోసం తీవ్రంగా శ్రమించారు. పెరిగిన ఓటింగ్ శాతం తమకే అనుకూలమని బీఆర్ఎస్ నేతలు ఘంటాపథంగా చెబుతున్నారు.
నిజామాబాద్ లోక్‌సభ పరిధిలో సోమవారం జరిగిన పోలింగ్‌లో మహిళలే ఎక్కువగా పాల్గొన్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకూ అన్ని పోలింగ్ కేంద్రాల్లో మహిళా ఓటర్లు బారులు తీరారు. లోక్‌సభ పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలోనూ ఇదే పరిస్థితి కనిపించింది. నిజామాబాద్ లోక్‌సభ స్థానంలో మొత్తం 17,04,867 మంది ఓటర్లకు గాను 12,26,133 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇందులో మహిళలే ఎక్కువగా ఉన్నారు. 6,73,629 మంది స్త్రీలు ఓటు వేయగా, 5,52,465 మంది పురుషులు, 39 మంది ఇతరులు ఓటేశారు. మగవారి కన్నా 1.21 లక్షల మంది స్త్రీలు అత్యధికంగా ఓటు వేయడం అభ్యర్థుల గెలుపోటములను నిర్దేశించనున్నది.
కంఠేశ్వర్/ కామారెడ్డి, మే14: నిజామాబాద్ లోక్‌సభ స్థానానికి నిర్వహించిన ఎన్నికల్లో 71.92శాతం పోలింగ్ నమోదైనట్లు రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ రాజీవ్ గాంధీ హన్మంతు మంగళవారం తెలిపారు. మొత్తం 17,04,867 ఓటర్లకు 12,26,133 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారని వెల్లడించారు. ఓటింగ్‌లో పాల్గొన్న వారిలో మహిళా ఓటర్ల సంఖ్య 6,73,629 ఉండగా, పురుష ఓటర్లు 5,52,465 మంది, ఇతరులు 39 మంది ఓటు వేశారని అన్నారు. పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలోని అయా అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా పోలైన ఓటింగ్ ఇలా ఉన్నది.