భీమ్‌గల్,జూన్ 16: భీమ్‌గల్‌లో ఇసుక అక్రమ రవాణా దందా మూడు పువ్వులు.. ఆరుకాయలు అన్నచందంగా నడుస్తున్నది. కొంతకాలంగా ఇసుక అక్రమ రవాణా యథేచ్ఛగా కొనసాగుతున్నది. ఉదయం కప్పల వాగులోనుంచి డంపు చేయడం, రాత్రి అయ్యిందంటే భారీ లారీల్లో రవాణా చేస్తున్నారు. ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయాల్సిన అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తుండడంతో ప్రభుత్వానికి లక్షల రూపాయల్ల్లో గండి పడుతున్నది. సామాన్యులు ప్రభుత్వానికి చలాన్ కట్టినా దొరకని ఇసుక.. అక్రమదారులకు మాత్రం సులభంగా లభించడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. బహిరంగంగానే ఇసుక అక్రమ రవాణా జరుగుతున్నా అధికారులు చర్యలు తీసుకోవడంలో వెనుకడుగు వేయడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ప్రభుత్వం మారడంతో ఇసుక అక్రమ రవాణాకు రెక్కలొచ్చాయి. గత ప్రభుత్వంలో ఇసుక రవాణాపై కఠిన ఆంక్షలు ఉండడంతో అక్రమ రవాణాకు వీలు లేకుండాపోయింది. ప్రస్తుతం అధికార పార్టీకి చెందిన నాయకులు యథేచ్ఛగా ఇసుక అక్రమ రవాణా మొదలు పెట్టారు. ఇంత జరుగుతున్నా అధికారులు తమకు పట్టనట్లు వ్యవహరిస్తుండడం పలు అనుమానాలకు తావిస్తున్నది.
భీమ్‌గల్ మండలంలో ఇసుక అక్రమ రవాణాను ప్రశ్నించిన విలేకరిపై అధికార పార్టీ నాయకుడు బెదిరింపులకు పాల్పడ్డాడు. తిట్ల పురాణం మొదలు పెట్టాడు. ఇసుక రవాణాకు అనుమతి ఉందా అని ప్రశ్నించడంతో లారీడ్రైవర్ సదరు పార్టీ నాయకుడికి ఫోన్లో సమాచారం ఇచ్చాడు. దీంతో ఆ నాయకుడు ఫోన్లో విలేకరిపై తిట్ల దండకం మొదలు పెట్టి బెదిరింపులకు పాల్పడ్డాడు. నీ ఇష్టం వచ్చిన చోట చెప్పుకో అంటూ దుర్భషలాడాడు. ప్రస్తుతం ఆ మాటల రికార్డింగ్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నది.
ఇసుక అక్రమ రవాణపై కఠినంగా వ్యవహరిస్తున్నాం. ఇది వరకే అక్రమంగా ఇసుక తరలిస్తున్న వాహనాలను సీజ్‌చేసి సంబంధిత శాఖ అధికారులకు అప్పజెప్పాం. ఇసుక రవాణాకు ప్రభుత్వ అనుమతులు తప్పనిసరి. అక్రమంగా ఇసుక తరలిస్తే చర్యలు తీసుకుంటాం.