ఇందూరుకు మణిమకుటంగా మారిన ఐటీ హబ్ నిర్మాణం దాదాపు పూర్తి కావొచ్చింది. త్వరలోనే ప్రారంభోత్సవానికి ముస్తాబవుతున్నది. రూ.50 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న ఐటీ టవర్ సరికొత్త సాంకేతిక విప్లవానికి బాటలు వేయనున్నది. హైదరాబాద్‌కే పరిమితమైన ఐటీ రంగాన్ని దిగువ శ్రేణి నగరాలకూ విస్తరించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. అందులో భాగంగానే నిజామాబాద్‌లో ఐటీ టవర్ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఇది దాదాపు పూర్తి కావొచ్చింది. ఇదే అంశాన్ని మంత్రి కేటీఆర్ శనివారం ట్విట్టర్లో వెల్లడించారు.
నిజామాబాద్, డిసెంబర్ 17(నమస్తే తెలంగాణ ప్రతినిధి): నిజామాబాద్ జిల్లా కేంద్రంలో నిర్మిస్తున్న ఐటీ టవర్ అతి త్వరలోనే ప్రారంభోత్సవానికి ముస్తాబవు తున్నది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఐటీ టవర్ నిర్మాణ పనులు వంద శాతం పూర్తయ్యాయి. ఈ మేరకు ఐటీ, పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ఈ మేరకు ట్విట్టర్లో తాజా ఫొటోలతో వివరాలను పోస్టు చేశారు. కొద్ది రోజుల్లోనే ప్రారంభించనున్నట్లు ఆయన వెల్లడించారు. ఐటీ మంత్రి ప్రకటనతో త్వరలోనే నిజామాబాద్ నగర పర్యటనకు పురపాలక మంత్రి రానున్నట్లుగా స్పష్టమవుతున్నది. హైదరాబాద్‌లో కేంద్రీకృతమైన ఐటీ కంపెనీలను రాష్ట్ర వ్యాప్తంగా ద్వితీయ శ్రేణి నగరాలకు విస్తరించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఆలోచన చేసింది. ఇందులో భాగంగా పలు జిల్లాల్లో ఇప్పటికే ఐటీ టవర్ సేవలు ప్రారంభం కాగా వేల మందికి ఉద్యోగ అవకాశాలను సొంతూర్లలోనే కల్పించారు. ఇప్పుడు నిజామాబాద్ వంతు వచ్చింది. రూ.50 కోట్ల నిధులతో నిర్మాణమైన ఈ భవనం అత్యద్భుతంగా తీర్చిదిద్దారు. నూతన కలెక్టరేట్ పక్కనే అధునాతన రీతిలో ఐటీ టవర్ నెలకొన్నది.
రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ చొరవతో గడిచిన ఎనిమిదేండ్లలో పారిశ్రామిక అభివృద్ధి రాకెట్ వేగంతో దూసుకుపోతున్నది. ఆకర్షణీయమైన పారిశ్రామిక అనుకూల విధానాలతో తెలంగాణకు దిగ్గజ పరిశ్రమలు, ఐటీ సంస్థలు పెట్టుబడులకు వరుస కడుతున్నా యి. అంతేకాకుండా పాత కంపెనీలు తమ కార్యకలాపాలను విస్తరించే పనిలోనూ నిమగ్నమయ్యాయి. ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను అందిపుచ్చుకుంటున్న ఐటీ కంపెనీలు తమ వ్యాపార సామర్థ్యాన్ని పెంచుకుంటుండగా దేశంలో హైదరాబాద్ ఐటీ హబ్‌గా వెలుగులీనుతున్నది. ఈ దశలోనే రాష్ట్ర ప్రభుత్వం ఐటీ కంపెనీల పెట్టుబడులను జిల్లాలకు మళ్లించే పనిపై మంత్రి కేటీఆర్ దృష్టి సారించారు. నిజామాబాద్ వంటి నగరాలకు ఐటీ సంస్థల కార్యకలాపాలకు అవకాశం కల్పించేలా ఏర్పాట్లు చేశారు. బైపాస్ రోడ్డులోని నూ తన కలెక్టరేట్ బంగ్లా పక్కనే సువిశాలమైన ప్రభుత్వ స్థలంలో ఐటీ టవర్ నిర్మించారు. టీఎస్ఐఐసీ ఆధ్వర్యంలో చేపట్టిన భవన నిర్మాణం పూర్తికావడంతో త్వరలోనే ప్రారంభోత్సవం అట్టహాసంగా జరగనున్నది.
అభివృద్ధిలో దూసుకుపోతున్న నిజామాబాద్ నగరానికి ఐటీ కంపెనీల వెలుగులు తోడవ్వబోతున్నాయి. జాతీ య, అంతర్జాతీయ స్థాయిలో పేరు, ప్రఖ్యాతులు కలిగిన సంస్థలు ఈ ఐటీ టవర్‌లో తమ కార్యకలాపాలను ప్రారంభించనున్నాయి. తద్వారా స్థానిక యువతకు పెద్ద ఎత్తున అవకాశాలు కల్పిస్తారు. ఐటీ కొలువంటే కేవలం హైదరాబాద్, పుణె, బెంగళూర్ కాకుండా నిజామాబాద్ వంటి నగరాలకు సుసాధ్యం చేస్తూ తెలంగాణ సర్కారు తీసుకున్న నిర్ణయంపై సర్వత్రా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. నిజామాబాద్‌లో ఏర్పాటు చేయబోతున్న ఐటీ టవర్‌ను రాష్ట్రంలోనే అత్యుత్తమంగా నిలిపేందుకు నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్ గుప్తా, ఎన్ఆర్ఐ బిగాల మహేశ్ గుప్తా తీవ్రంగా కృషి చేస్తున్నారు. ఇద్దరు సోదరులు ప్రత్యేకంగా చొరవ తీసుకుని పేరొందిన ఐటీ కంపెనీలు నిజామాబాద్‌కు తరలి వచ్చేలా ఒప్పందాలు సైతం చేసుకున్నారు. పలుమార్లు విదేశీ పర్యటనలో ఈ మేరకు చర్చోపచర్చలు సైతం చేశారు. నిజామాబాద్ నగరంలో ఐటీ నిపుణులకు కొరత లేదు. అనేక మంది యువతీ, యువకులు బీటెక్, ఎంటెక్ పూర్తి చేసి ఉన్నారు. స్థానికంగా ఉద్యోగం చేసేందుకు ఉవ్విళ్లూరుతున్నారు.
నిజామాబాద్ నగరంలోని గిరిరాజ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల సమీపంలో బైపాస్ రోడ్డుకు ఆనుకుని ఉన్న 3.5 ఎకరాల ప్రభుత్వ భూమిని ఐటీ టవర్‌కు కేటాయించారు. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని నిజామాబాద్ నగరాభివృద్ధిని అంచనా వేసుకుని ఈ ప్రాంతాన్ని ఎంపిక చేశారు. రూ.50కోట్ల వరకు ప్రభుత్వం నిధులు వెచ్చించింది. 2018, ఆగస్టు 1వ తారీఖున ఐటీ టవర్ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఐటీ టవర్‌ను సువిశాలంగా నిర్మించారు. మొత్తం 49,460 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మాణాన్ని ఆకట్టుకునే రీతిలో చేపట్టారు. గ్రౌండ్ ఫ్లోర్‌తో కలుపుకుని మూడు అంతస్తులతో ఈ నిర్మాణాన్ని పూర్తి చేశారు. ఎకరం భూమిలో ఐటీ టవర్‌ను డిజైన్ చేశారు. మిగిలిన 2.5 ఎకరాల భూమిని భవిష్యత్తులో ఐటీ టవర్‌ను విస్తరించాలనుకున్నా ఎలాంటి ఇబ్బందులు లేకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ప్రస్తుతం పార్కింగ్, లాన్, ఇతర సౌకర్యాల కల్పనకు ఈ ఖాళీ భూమిని వాడారు. బైపాస్ రోడ్డుపై అద్దాల మేడ మాదిరిగా ఐటీ టవర్ ఇప్పుడు చూపరులను విశేషంగా ఆకట్టుకుంటున్నది.