నిజామాబాద్ జిల్లా కేంద్రంలో శుక్రవారం నిర్వహించిన ఐటీ హబ్ జాబ్‌మేళాకు విశేష స్పందన లభించింది. వేలాదిగా తరలివచ్చిన యువతతో ఆ ప్రాంగణమంతా కిక్కిరిసి పోయింది. 30 కంపెనీలు నిర్వహించిన ఇంటర్వ్యూలకు 13 వేల మంది హాజరయ్యారు. జాబ్‌మేళా ప్రారంభానికి ముందు ఎమ్మెల్సీ కవిత యువతనుద్దేశించి ప్రసంగించారు. ఐటీహబ్ కేవలం ఉద్యోగాలు ఇచ్చేందుకే కాదు.. ఉద్యోగాలు సృష్టించేందుకు దోహదం చేస్తుందని చెప్పారు. జాబ్ రాకపోతే నిరుత్సాహపడొద్దని, మరోసారి ప్రయత్నం చేయాలని కవిత సూచించారు. ఎమ్మెల్యే గణేశ్‌గుప్తా, జడ్పీ చైర్మన్ విఠల్‌రావు, బీఆర్ఎస్ నేత మహేశ్ బిగాల పాల్గొన్నారు.
– ఖలీల్‌వాడి, జూలై 21
ఖలీల్‌వాడి, జూలై 21: నిజామాబాద్ నగరంలో రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా నిర్మించిన ఐటీ హబ్‌లో ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు శుక్రవారం జాబ్‌మేళా నిర్వహించారు. నగరంలోని భూమారెడ్డి ఫంక్షన్ హాల్లో ఏర్పాటుచేసిన జాబ్‌మేళాకు అభ్యర్థులు వేల సంఖ్యలో తరలివచ్చారు. ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీ కవిత, నిజామాబాద్ అర్బన్ ఎమ్మెలే బిగాల గణేశ్ గుప్తాతో పాటు బీఆర్ఎస్ ఎన్నారై సెల్ గ్లోబల్ కన్వీనర్ మహేశ్ బిగాల, జడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠల్‌రావు హాజరయ్యారు.
విశేష స్పందన..
జాబ్‌మేళాకు భారీ స్పందన లభించింది. గతంలో ఎన్నడూ లేని విధంగా యువతీ యువకులు వర్షాన్ని సైతం లెక్క చేయకుండా పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. జాబ్‌మేళా కోసం అత్యధికంగా 13వేల 600 మంది రిజిస్ట్రేషన్ చేసుకోగా, ఏకంగా 13వేలకు పైగా అభ్యర్థులు హాజరయ్యారు. దీంతో రెండు ఫంక్షన్ హాళ్లు కిక్కిరిసిపోయాయి. అభ్యర్థుల వివరాలను నమోదు చేసేందుకు 13 స్టాళ్లను ఏర్పాటు చేశారు. ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు మొత్తం 30 విదేశీ, స్వదేశీ సంస్థలు హాజరై అభ్యర్థులకు ఇంటర్వ్యూలు చేశాయి. ఊహించని విధంగా యువతీ యువకులు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో వారికి ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. మధ్యాహ్నం భోజన సదుపాయం కల్పిచడంపై అభ్యర్థులు హర్షం వ్యక్తంచేశారు. ఎమ్మెల్సీ కవిత యువతకు విలువైన సూచనలు చేసి యువతను ఉత్సాహపర్చారు. ఐటీ హబ్‌ను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
యువతకు అవకాశాలు కల్పిస్తూనే ఉంటాం : అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్‌గుప్తా
ఆసక్తి ఉన్న స్థానిక యువతీ యువకులందరికీ ఉద్యోగాలు కల్పించేందుకు అవకాశాలను కల్పిస్తూనే ఉంటామని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్‌గుప్తా అన్నారు. నగరంలో ఏర్పాటుచేసిన జాబ్‌మేళాలో ఆయన మాట్లాడారు. అభ్యర్థులెవరూ నిరుత్సాహపడొద్దని సూచించారు. త్వరలోనే మరిన్ని జాబ్‌మేళాలను నిర్వహిస్తామని తెలిపారు. నగరానికి మరిన్ని సంస్థలను రప్పించి అవకాశాలు కల్పించే బాధ్యత తమదేనన్నారు. యువత తమ స్కిల్స్ ప్రదర్శించి అవకాశాలను అందిపుచ్చుకోవాలని సూచించారు. జాబ్ మేళాలో 30 కంపెనీలు పాల్గొన్నాయని, యువతీ యువకులు పెద్ద సంఖ్యలో హాజరుకావడం సంతోషంగా ఉందన్నారు.
సంతోషంగా ఉంది..
నిజామాబాద్‌లో ఇంతపెద్ద జాబ్‌మేళా నిర్వహించడం సంతోషం. ఇలా ఉంటుందని ఊహించలేదు. చాలా కంపెనీలు వచ్చాయి. అభ్యర్థులు కూడా చాలా మంది వచ్చారు. పోటీ ఉంటుంది. స్కిల్స్ ఉంటే తప్పకుండా జాబ్ వస్తుంది.
-నందు, నిజామాబాద్
ఇంత పెద్ద జాబ్‌మేళా తొలిసారేమో..
నిజామాబాద్ ఐటీహబ్‌లో జాబ్ చేయాలని అందరూ అనుకుంటారు. చాలా పెద్ద ఎత్తున జాబ్‌మేళా నిర్వహించారు. జిల్లాలో ఇంత భారీ స్థాయిలో జాబ్‌మేళా ఏర్పాటు చేయడం ఇదే మొదలిసారి కావచ్చు.
-శ్రీయ, నిజామాబాద్
చాలా కంపెనీలు వచ్చాయి..
జాబ్‌మేళాకు వేల సంఖ్యలో అభ్యర్థులు వచ్చారు. రిజిస్ట్రేషన్ కోసం చాలా పెద్ద క్యూ ఉండె. నావంతు కోసం చాలాసేపు నిలబడ్డా. ఉద్యోగాలు కల్పించేందుకు చాలా కంపెనీలు రావడం అభినందనీయం
-సుష్మ, ధర్పల్లి
ఐటీహబ్‌లో జాబ్ వస్తే సంతోషం..
నిజామాబాద్ ఐటీ హబ్‌లో జాబ్ వస్తే బాగుటుంది. కానీ వేల మంది అభ్యర్థులు వచ్చారు. స్కిల్స్ ఉన్నవారికి ఉద్యోగ అవకాశం ఉంటుంది. ఇక్కడే జాబ్ వస్తే ఆనందంగా చేస్తా.
-ఆర్తి , నిజామాబాద్