సిరికొండ, మే 24: మండలంలోని గడ్కోల్ గ్రామంలో అర్ధరాత్రి ఇసుక రవాణా చేస్తున్న కాంగ్రెస్ నాయకులకు చెందిన ట్రాక్టర్లను గ్రామస్తులు పట్టుకున్న విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇసుక ట్రాక్టర్లను అడ్డుకొని పోలీసులకు సమాచారం ఇవ్వగా, వారు ట్రాక్టర్లను సీజ్ చేయకుండా వారి వెంట తీసుకెళ్లి వదిలేశారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఇసుక అక్రమ రవాణా వెనుక కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ నాయకుడు, ఆయన ప్రధాన అనుచరుడు ఉన్నందున పోలీసులు దగ్గరుండి ట్రాక్టర్లను విడిపించారని మండిపడుతున్నారు.
ఇసుకను తరలించవద్దని తాము ఎన్నిసార్లు చెప్పినా కాంగ్రెస్ నాయకులు పట్టించుకోవడంలేదని ఆరోపించారు. ఇసుక రవాణాకు స్థానిక రెవెన్యూ, పోలీసు అధికారులు పూర్తి సహకారం అందిస్తున్నారని, వారికి ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. అధికారులే ఇసుక అక్రమ రవాణా చేసే వారికి సహకరిస్తే ఇక తాము ఎవరికీ చెప్పుకోవాలని గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు. ఈ విషయంపై ఆర్ఐ నాగన్నను వివరణ కోరగా ఇద్దరికి అనుమతులు ఇచ్చామని తెలిపారు. కానీ ఇసుక పాయింట్ ఇచ్చిన చోట కాకుండా మరో చోట నుంచి ఇసుకను ట్రాక్టర్ల ద్వారా తరలిస్తుండగా గ్రామస్తులు అడ్డుకున్నారని చెప్పారు. ఆ ట్రాక్టర్లను శనివారం తమ కార్యాలయానికి తరలించినట్లు తెలిపారు. ఇదే విషయమై ఎస్సై రామకృష్ణను వివరణ కోరగా జీపీవో అందజేసిన అనుమతి పత్రాలను పరిశీలించి అనుమతి పొందినవిగా నిర్ధారించి రెవెన్యూ అధికారులకే ట్రాక్టర్లను అప్పజెప్పినట్లు తెలిపారు.