కంటేశ్వర్, మార్చి 9 : నిజామాబాద్ జర్నలిస్టుల చిరకాల కోరిక అయిన ఇళ్ల స్థలాల సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, త్వరితగతిన పరిష్కరించేందుకు కృషి చేస్తానని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ హామీ ఇచ్చారు. విధి నిర్వహణలో జర్నలిస్టులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తాము గుర్తిస్తున్నామని, వారి ఆరోగ్య భద్రత (హెల్త్ కార్డ్స్) విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటామని తెలిపారు. ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీతో కలిసి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. వార్తల సేకరణలో వాస్తవాలకు ప్రాధాన్యతనిస్తూ, పేదల గొంతుకగా నిలవాలని, టీఆర్పీ రేటింగ్ గురించి , ఆలోచించకుండా వాస్తవాలు మాత్రమే వెలుగులోకి తీసుకు రావాలని సూచించారు. ప్రభుత్వానికి, ప్రజలకు వారధిగా మీడియా నిలవాలని అన్నారు. జర్నలిస్టుల సంక్షేమం కోసం ఎమ్మెల్సీగా తన మద్దతు కొనసాగుతుందని స్పష్టం చేశారు. నిజామాబాద్ జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు పంపిణీకి ప్రభుత్వంతో మాట్లాడి త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ అన్నారు.
ఈ కార్యక్రమంలో నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి, నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధనపాల్ సూర్యనారాయణ గుప్తా, మీరు ఉమారాణి, ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహర్బిన్ హుందాన్, డీసీసీ అధ్యక్షుడు నగేష్ రెడ్డి, నూతన ప్రెస్ క్లబ్ కార్యవర్గం, సీనియర్ పాత్రికేయులు పాల్గొన్నారు.