Pocharam Srinivas Reddy | పోతంగల్, నవంబర్ 24 : నాణ్యమైన విద్యను అందించడమే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలలను కట్టిస్తున్నదని వ్యవసాయ సలహాదారు ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. పోతంగల్ మండలంలోని సోంపూర్ శివారులో గల పీఎస్ఆర్ నగర్ లో రూ.200 కోట్లతో నిర్మించనున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల నిర్మాణానికి ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి, జహీరాబాద్ ఎంపీ సురేష్ శేట్కర్, రాష్ట్ర ఆగ్రోస్ చైర్మన్ కాసుల బాలరాజు, స్థానిక నాయకులతో కలిసి సోమవారం భూమి పూజ చేశారు.
అనంతరం ఏర్పాటు చేసిన సభలో వారు మాట్లాడారు. అంతర్జాతీయ విద్యా ప్రమాణాలతో కూడిన నాణ్యమైన విద్యను అందించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలలు ఏర్పాటు చేస్తుందని అన్నారు. పాఠశాలల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ పిల్లలందరూ కులమతాలకు అతీతంగా చదువుకుంటారని చెప్పారు. ఈ పాఠశాలల్లో చదువుతో పాటు, అన్ని వసతులు ఉంటాయని అన్నారు. పాఠశాలలో 2500పైగా విద్యార్థులు విద్యను అభ్యసిస్తారని అన్నారు. అనంతరం మహిళలకు ఇందిరమ్మ చీరలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బోధన్ సబ్ కలెక్టర్ శ్రీ వికాస్ మహతో, అధికారులు స్థానిక నాయకులు పాల్గొన్నారు.