నిజామాబాద్ క్రైం, మే 14 : జిల్లా కేంద్రంలో రెండు రోజుల క్రితం జరిగిన చైన్ స్నాచింగ్, సెల్‌ఫోన్ చోరీ కేసును నాలుగో టౌన్ పోలీసులు 24 గంటల్లోనే ఛేదించారు. ఇద్దరు నిందితులను అరెస్టు చేసి, రిమాండ్‌కు తరలించారు. నగర సీఐ వి.వెంకటనారాయణ తన కార్యాలయంలో ఎస్సై సందీప్‌తో కలిసి ఆదివారం సమావేశం ఏర్పాటు చేసి ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. నగరంలోని ఆర్యనగర్ గూడెంలో నివాసం ఉండే మేకల శ్రావణి ఈ నెల 12వ తేదీన ఉదయం 10 గంటల సమయంలో వినాయక్‌నగర్ న్యూహౌసింగ్ బోర్డ్ కాలనీలోని అమరవీరుల పార్క్ నుంచి సెల్‌ఫోన్ మాట్లాడుతూ నడుచుకుంటూ వెళ్తున్నది.
అదే సమయంలో డియో స్కూటీపై కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం వెల్లుట్ల గ్రామానికి చెందిన పశులది చంద్రశేఖర్ (20) (ప్రస్తుతం వినాయక్‌నగర్‌లో ఉంటున్నాడు), వినాయక్‌నగర్‌కు చెందిన బోడికల తేజ (20) (ప్రస్తుతం నాగారాంలో ఉంటున్నాడు) తో కలిసి సెల్‌ఫోన్, మెడలో నుంచి రోల్డ్ గోల్డ్ చైన్‌ను చోరీ చేసి పారిపోయారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని నగరంలోని పలు ప్రాంతాల్లో ఉన్న సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలించిన పోలీసులు.. 24 గంటల వ్యవధిలోనే నిందితులను పట్టుకున్నారు. వీరు చోరీకి పాల్పడినట్లు ఒప్పుకున్నారు. వారి నుంచి చోరీ చేసిన సెల్‌ఫోన్‌తోపాటు రోల్డ్ గోల్డ్ చైన్‌ను స్వాధీనం చేసుకున్నారు. వారు వినియోగించిన ద్విచక్రవాహనాన్ని సీజ్ చేశారు. కేసు నమోదు చేసుకొని రిమాండ్‌కు తరలించారు.
100 ఫీట్ల రోడ్డు వద్ద రెక్కీ నిర్వహించిన నిందితులు..
సదరు యువతి వద్ద చోరీకి పాల్పడిన ఇద్దరు నిందితులు 10 నిమిషాల ముందు వినాయక్ నగర్‌లోని 100 ఫీట్ల రోడ్డు వద్ద రెక్కీ నిర్వహించారు. ఓ మహిళ నుంచి చైన్ స్నాచింగ్ చేయాలని అనుకున్నా.. ఆమె కుమారుడు కూడా వెంట ఉండడంతో చోరీ ఆలోచనను విరమించుకున్నారు. అనంతరం హౌసింగ్‌బోర్డ్ కాలనీ ప్రాంతంలో యువతి వద్ద చోరీకి పాల్పడ్డారు.
ప్రేమ వివాహం చేసుకొని.. ఇల్లు గడవడం కష్టంగా మారడంతోనే స్నాచింగ్..
నిందితులో ఒకడైన పశులది చంద్రశేఖర్ కొన్ని రోజుల క్రితం ఓ యువతిని ప్రేమ వివాహం చేసుకున్నాడు. పనిలేక తిరుగుతున్న ఈ యువకుడి వద్ద డబ్బులు లేకపోవడం, ఇల్లు గడవడం కష్టంగా ఉండడంతో చోరీ చేసేందుకు ప్లాన్ వేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. డబ్బుల కోం తేజ అనే యువకుడితో కలిసి చోరీకి పాల్పడినట్లు తెలిపారు. చోరి కేసును ఛేదించిన ఫోర్త్ టౌన్ ఎస్సై సందీప్, సీహెచ్.తిరుపతితో పాటు సిబ్బంది రమేశ్, నీలేశ్, వేణును సీఐ అభినందించారు.