నిజామాబాద్, డిసెంబర్ 18, (నమస్తే తెలంగాణ ప్రతినిధి): పెద్ద పులి ప్రాణాలతో అటవీ శాఖ చెలగాటం ఆడుతోంది. సంరక్షించాల్సిన అటవీ అధికారులే తీవ్ర నిర్లక్ష్యం వహిస్తుండడంతో క్రూర మృగం ప్రాణాలకు ముప్పు ఏర్పడినట్లే కనిపిస్తోంది. ఎస్12 పులి విషయంలో ఇదే రకమైన తీరును ప్రదర్శించి దాని ఆచూకీ గల్లంతు చేశారు. ఇప్పుడు కూడా అదే స్థాయిలో పట్టింపులేని తనంతో ఉండటంతో మూడేళ్ల పులి మనుగడపై అనుమానాలు కలుగుతున్నాయి. జిల్లా సరిహద్దు దాటితే చాలు అన్నట్లుగా అటవీ శాఖ అధికారులు ప్రయత్నిస్తున్నారు.
కానీ ఎక్కడ కూడా పులి సంరక్షణ కోసం పటిష్టమైన ఏర్పాట్లు చేయడం లేదు. పక్క జిల్లా అటవీ అధికారులతోనూ సమన్వయం చేసుకోవడంలో మెరుగైన ఫలితాలు రాబట్టడం లేదు. కామారెడ్డి జిల్లాకు పులి రావడాన్ని ఒక గర్వకారణంగా భావించాల్సి ఉండగా ఇటువైపు ఎందుకు వచ్చిందన్నట్లుగా తలలు పట్టుకునే స్థితిలో అటవీ శాఖలో కొద్ది మంది అధికారులు ప్రవర్తిస్తుండడం విడ్డూరంగా మారింది. పులి సంచారం మూలంగా జీవ వైవిధ్యానికి ఆయువు పోషినట్లు అవుతుంది. పులి ఆవసానికి శాశ్వత ఏర్పాట్లు చేస్తే అటవీ క్షేత్రాల పరిరక్షణ సులువు అవుతుంది. ఇదంతా పక్కన పెట్టి ఎంత సేపు చేతులు దులుపుకొనేందుకే ఆరాటం కనిపిస్తోందంటూ ప్రజలంతా మండిపడుతున్నారు.
బెదిరిన పెద్ద పులి..
పెద్ద పులి రాజసంగా బతుకుంది. కడుపు నిండా ఆహారాన్ని సేకరించి సేద తీరడం దానికి నిత్యకృత్యమైన అలవాటు. ఒకసారి వేట చేసిన తర్వాత కొద్ది గంటల పాటు విశ్రాంతి తీసుకోవడం పులి చేసే దినచర్య. అలాంటిది డిసెంబర్ 15, 16 తేదీల్లో 24గంటల వ్యవధిలోనే మూడు గ్రామాల్లో మూడు పశువులపై దాడికి ఎగబడడం వెనుక అనేక కారణాలు ఉన్నట్లుగా వన్యప్రాణి ప్రేమికులు అంచనా వేస్తున్నారు. ఒక సారి పశువును దాడి చేసిన తర్వాత తిరిగి కొద్ది గంటల తర్వాత కార్కాస్ను తినేందుకు పులి తప్పక వస్తుంది. జంతువును చంపిన తర్వాత 500 చదరపు మీటర్ల నుంచి ఒక చదరపు కిలో మీటర్లలోపే తిష్ట వేసుకుని ఉంటుంది. మాచారెడ్డి, దోమకొండ, భిక్కనూర్ ప్రాంతాల్లో వెలుగు చూసిన అంసాల్లో వెంట వెంటనే పులి దాడులకు తెగబడింది.
అంటే కార్కాస్ కోసం వెళ్లేందుకు సురక్షితమైన వాతావరణం కనిపించకపోవడంతోనే పులి మరో జంతువును వేటాడేందుకు వెతుకులాట ప్రారంభించింది. ఈ క్రమంలో తారస పడిన జంతువులను చంపి తినేందుకు ప్రయత్నించింది. కార్కాస్ను సురక్షితంగా కాపాడేందుకు అటవీ అధికారులు ప్రయత్నాలు చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. అందుకు జన సంచారం కారణంగా తెలుస్తోంది. పెద్ద పులి వచ్చిందనే సమాచారం దావళంగా వ్యాప్తి చెందడంతో స్థానిక గ్రామాల ప్రజలంతా ప్రాణ భయంతో ఉన్నారు. దీనికి తోడుగా పులిని ప్రత్యక్షంగా చూడాలనే కుతూహలంతో పాటుగా పశువుల కళేబరాన్ని చూసేందుకు అనేక మంది ఎగబడుతున్నారు. పాద ముద్రికలు, ఇతరత్రా ఆనవాళ్ల సేకరణలో అటవీ శాఖ అధికారులు, సిబ్బంది పర్యటనలు చేస్తున్న క్రమంలో జాగ్రత్తలు తీసుకోవడం లేదన్న వాదన వినిపిస్తోంది. మానవ సంచారం విపరీతంగా పెరగడంతో ఆయా గ్రామాల్లో దాడులు చేసిన వెంటనే పెద్ద పులి వేరే ప్రాంతానికి వెళ్లి పోవడం వంటిది జరుగుతున్నట్లుగా జంతు ప్రేమికులు అంచనా వేస్తున్నారు.
అటవీ శాఖ నిర్లక్ష్యం?
కార్కాస్ను గుర్తించిన తర్వాత సంబంధిత బాధితులకు పరిహారం ఇప్పించడానికి అటవీ శాఖ ప్రయత్నాలు చేస్తోంది. లేదంటే బాధిత కుటుంబాలు రోడ్డున పడే వీలుంటుంది. మరోవైపు అడవుల గుండా వచ్చే క్రూర మృగాలను నష్టపరిచే అవకాశం కూడా లేకపోలేదు. ఇదంతా పరిపాలనపరమైన ప్రక్రియ. అటవీ శాఖ ఈ విషయంలో చర్యలను వేగవంతం చేస్తున్నప్పటికీ పులిని కాపాడేందుకు తీసుకుంటున్న చర్యల్లో పారదర్శకత లోపించింది. ఇంధనపల్లి నుంచి వచ్చిన మూడేళ్ల పెద్ద పులి వారం రోజులుగా దట్టమైన అటవీ క్షేత్రాలను వదిలి పంట పొలాలు, మైదాన ప్రాంతాల ద్వారా ముందుకు కదులుతుండడం వీస్తూగొల్పుతోంది. మైదాన ప్రాంతాల నుంచి పయనం అవుతోన్న పెద్ద పులి… సులువుగా మనుషుల దృష్టిలో పడే వీలుంది. అలాంటప్పుడు పులికి ముప్పు పొంచి ఉన్నట్లే? అన్న అనుమానాలు బలపడుతున్నాయి. మనుషుల నుంచి దాడులు ఎదురయ్యే వీలున్న నేపథ్యంలో పులిని ఏ విధంగా సంరక్షిస్తారు? అన్నది తేటతెల్లం కావడం లేదు. జూలై నెలలో కామారెడ్డి జిల్లా రామారెడ్డి అడవుల్లో హల్చల్ చేసిన ఎస్12 పులి విషయంలో ఇలాంటి నిర్లక్ష్యమే వహించడంతో ఆచూకీ దొరకడం లేదు. ఆ సమయంలో విష ప్రయోగం కూడా జరగడంతో పులి బతికే ఉందా? లేదా? అన్నది తేలడం లేదు.