కోటగిరి/నవీపేట/పొతంగల్/బోధన్ రూరల్/ డిచ్పల్లి,జూలై 14: చినుకు జాడ లేదు.. రైతు ముఖాన చిరునవ్వు లేదు. నెర్రెలు బారిన పొలాలు.. ఎండుతున్న పైర్లు.. ఎత్తిపోతున్న బోర్లు.. ఆకాశం వైపు ఆర్తిగా చూస్తున్న అన్నదాతలు.. ఉమ్మడి జిల్లాలోని రైతుల దయానీయ పరిస్థితి ఇది. ఎల్నినో ప్రభావంతో వర్షాలు కురియడం లేదు. పక్షం రోజుల క్రితం వరకు ఒకటి, రెండు జల్లులు కురిసినా, పది రోజులుగా చినుకు జాడ లేకుండా పోయింది. తీవ్ర వర్షాభావ పరిస్థితులతో రైతాంగం ఆందోళన చెందుతున్నది. మరోవైపు, బోర్లను ఆధారంగా చేసుకుని పంటలు వేసిన అన్నదాతలు నింగికేసి చూస్తున్నారు. వాడిపోతున్న పంటలను చూసి తల్లడిల్లుతున్నారు.
ఆకాశం వైపు రైతుల చూపు..
కరువు పరిస్థితులు ఏర్పడుతున్న తరుణంలో రైతాంగం తీవ్రంగా ఆందోళనకు గురవుతున్నది. కండ్ల ముందే పంటలు ఎండి పోతుండడంతో అంతులేని ఆవేదనకు లోనవుతున్నది. పక్షం రోజులుగా చినుకు జాడ లేకపోవడం, ఇప్పట్లో వర్షం కరిసే పరిస్థితులు కనిపించక పోవడంతో రైతులు కంగారు పడుతున్నారు. ఇప్పటికే భారీగా పెట్టుబడి పెట్టి సాగు చేసిన పంటలు గట్టెక్కడం కష్టంగా మారడంతో మధన పడుతున్నారు. ఆకాశం వైపు ఆర్తిగా చూస్తున్న రైతులు.. వానలు సమృద్ధిగా కురవాలని కోరుతూ దేవుళ్లను మొక్కుతున్నారు. కొన్ని గ్రామాల్లో ప్రత్యేక పూజలు చేస్తుండగా, మరికొన్ని పల్లెల్లో కప్పకావడి ఆడుతున్నారు. నిజాంసాగర్తో పాటు శ్రీరాంసాగర్ నుంచి నీటిని విడుదల చేయాలని రైతులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
ఎల్నినో ప్రభావం..
వర్షాకాలం ఆరంభమై ఒకటిన్నర మాసాలు పూర్తయినా పెద్దగా వానలు కురిసిందే లేదు. జల్లులు తప్ప భారీ వర్షాలు కురియలేదు. నైరుతి రుతుపవనాలు సకాలంలోనే వచ్చినప్పటికీ ఎల్నినో తీవ్ర ప్రభావం చూపింది. దీంతో వానలు కురియడం లేదు. తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఏర్పడడంతో రైతాంగం ఆందోళన చెందుతున్నది. ఈ సీజన్లో 5,58,430 ఎకరాల్లో పంటలు సాగవుతాయని వ్యవసాయాశాఖ అంచనా వేసింది. ఇందులో 4.10 లక్షల ఎకరాల్లో వరి, 53 వేల ఎకరాల్లో మక్క, 23 వేల ఎకరాల్లో పసుపు సాగవుతుందని అంచనా వేసింది. అయితే, వర్షాభావ పరిస్థితుల్లో ఏమేరకు పంటలు సాగవుతాయనేది ప్రశ్నార్థకంగా మారింది. గోదావరిలో నీళ్లు లేకపోవడంతో అలీసాగర్ ప్రాజెక్టుతో పాటు యంచ, నం దిగామ, నిజాంపూర్, నాళేశ్వర్ లిఫ్టులు ప్రారంభించలేదు. ఇక, నిజాంసాగర్, ఎస్సారెస్పీలో చెప్పుకోదగ్గ స్థాయిలో నీళ్లున్నా విడుదల విషయంలో స్పష్టత లోపించింది. ఎస్సీరెస్పీ నీటితో లిఫ్టుల ద్వారా పంటలకు నీళ్లివ్వడంతో పాటు చెరువులు నింపడానికి అవకాశమున్నది. కానీ, ప్రభుత్వం ఆ దిశగా చర్యలు చేపట్టడం లేదు.
ఎండి పోతున్న పంటలు..
సాగునీటి వసతి ఉన్న రైతులు వర్షాకాలం ఆరంభంలోనే పంటలు సాగు చేశారు. బోధన్, బాన్సువాడ, ఆర్మూర్ తదితర డివిజన్లలో విత్తనాలు విత్తారు. పసుపు, మక్క, పత్తి, కంది, సోయాతో పాటు వరి నాట్లు సైతం వేశారు. బాన్సువాడ, బోధన్ డివిజన్లలో వరి నాట్లు దాదాపు పూర్తి కావొచ్చాయి. నవీపేట మండలంలో 14 వేల ఎకరాల్లో పంటలు వేయగా, కోటగిరి మండలంలో 12 వేల ఎకరాల్లో నార్లు వేశారు. మిగతా మండలాల్లోనూ భారీగానే పంటలు సాగు చేశారు. అయితే, బోర్లను ఆధారంగా చేసుకుని రైతులు పంటలు వేశారు. తీవ్ర వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో బోర్లు ఎత్తిపోతున్నాయి. ఫుల్లుగా పోసే బోర్లు సైతం ఆగి ఆగి పోస్తున్నాయి. దీంతో ఏపుగా పెరిగిన పంటలు ఎండుముఖం పట్టాయి. చాలాచోట్ల సాగునీరు అందక పొలాలు నెర్రెలు వారుతున్నాయి. వర్షాలు కురియక పోవడం, భూగర్భ జలాలు అడుగంటడంతో బోర్లు ఎత్తిపోతున్నాయి.