హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 6 (నమస్తే తెలంగాణ) : ‘నేను ఒక యువతిని ప్రేమించాను.. ఇటీవల నిశ్చితార్థం కూడా జరిగింది. అది ఇష్టం లేని మా నాన్న ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్ మాపై గూండాలతో దాడులు చేయించి చంపాలని చూస్తున్నరు. మాకు ఎప్పటికైనా మా నాన్న నుంచి ప్రాణ హాని ఉంది’ అంటూ రాజేంద్రనగర్ ఎమ్మెల్యే టీ ప్రకాశ్‌గౌడ్ తనయుడు సంతోష్‌గౌడ్ తన తండ్రిపై సంచలన ఆరోపణలు చేశారు. గురువారం మీడియాతో ఆయన మాట్లాడారు. నార్సింగి ప్రాంతానికి చెందిన రూపారెడ్డి కూతురిని తాను ప్రేమించానని సంతోష్‌గౌడ్ చెప్పారు. తమ వివాహానికి యువతి తల్లి అంగీకరించినా తన తండ్రి ప్రకాశ్‌గౌడ్ నిరాకరించినట్టు తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లో వివాహం చేసేది లేదని, ఇష్టమైతే నువ్వే చేసుకోమంటూ తన తండ్రి చెప్పాడని వెల్లడించాడు. దీంతో రూపారెడ్డి, స్నేహితుల సమక్షంలో గత నెల 8న నిశ్చితార్థం చేసుకున్నామని పేర్కొన్నారు.
అప్పటి నుంచి తన కాబోయ భార్య ఇంట్లోనే ఉంటున్నట్టు వివరించాడు. ఇది నచ్చని తన తండ్రి వీరి ఇంటిపై దుండగులతో దాడులు చేయించి, తమను చంపేందుకు యత్నించినట్టు ఆరోపించాడు. ఈ దాడి విషయంపై ఫిర్యాదు చేసి 24 గంటలు గడిచినా నార్సింగి పోలీసులు ఎలాంటి చర్యలు కూడా తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కొంతమంది వద్ద రూపారెడ్డి డబ్బులు తీసుకుని ఎగ్గొట్టినట్టు సంబంధంలేని వ్యక్తులతో పోలీసులకు ఫిర్యాదు చేయించాడని ఆరోపించాడు. తనతో పాటు కాబోయే భార్య, ఆమె తల్లికి ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్‌తో ప్రాణహాని ఉందని, తమకు రక్షణ కల్పించాలంటూ మీడియా, పోలీసులకు విజ్ఞప్తి చేశాడు. కాగా చానళ్లలో ఈ విషయం గురించి మాట్లాడి బయటకు వచ్చిన రూపారెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.