భూదాన్ పోచంపల్లి, ఆగస్టు 6 : వస్త్రం నేసి.. మానవాళికి అందించి నాగరికత నేర్పిన చేనేత రంగం కష్టాల కన్నీటి కలబోత అయ్యింది. దేశంలో వ్యవసాయం తర్వాత రెండో స్థానాన్ని ఆక్రమించిన చేనేత రంగంలో కనీస వేతనాలు లేవు. ఈ రంగంలో కాలానుగుణంగా మార్పులు వస్తున్నా నూలు ధరలు విపరీతంగా పెరగడం, నేసిన వస్త్రానికి రేట్లు పెరగక, కార్మికులకు నేత కూలి రేట్లు పెరగకపోవడంతో కార్మికుల కష్టాలు తీరడం లేదు. అగ్గిపెట్టెలో ఇమిడే చీరలు నేసి ప్రపంచానికి చేనేత కళా వైభవాన్ని చాటి చెప్పిన నేతన్నలు అర్ధాకలితో అలమటిస్తున్నారు. చేనేత స్థానంలో మరమగ్గాలు ఆధునిక మగ్గాలు వచ్చినా శ్రమించే చేతులకు మిగిలేది శూన్యం. చేనేత కార్మికులు రెకలు ముకలు చేసుకుని ఇంటిల్లిపాది శ్రమించి మగ్గాలపై కళాత్మకంగా వస్త్రాలు నేస్తున్నారు. ప్రపంచమంతా మెచ్చిన ఈ వస్త్రాలను తయారు చేసిన వారి జీవితాల్లో మాత్రం వెలుగులు లేవని ఆవేదన చెందుతున్నారు. కొత్తగా ప్రింటెడ్ వస్త్రాలు మారెట్లోకి రావడంతో ఆర్థికంగా నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఆగస్టు 7న జాతీయ చేనేత దినోత్సవం నిర్వహించాలని 2015లో ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించారు . అదే రోజు జాతీయ స్థాయి చేనేత హస్త కళా పురసారాలను చేనేత కళాకారులకు ప్రదానం చేస్తున్నారు.
నూలు ముడి సరుకుల ధరలతో చేనేత పరిశ్రమ సంక్షోభాన్ని ఎదురొంటున్నది. నూలు ధరలు నియంత్రణ లేక సరైన గిట్టుబాటు ధర లభించక చేనేత కార్మికులు, వస్త్ర వ్యాపారులు మాస్టర్ వీవర్లు తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారు. డిమాండ్ మేరకు నూలు ఉత్పత్తి లేకపోవడం ధరలు హెచ్చింపునకు కారణం అవుతుంది. గతంలో కిలో వార్పు ధర రూ. 4,200, వెప్ట్ రూ. 5,200లు ఉండగా ప్రస్తుతం వార్పు రూ. 6,300 వెప్ట్ రూ. 6,000లకు పెరిగింది. నూలు ధరలు పెరగడంతో కార్మికులు ఇబ్బంది పడుతున్నారు. జిల్లాలో 6771 జియో ట్యాగింగ్ గలిగిన చేనేత మగ్గాలు ఉన్నాయి. చేనేత వృత్తిపై ఆధారపడి 15,000 మంది జీవనోపాధి పొందుతున్నారు.
ప్రభుత్వం నూలు ధరలను నియంత్రించాలని, సంఘాల్లో పేరుకుపోయిన వస్త్రాలను కొనుగోలు చేయాలని, ప్రభుత్వ సంక్షే మ పదకాలను అర్హులందరికీ అందేలా వర్తింపజేయాలి. పోచంపల్లి ఇకత్కు అంతర్జాతీయంగా పేరు ఉంది. కానీ అందుకు అనుగుణంగా పబ్లిసిటీ లేదు. ఎయిర్ హోస్టెస్‌లు తప్పనిసరిగా చేనేత వస్త్రాలు ధరించేలా చూడాలి. దేశంలోని ఎయిర్‌పోర్టులు, రైల్వేస్టేషన్ల, ప్రధాన నగరాల్లో హోర్డింగ్‌లు, ఏర్పాటు చేసి హ్యాండ్లూమ్ను ప్రమోట్ చేయాలి. ప్రభుత్వం కల్యాణ లక్ష్మి ఆర్థికసాయంతో పాటు పట్టుచీరను కూడా ఇవ్వాలి. అర్హులైన పేదలందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకోవాలి.
పవర్ లూమ్‌పై తయారైన ప్రింటెడ్ చీరలు అతి చౌకగా లభించడంతో చేనేత పరిశ్రమ సంక్షోభాన్ని ఎదురొంటున్నది. పోచంపల్లి ఇకత్ వస్త్రాలు సుమారు పదివేల రూపాయలు ఉండగా, ప్రింటెడ్ చీరలు మారెట్లో 500 రూపాయలకే లభ్యమవుతున్నాయి. దీంతో చేనేత వస్త్రాలకు సరైన గిరాకీ లేక, నేసిన వస్త్రాలు అమ్ముడు పోక, కార్మికులకు ఉపాధి లభించక వలస వెళ్లే దుస్థితి నెలకొంటుంది. ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన జియోగ్రాఫికల్ ఐడెంటిటీ (పేటెంట్ హకులు) ఉన్న పోచంపల్లి ఇకత్ చీరలకు ప్రింటెడ్ బెడద తప్పడం లేదు. గుజరాత్‌లోని సూరత్ తదితర ప్రాంతాల్లో ప్రిం టెడ్ చీరలు తయారవుతున్నట్టు సమాచారం. పోచంపల్లి ఇకత్ వస్త్రాలకు 2003లో కేంద్ర ప్రభుత్వం జియోగ్రాఫికల్ ఇండికేషన్ రిజిస్ట్రీ ( పేటెంట్ )హకులు ఇచ్చింది. పోచంపల్లి చేనేతకు చెందిన 11 డిజైన్లకు రిజర్వేషన్లు ఉన్నాయి. ఈ చేనేతను ఎవరైనా డూప్లికేషన్ చేస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. ఇందుకోసం ఏర్పాటు చేసిన ఎన్‌ఫోర్స్‌మెంటు అధికారులు నామ మాత్రంగా తనిఖీ చేస్తున్నారు.