హైదరాబాద్, ఆగస్టు 6 (నమస్తే తెలంగాణ) : హస్తిన పీఠాన్ని శాసించి తెచ్చుకున్న తెలంగాణ మళ్లీ ఢిల్లీ పార్టీల చేతుల్లో తల్లడిల్లుతున్నదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆవేదన వ్యక్తంచేశారు. మూడు తరాలను ముంచిన కాంగ్రెస్ కబంధహస్తాల్లో ప్రస్తుతం తెలంగాణ అరిగోస పడుతున్నదని పేర్కొన్నారు. గురువారం తెలంగాణ భవన్లో ప్రొఫెసర్ జయశంకర్ జయంత్యుత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన విగ్రహానికి కేటీఆర్ పూలమాల వేసి నివాళులర్పించారు. ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ సీఎం రేవంత్‌రెడ్డి ‘32 నెలల్లో 75సార్లు హస్తినకు వెళ్లి దేహీ అంటూ యాచిస్తున్నడో.. వారికి ఇచ్చి వస్తున్నడో అర్థం కావడం లేదు.. కానీ గులాంగిరీ మాత్రం చేస్తున్నడు’ అని విరుచుకుపడ్డారు.
పార్లమెంట్లో తెలంగాణ ఏర్పాటును పాకిస్థాన్‌తో పోల్చినా అడిగేవారెవరూ లేకుండా పోయారని ఆవేదన వ్యక్తంచేశారు. అదే బీఆర్ఎస్ ఎంపీలు ఉంటే గల్లాపట్టి అడిగేవారని తేల్చిచెప్పారు. ప్రస్తుత దుస్థితిని చూస్తుంటే ఎట్టిపనికైనా, మట్టిపనికైనా మనవాడే ఉండాలని జయశంకర్ సార్ చెప్పిన మాటలు గుర్తుకువస్తున్నాయని తెలిపారు. కేసీఆర్‌ను ఎట్లయితే జాతిపితగా భావిస్తున్నామో ఆనాడు జయంశకర్ సార్‌ను కేసీఆర్ గాడ్ ఫాదర్‌గా చూసుకున్నారని చెప్పారు. పదేండ్లు సార్‌తో పనిచేసే అదృష్టం దక్కిందని పేర్కొన్నారు. ‘సార్ సాధారణ వ్యక్తికాదు.. తెలంగాణ ఎన్సైక్లోపీడి యా.. ఏది అడిగినా ఓపికగా చెప్పేవారు.. పోరాటంలో పాలమూరు వెనుకబడ్డ తీరును వివరించారు. యాచించి కాదు.. శాసించి తెలంగాణ తెచ్చుకోవాలని కేసీఆర్‌కు నూతన పంథాను నూరిపోశారని చెప్పారు.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణకు నీళ్ల వాటా సాధనలో ఘోరంగా విఫలమైందని కేటీఆర్ మండిపడ్డారు. రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయంపై హరీశ్‌రావు తెలంగాణ ప్రజలకు వివరించారని పేర్కొన్నారు. తెలంగాణకు చెందిన ఏడు ప్రాజెక్టులను రద్దు చేసేందుకు ఏపీ ప్రభుత్వం కుట్రలకు తెరలేపిందని ధ్వజమెత్తారు. ఢిల్లీ సర్కార్ మద్దతుతో జీఆర్ఎంబీని ఎట్లా ఆడిస్తున్నదో చక్కగా చెప్పారని గుర్తుచేశారు. హస్తంపార్టీ గద్దెనెక్కిన తర్వాత మళ్లీ ఢిల్లీకి సామంతులుగా మారిన దుస్థితి నెలకొన్నదని ఆవేదన వ్యక్తంచేశారు. తెలంగాణ మిగులు రాష్ట్రమని ఆర్థికవేత్త బీపీఆర్ విఠల్ 1969, 2001లో కేస్‌స్టడీలో తేలిందని, నీళ్లు, నిధులు పుష్కలంగా ఉన్న రాష్ట్రం మనదని చెప్పారు. ‘మన గురువు జయశంకర్ సార్ అయితే.. మన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి గురువు మాత్రం పక్క రాష్ట్ర సీఎం అని ఎద్దేవా చేశారు. ‘నీళ్లున్నా పంపులు నడపడు..ఆర్బీఐ చెప్పినా అప్పులపై తప్పుడు ప్రచారం చేస్తడు..జయశంకర్ సార్ తిరిగొచ్చి ఇలాంటి వారికి పాఠాలు చెబితే బాగుండేది’.. అని పేర్కొన్నారు. జీవితంలో జై తెలంగాణ అనని జైపాల్‌రెడ్డి మేధావా?.. మా పార్టీ వాళ్ల పేర్లు చెప్పకుంటే చెప్పకపోతివి..నీ పక్కనున్న కోదండరామైనా కనిపించలేదా?’ అని ప్రశ్నించారు.

2009 నవంబర్ 29న కేసీఆర్ సచ్చుడో..తెలంగాణ వచ్చుడో అనే నినాదంతో కేసీఆర్ కరీంనగర్ నుంచి ఆమరణ దీక్షకు బయల్దేరారని కేటీఆర్ గుర్తుచేశారు. నాడు ఆయన వెంట జయంశకర్ సార్, కెప్టెన్ లక్ష్మీకాంతారావు, నాయిని నర్సింహారెడ్డి కలిసివెళ్లారని చెప్పారు. ‘అలుగునూర్ చౌరస్తా దగ్గర కేసీఆర్‌ను అరెస్ట్ చేసిన వెంటనే ‘సార్’ను వెంటబెట్టుకొని హనుమకొండకు పోయినం.. అక్కడ విద్యార్థుల ధర్నాలో కూర్చున్న నన్ను పోలీసులు అరెస్ట్ చేస్తే పోలీసు వాహనం నుంచి దూకి జయశంకర్ సార్ ఇంటికిపోయినం.. అప్పుడు దిగిన ఫొటోను ఈ రోజు సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన..అది నాకు భావోద్వేగ సందర్భం..’అని తెలంగాణ ఉద్యమ ఘట్టాలు, జయశంకర్‌సార్‌తో కలిసి నడిచిన పరిస్థితులను కేటీఆర్ మరోసారి గుర్తుచేసుకున్నారు. ‘ఉద్యమం భాస్వరంలా మండుతుంది..తెలంగాణ తప్పక సిద్ధిస్తుంది..’ అని తమకు ధైర్యం చెప్పేవారని స్మరించుకున్నారు. తెలంగాణ కోసం జయశంకర్ సార్ జీవితాన్ని ధారపోశారని చెప్పారు. కేసీఆర్ వెంట నడిచి రాష్ట్రాన్ని సాధనలో కీలకభూమిక పోషించారని కొనియాడారు. అలాంటి మహానేత ఆశయ సాధనకు మనందరం పునరంకితులం కావాలని పిలుపునిచ్చారు.
సమైక్యాంధ్ర కుట్రలను భగ్నం చేసేందుకు సంకల్పించిన మొదటి వ్యక్తి జయశంకర్ సార్ అని మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి కొనియాడారు. తెలంగాణ చరిత్రే ఆ మహనీయుడి చరిత్ర అని వ్యాఖ్యానించారు. తెలంగాణ దోపిడీకి గురవుతున్న తీరును కేసీఆర్‌కు సవివరంగా చెప్పేవారని గుర్తుచేశారు. తెలంగాణ వనరుల గురించి గంటల తరబడి చర్చించేవారని చెప్పారు. జయశంకర్ సార్ శ్వాస, ధ్యాస తెలంగాణేనని మండలి విప్ దేశపతి శ్రీనివాస్ పేర్కొన్నా రు. ప్రత్యేక రాష్ట్ర సాధనలో ఆయన కీలకభూమిక పోషించారని కొనియాడారు. జయశంకర్ సార్ లేకుంటే తెలంగాణ రా ష్ట్రమే లేదని మాజీ డిప్యూటీ సీఎం మహమూ ద్ అలీ పేర్కొన్నారు. కేసీఆర్‌కు గాడ్‌ఫాదర్‌లా అడుగడుగునా అండగా నిలిచారని చెప్పారు.
తెలంగాణకు కాంగ్రెస్ చేసిన మోసాలు.. మూడు తరాల జీవితాలను విధ్వంసం చేసిన తీరును జయశంకర్ సార్ విడమరచి చెప్పారని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి పేర్కొన్నారు. ఆయన గొప్ప ఆర్థికవేత్త, ఆదర్శప్రాయుడని కొనియాడారు. ఆయన ఒక్కో మాట అణుబాంబుతో సమానంగా ఉండేదని, ప్రజలకు అర్థమయ్యేలా అద్భుతంగా మాట్లాడేవారని ప్రశంసించారు. జయశంకర్‌సార్‌కు తెలంగాణ ఆర్థిక, సామాజిక పరిస్థితులపై చక్కని అవగాహన ఉండేదని బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ పేర్కొన్నారు. ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం నాలుగుకోట్ల ప్రజలను ఏకం చేసిన ఘనత జయశంకర్‌కే దక్కిందని కరీంనగర్ జడ్పీ మాజీ చైర్పర్సన్ తుల ఉమ కొనియాడారు. ఎమ్మెల్సీలు సురభి వాణీదేవి, శంభీపూర్ రాజు, దాసోజు శ్రవణ్, ఎమ్మెల్యే ముఠా గోపాల్, మాజీ ఎంపీలు రావుల చంద్రశేఖర్‌రెడ్డి, బడుగుల లింగయ్య, మాజీ ఎమ్మెల్యేలు మల్లయ్య యాదవ్, లక్ష్మారెడ్డి, సునీతామహేందర్‌రెడ్డి, వెంకటరమణారెడ్డి, రవీంద్రకుమార్, కోరుకంటి చందర్, మెతుకు ఆనంద్, కార్పొరేషన్ మాజీ చైర్మన్లు గెల్లు శ్రీనివాస్‌యాదవ్, వాసుదేవారెడ్డి, చిరుమల్ల రాకేశ్, పార్టీ నేతలు కిశోర్‌గౌడ్, నగేశ్, వాల్యానాయక్ ఉన్నారు.

జయశంకర్‌సార్ చిరస్మరణీయుడని శాసమండలిలో ప్రతిపక్ష నేత మధుసూదనాచారి కొనియాడారు. గురువారం తెలంగాణ భవన్లో మండలి విప్ దేశపతి శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రొఫెసర్ జయశంకర్ సార్ జయంతి వేడుకలకు హాజరై మాట్లాడారు. తెలంగాణకు జరుగుతున్న అన్యాయంపై గళమెత్తుతూ ప్రత్యేక రాష్ట్ర భావజాల వ్యాప్తికి ఎంతగానో కృషి చేశారని ప్రశంసించారు. కేసీఆర్‌తోనే తెలంగాణ సాధ్యమని నమ్మిన మొదటి వ్యక్తి ఆయనేనని స్పష్టంచేశారు. పోరాడి తెచ్చుకున్న తెలంగాణను పదేండ్ల పాలనలో అన్నింటా ఆదర్శంగా నిలిపిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందని చెప్పారు. కానీ రెండున్నరేండ్ల కాంగ్రెస్ పాలనలో అనేక అనర్థాలు చూస్తున్నామని ఆవేదన వ్యక్తంచేశారు.
హైదరాబాద్, ఆగస్టు 6 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు ప్రజలను బీఆర్ఎస్ వైపు మొగ్గు చూపేలా చేస్తున్నాయి. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే పలు జిల్లాల్లో బీఆర్ఎస్ సంపూర్ణ ఆధిపత్యం కనపరిచే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తున్నది. ఈ విషయాన్ని చాణక్య పొలిటికల్ కన్సల్టెన్సీ సంస్థ ధ్రువీకరించింది. ఆ సంస్థ ప్రతినిధి పార్థా దాస్ గురువారం రాత్రి సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ఒక ట్వీట్ చేస్తూ ‘ఇప్పుడే తెలంగాణలోని వరంగల్ జిల్లాలో శాంపుల్ సర్వే పూర్తి చేశాం. ఒకవేళ ఈ రోజు ఎన్నికలు జరిగితే ఉమ్మడి వరంగల్ జిల్లాలోని అన్ని సీట్లను బీఆర్ఎస్ స్వీప్ చేస్తుంది’ అని పేర్కొన్నారు. దీనిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎమోజీతో స్పందించారు. కచ్చితంగా సానుకూల ఫలితం వెలువడుతుంది అని సూచించే ఎమోజీని షేర్ చేశారు.