ఎల్లారెడ్డి, డిసెంబర్ 5: చెరువు నీటి పారకంతో తన పొలంలో పంట పండడం లేదని, అధికారులకు, గ్రామస్తులకు ఎన్నిసార్లు చెప్పినా సమస్యకు పరిష్కారం లభించలేదని రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన కామారెడ్డి జిల్లా లింగంపేట మండలం మెంగారం గ్రామంలో చోటు చేసుకున్నది. ఎస్సై శంకర్ కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. మెంగారం గ్రామానికి చెందిన యువరైతు పుట్ట ఆంజనేయులు(28)కు గ్రామ శివారులోని చెరువు ముందర 9గుంటలు, ఊర చెరువు కింద అరగుంట భూమి ఉన్నది. పదేండ్లుగా ఆంజనేయులు చెరువు కింద ఉన్న భూమిలో పంట సాగు చేయడం లేదు.
చెరువు కింద భూములకు నీటిని వదిలిన సమయంలో ఆంజనేయులు పొలంలో నీరు నిలుస్తున్నది. దీంతో చెరువు నీరు తన పొలం గుండా ఇతర రైతుల పొలాలకు పోకుండా అడ్డుకునేవాడు. రెండేండ్ల కిందట గ్రామ రైతులు తహసీల్దార్‌కు ఫిర్యాదు చేయగా అప్పటి తహసీల్దార్ అమీన్‌సింగ్, ఎస్సై శ్రీకాంత్ రైతు ఆంజనేయులుతో మాట్లాడి పంపించారు. ఇదిలా ఉండగా సోమవారం మధ్యాహ్నం మద్యం మత్తులో ఆంజనేయులు గ్రామ సమీపంలో ఉన్న సెల్ టవర్ ఎక్కి హల్చల్ చేశాడు.
విషయం తెలిసిన వెంటనే ఎస్సై శంకర్, తహసీల్దార్ మారుతి ఘటనా స్థలానికి చేరుకొని టవర్ దిగాలని ఫోన్ ద్వారా ఆంజనేయులును కోరారు. పూర్తిస్థాయిలో న్యాయం చేస్తామని చెప్పినప్పటికీ వినకుండా తన వద్ద ఉన్న టవల్‌తో ఉరివేసుకున్నాడు. విషయం తెలుసుకున్న ఎల్లారెడ్డి ఆర్డీవో శ్రీను, డీఎస్పీ శ్రీనివాస్ మెంగారం చేరుకొని గ్రామస్తులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. కాగా మృతుడికి భార్య సుజాత, ఇద్దరు కూతుళ్లు, కొడుకు ఉన్నారు. భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఎల్లారెడ్డి ప్రభుత్వ దవాఖానకు తరలించారు.