కష్టకాలంలో కాళేశ్వర జలధారను చూసి అన్నదాతలు పులకించిపోయారు. ముప్కాల్ పంప్‌హౌస్ వద్ద ఎస్సారెస్పీలోకి ఎత్తిపోస్తున్న జలాలను చూసి ఆనందపరవశులయ్యారు. సాగు కష్టాలను దూరం చేసేందుకు సీఎం కేసీఆర్, మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన తీరుపై ముచ్చటించుకున్నారు. వర్షాభావ పరిస్థితుల్లోనూ ప్రాజెక్టులో జలసవ్వడులను చూసి భావోద్వేగానికి గురయ్యారు. జలదృశ్యాన్ని తిలకించేందుకు కమ్మర్పల్లి మండలం చౌట్పల్లి, బషీరాబాద్ గ్రామాల రైతులు సోమవారం బస్సులు, కార్లలో తరలి వచ్చారు. పంప్‌హౌస్ నుంచి కాళేశ్వరం జలాలను ఎస్సారెస్పీలోకి ఎత్తిపోసే ప్రక్రియను అధికారులు రైతులకు వివరించారు. నియోజక వర్గ రైతులు కాళేశ్వర జలాల సందర్శనకు వెళ్తున్నారని తెలుసుకొని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి రైతులందరికీ సొంత ఖర్చుతో భోజనాలు పెట్టించారు.
-కమ్మర్పల్లి, జూలై 10
ఎస్సారెస్పీ పునరుజ్జీవ పథకం కష్టకాలంలో కల్పవల్లిగా మారింది…అపర భగీరథుడు ముఖ్యమంత్రి కేసీఆర్ సహకారంతో మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి పర్యవేక్షణలో పూర్తయిన ఈ పథకంతో జలదృశ్యం ఆవిష్కృతమైంది. సుదూర ప్రాంతం నుంచి ఎదురేగి వస్తున్న కాళేశ్వరగంగ ఎస్సారెస్పీ వద్ద పరవళ్లు తొక్కుతుండగా హలధారి హర్షధ్వనాలు మొదలయ్యాయి. పంపుల నుంచి వస్తున్న జలధారను చూస్తూ ఆనందపరవశులయ్యారు. రైతాంగ సంక్షేమానికి సీఎం కేసీఆర్ సర్కారు తీసుకున్న నిర్ణయాలతో వచ్చిన ఫలితాన్ని కండ్లారా చూసిన వారంతా జయహో కేసీఆర్… జై ప్రశాంత్‌రెడ్డి అంటూ నినదించారు.
పునరుజ్జీవ పథకంతో శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌లో చేరుతున్న కాళేశ్వర జలధారను తిలకించేందుకు హలదారులు ఉత్సాహం చూపుతున్నారు. సీఎం కేసీఆర్, మం త్రి వేముల ప్రశాంత్ రెడ్డి అసాధ్యాన్ని సుసాధ్యం చేసి తీసుకువచ్చిన కాళేశ్వరం జలాలతో ఎస్సారెస్పీలో ఆవిష్కృతమైన జల దృశ్యాన్ని చూసేందుకు తరలివెళ్లాల్సిం దే అంటున్నారు. బాల్కొండ నియోజకవర్గంలోని రైతుల మనసంతా ఎస్సారెస్పీలో కాళేశ్వరం జలధార చెంతనే ఉన్నది. నలుగురు కలిస్తే ఎస్సారెస్పీలో కాళేశ్వరం జలాలు, ఈ జలవరాన్ని అందించిన కేసీఆర్ ముచ్చటనే వినిపిస్తున్నది. కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టేటప్పుడు ఎట్లనయితే చూసివచ్చినమో ఎస్సారెస్పీలో చేరుతున్న కాళేశ్వరం జలాలను గట్లనే చూసి వద్దామని నిర్ణయించుకుంటున్నారు. కమ్మర్పల్లి మండలం చౌట్పల్లి, బషీరాబాద్ గ్రామాల రైతులు సోమవారం ఐదు బస్సులు, కార్లలో తరలివెళ్లి ఎస్సారెస్పీలో కాళేశ్వర జలదృశ్యాలను తిలకించారు. మహిళా రైతులు సైతం సందర్శనకు ఉత్సాహం చూపించారు. ముప్కాల్ సమీపంలో పునరుజ్జీవ పథకంలో భాగంగా నిర్మించిన పంప్‌హౌస్‌ను సందర్శించారు. కాళేశ్వరం జలాలను ఎస్సారెస్పీలోకి తరలించే ప్రక్రియను పంప్‌హౌస్ అధికారులు రైతులకు వివరించారు. అక్కడి నుంచి డెలివరీ సిస్టర్న్ గుండా అప్రోచ్ కాలువలోకి ప్రవహిస్తున్న జలాలను చూసి ఆనందపరవశులయ్యారు.
ముచ్చటిస్తూ.. మురిసిపోతూ..
ఎస్సారెస్పీలో కాళేశ్వరం జలదృశ్యాలను చూస్తున్నంత సేపూ సీఎం కేసీఆర్, మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి గూర్చి అభిమానంతో చర్చించుకోవడం కనిపించింది. ఎడారిలా మారుతున్న ఎస్సారెస్పీని కాళేశ్వరం జలాలతో నింపి సాగునీటి కొరత లేకుండా చేసి చూపిస్తామని ఈ ఇద్దరు నాయకులు గత ఎన్నికల వేళ ఇచ్చిన మాటను నిజం చేసి చూపించారని…ఆ నిజాన్ని మనకండ్లతోనే చూస్తున్నామని రైతులు సంతోషపడ్డారు. మహారాష్ట్రలో వానలు లేకున్నా, ప్రాజెక్టు ఆయకట్టు రైతులు కన్నీటిపాలు కాకుండా కష్టకాలంలో కాళేశ్వరం జలాలను తెచ్చిన వారిని కడుపులో పెట్టుకొని కాపాడుకుందామని భావోద్వేగంతో మాట్లాడుకున్నారు. ఈ సందర్భంగా మహిళా రైతులు గంగమ్మ పాటను పాడుతూ కాళేశ్వర గంగధారకు దండం పెట్టుకున్నారు. వయసు పైబడిన మహిళా రైతులు సైతం సందర్శనకు వచ్చారు. ‘మా కండ్లముందే పోచంపాడ్ డ్యాం కట్టిండ్రు… కట్టిన సంది ఓ ఏడాది పారితే ఇంకో యాడాది పారకపోవుడు. గిట్ల మూలకు వడిపోతున్న డ్యాంను కాళేశ్వరం నీళ్లుదెచ్చి ముందడ వడగొట్టిండ్రు అంటే సుసేదందుకు అచ్చిన’ అని వృద్ధురాళ్లు ముచ్చటించుకుంటూ మురిసిపోయారు.
భోజనాలు పెట్టించిన మంత్రి వేముల..
తన నియోజకవర్గ రైతులు ఎస్సారెస్పీలో కాళేశ్వరం జలాల సందర్శనకు వెళ్తున్నారని తెలుసుకున్న రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి ఎంతో సంతోషపడ్డారు. రైతులు బస్సులు కట్టుకొని సందర్శనకు వెళ్తున్నారని పార్టీ శ్రేణుల ద్వారా సమాచారం అందుకున్న మంత్రి.. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా సహకరించాలని పార్టీ నాయకులకు సూచించారు. సందర్శనకు వచ్చిన రైతులందరికీ మంత్రి తన సొంత ఖర్చులతో భోజనాలు పెట్టించారు. నియోజకవర్గంలోని రైతాంగమంతా ఎస్సారెస్పీ కాళేశ్వర జలాల సందర్శనకు వెళ్లాలనే అభిప్రాయానికి రావడం విశేషం. దీంతో ఎప్పుడు ఏయే గ్రామాల రైతులు సందర్శనకు వెళ్లాలనే షెడ్యూలు సైతం రూపొందించుకున్నట్లు సోమవారం సందర్శనకు వచ్చిన రైతుల ద్వారా తెలిసింది. దాదాపు నెలరోజులపాటు సందర్శనకు వచ్చే రైతులకు తన సొంత ఖర్చులతో భోజనాలు పెట్టిస్తానని, అందుకు ఏర్పాట్లు చేయాలని పార్టీ నాయకులకు మంత్రి సూచించారు.
బతుకుతోవ చూడవోతున్నట్లున్నది..
శ్రీరాంసాగర్ల కాళేశ్వరం నీళ్లు కలుస్తున్నయంటే సూసేతందుకు పోతున్నం. పోచంపాడ్ డ్యాంను కాళేశ్వరం నీళ్లతోని నింపుతమని చెప్పినట్లు నింపి చూపిస్తున్నరు. ఈ పని మా రైతుల బాగు కోసమే చేసిండ్రు. గందుకనే డ్యాం కాడ కాళేశ్వరం నీళ్లను చూడవోతుంటే బతుకుతోవను కండ్లారా చూసుకునేతందుకు పోయినట్లున్నది.
– శివాయి చిన్నముత్తెన్న, బషీరాబాద్
తెలంగాణ రాకపోతే పోచంపాడ్ ఎండబెడుతుండె..
కేసీఆర్ సారు తెలంగాణ తేకపోతే పాత పాలకులు పోచంపాడ్ ప్రాజెక్టుని ఎండవెడుతుండ్రి. తెలంగాణ కోసం కొట్లాడిన కేసీఆర్ సారే ముఖ్యమంత్రి అయ్యిండు కాబట్టే పోచంపాడ్ డ్యాంను కాళేశ్వరం నీళ్లు తెచ్చి నింపుతున్నాడు.
– తెలంగాణ మల్లయ్య, చౌట్పల్లి
ఎక్కడ వోయినా కాళేశ్వరం నీళ్ల ముచ్చటనే..
మా ఊళ్లే నాలుగైదు రోజుల సంది కాళేశ్వరం నీళ్ల ముచ్చటనే మాట్లాడుకుంటున్నరు. దూరంకెళ్లి కాళేశ్వరం నీళ్లను ఎదురు ఎక్కించుకుంటా పోచంపాడ్ ప్రాజెక్టుల పడగొడుతున్నారు. ఈ ముచ్చటనే అందరూ మాట్లాడుకుంటున్నరు. గందుకనే ముప్కాల్ కాడ కాళేశ్వరం నీళ్లు కలిసే జాగను చూసొచ్చిన.
– ఏశాల లక్ష్మి, చౌట్పల్లి
పాట కట్టాలన్పిస్తున్నది..
కేసీఆర్ సారు… ప్రశాంత్‌రెడ్డి సారు.. ప్రాజెక్టునిండా నీరు అని పాట కట్టాలన్పిస్తున్నది. ఎందుకంటే కేసీఆర్ సారు నీళ్ల కోసం ఎంతదాకైనా నడుం గడుతుండ్రు. మా మంత్రి ప్రశాంత్ రెడ్డి సారేమో ఆ నీళ్లను మా పొలాల దాక తెస్తున్నడు. పోచంపాడ్ డ్యాం ఎప్పటికీ నీళ్లతో కళకళలాడేటట్లు చేసిండు. వాళ్లను మర్చిపోలేం.
– అల్లకొండ గంగారాం, బషీరాబాద్
గంగమ్మ తల్లి అండగా ఉంటది
సీఎం కేసీఆర్ సారుకు, మంత్రి ప్రశాంత్ రెడ్డి సారుకు గంగమ్మ తల్లి దీవెనలు ఉంటాయి. పోచంపాడ్ డ్యాం నీళ్లతోటి ఎవుసమంతా నడుస్తది. గసుంటి డ్యాంను ఈ సార్లిద్దరూ కాళేశ్వరం నీళ్లతోని నింపుతున్నరు. గందుకనే ఆల్ల ఇద్దరికీ గంగమ్మ తల్లి దీవెన, రైతుల అండ ఉంటది.
– ఏశాల గంగు, చౌట్పల్లి