నిజామాబాద్ ఖలీల్వాడి: నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు జూనియర్ కళాశాలల్లో నిర్వహిస్తున్న ప్రయోగ పరీక్షల నిర్వహణను జిల్లా ఇంటర్మిడియట్ విద్యాధికారి(District Inter Education Officer) రవికుమార్ గురువారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. మొదటి స్పెల్ పరీక్షలు జరుగుతున్న ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల, మైనారిటీ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాల, వాణి ఒకేషనల్ జూనియర్ కళాశాల, సత్య ఒకేషనల్ జూనియర్ కళాశాలలను ఆయన తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా రవికుమార్ మాట్లాడుతూ పరీక్షా కేంద్రాల్లో జియో ట్యాగింగ్ చేయాలని, కెమెరాలు ( Cameras ) పని చేయకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రతి పరీక్ష కేంద్రంలో నిబంధనల మేరకు ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించాలని ఆదేశించారు. బాగా చదివే విద్యార్థులకు అన్యాయం జరగవద్దనే ఉద్దేశంతో కెమెరాల ద్వారా హైదరాబాద్ నుంచి కమిషనర్ పర్యవేక్షణ చేస్తున్నారని అన్నారు. జిల్లా పరీక్షల నిర్వహణ కమిటీ సభ్యులు, ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు జిల్లాలో మరో 15 కేంద్రాలను తనిఖీ చేశారు.ఈ తనిఖీల్లో పరీక్షల నిర్వహణ కమిటీ సభ్యులు చిన్నయ్య, రజియుద్దీన్ పాల్గొన్నారు.