నిజామాబాద్, మే 16, (నమస్తే తెలంగాణ ప్రతినిధి): కాంగ్రెస్ ప్రభుత్వం జొన్న రైతుల ఉసురు పోసుకుంటోంది. చేతికి వచ్చిన పంటను కొనుగోలు చేయాలని కోరుతూ రైతులు మండుటెండల్లో పడిగాపులు కాస్తుంటే సర్కారు మొద్దు నిద్ర పోతోంది. ఒక వైపు జొన్నలను కనీస మద్ధతు ధరకే కొనుగోలు చేస్తామని వ్యవసాయ మంత్రి ప్రకటిస్తున్నారు. మరోవైపు ఒక్క గింజను సేకరించడం లేదు. ప్రభుత్వ మాటలకు, క్షేత్ర స్థాయిలో చేతలకు పొంతనే ఉండటం లేదు. ద్వంద ప్రకటనలతో రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం ముంచేస్తోంది. అబద్ధపు మాటలతో రైతులను నిండుగా ముంచుతోంది. కొనుగోలు కేంద్రాలు తెరిచామంటూ గొప్పలు చెప్పుకుంటున్నప్పటికీ జొన్నలు అధికంగా సాగు చేసిన జుక్కల్ ఏరియాలో ఒక్క కేంద్రమూ కనిపించడం లేదు.
జొన్నల కొనుగోళ్లు కూడా ప్రారంభిస్తామని మే 5న వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు ప్రకటించారు. ఇప్పటి వరకు జొన్నల కొనుగోళ్లు పూర్తి కాలేదు. కొనుగోళ్లకు అనుమతులు వచ్చాయా? రాలేవా? అన్నది తేలడం లేదు. కేంద్ర ప్రభుత్వం నిర్ధేశించిన కనీస మద్ధతు ధర ప్రకారం జొన్నకు(హైబ్రిడ్) క్వింటా రూ.3699 చెల్లించాల్సి ఉంది. జొన్న(మల్దండి) క్వింటా కనీస మద్ధతు ధర రూ.3749గా ఉంది. మల్దండి రకం మన వద్ద తక్కువగానే సాగవుతుంది. హైబ్రిడ్ రకమే ఎక్కువగా ఉన్నట్లుగా అధికారులు చెబుతున్నారు. దాదాపుగా 2 నెలలుగా జొన్నలను అమ్ముకునేందుకు కుప్పలు పోసిన రైతన్నలు కొనుగోలు కేంద్రాల కోసం ఎదురు చూడలేక విసుగు చెందుతున్నారు.
70వేల ఎకరాల్లో జొన్న సాగు
కామారెడ్డి జిల్లాలో జొన్నలను దాదాపుగా 70వేల ఎకరాల్లో సాగు చేసినట్లుగా వ్యవసాయ శాఖ చెబుతోంది. ఎకరానికి 20 నుంచి 25 క్వింటాళ్ల ఉత్పత్తి వచ్చింది. మార్కెట్కు ప్రస్తుతం 14వేల క్వింటాళ్లు నుంచి 18వేల క్వింటాళ్ల జొన్నలు రానున్నాయి. కేంద్ర ప్రభుత్వం గత ఏడాదిలో వానాకాలం, యాసంగికి ప్రకటించిన కనీస మద్ధతు ధర ప్రకారం జొన్నలకు క్వింటాకు రూ.3699 దక్కాల్సి ఉంది. ఇంతకంటే తక్కువ ధరకు పంటను సేకరించడం నేరం. కానీ ప్రైవేటు వర్తకులు ఇవేవి పట్టించుకోవడం లేదు. కేంద్ర సర్కారు నిర్ణయించిన ఎమ్మెస్పీ ధర కంటే తక్కువకే జొన్నలు కొంటున్నారు. మార్కెట్ యార్డుల్లో రోజుల తరబడి వేచి చూస్తున్న రైతులంతా చేసేది లేక మధ్యవర్తులకు అమ్ముకోవాల్సిన దుస్థితి ఏర్పడుతోంది.
జుక్కల్ నియోజకవర్గంలో ప్రైవేటు వ్యాపారులు నేరుగా రైతులను సంప్రదిస్తున్నట్లుగా తెలుస్తోంది. కనీస మద్ధతు ధరకు బదులుగా కేవలం క్వింటాకు రూ.2600 వరకే బేరం ఆడుతున్నారని రైతులు ఆగమాగం అవుతున్నారు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు లేకపోవడంతో చాలా మంది ప్రైవేటుకే అమ్ముకునేందుకు సిద్ధం అవుతున్నారు. కనీస మద్ధతు ధర వస్తే కాస్తో కూస్తో లాభాలు వస్తాయని రైతులు భావిస్తుండగా అందుకు భిన్నమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. కనీస మద్ధతు ధర అన్నది మచ్చుకూ కనిపించకపోవడంతో రైతులు డీలా పడుతున్నారు. ప్రైవేటు వర్తకుల దోపిడీని ప్రభుత్వం అరికట్టడం లేదు. మార్క్ఫెడ్ అధికార యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్లు ప్రవర్తిస్తోంది.
ఎక్కడి జొన్నలు అక్కడే…
జొన్నలను అమ్మేందుకు వచ్చిన రైతులతో వ్యవసాయ మార్కెట్ యార్డులు, ప్రభుత్వ ఖాళీ జాగలు నిండుగా కనిపిస్తున్నాయి. గతంలో జొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసిన చోటనే ఆశగా పంటను తీసుకు వచ్చి రైతులంతా కుప్పులు పోస్తున్నారు. కొనుగోలు కేంద్రం వస్తుందనే ఆశతో రోజుల తరబడి ఎదురు చూస్తున్నారు. ఓవైపు మండుటెండను లెక్క చేయకుండా ప్రాణాలు పణంగా పెట్టి రైతులు పంట కొనుగోళ్ల కోసం ఇబ్బందులు పడుతున్నారు. అకాల వానలు కురుస్తుండటంతో భిక్కుభిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు.
మార్కెట్ యార్డులకు జొన్నలు తీసుకు వచ్చి దాదాపుగా మూడు వారాలు దాటుతున్నప్పటికీ పంట సేకరించే పని చేపట్టకపోవడం విడ్డూరంగా మారిందని రైతులు వాపోతున్నారు. ఎక్క డి జొన్నలు అక్కడే అన్నట్లుగా పరిస్థితి దాపురించిందని లబోదిబోమంటున్నారు. కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇంతటి ఘో రమైన పరిస్థితులను చూడలేదని రైతులు చెబుతున్నారు. సమయానికి కొనుగోలు కేం ద్రాలు ఏర్పాటు చేసి ప్రభుత్వమే జొన్నలు కొ నుగోలు చేసేదని గుర్తు చేసుకుంటున్నారు. కనీస మద్ధతు ధరకు జొన్నలు అమ్ముకునే తామంతా లాభం పొందామని కర్షకులు అంటున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వింత పరిస్థితిని అనుభవిస్తున్నామని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
నెల దాటుతున్నా ప్రారంభం కాని కొనుగోళ్లు
ఆందోళనలో రైతులు
నిజాంసాగర్, మే16: సింగీతం గ్రామంలోని కేంద్రానికి రైతులు జొన్నలను తీసుకువచ్చి నెలరోజులు దాటుతున్నా ఇప్పటి వరకు కొనుగోలు ప్రక్రియ ప్రారంభం కాకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నా రు. అకాల వర్షాలతో కేంద్రంలో కుప్పలుగా పోసిన జొన్నల నా ణ్యత కోల్పోయే అవకాశం ఉన్నదని ఆందోళన చెందుతున్నా రు. జొన్న కొనుగోలు విషయం లో ప్రభుత్వం నుంచి ఇప్పటివరకూ ఎలాంటి ఆదేశాలు రాకపోవడంతో నెల రోజులకుపైగా జొన్న కుప్పల వద్దే ప్రతిరోజు ఉదయం నుంచి రాత్రి వరకు కాపలాగా ఉంటున్నామని రైతులు వాపోయారు. జొన్నలకు కనీస మద్దతు ధర అందించి, కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
వెంటనే కొనుగోలు చేయాలి..
జొన్న పంట సాగు చేసి మూడు నెలలవుతున్నా కాంగ్రెస్ ప్రభు త్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయలేదు. అకాల వర్షాలు, గాలిదుమారాలతో నిల్వ ఉంచిన జొన్నలు తడిసి పాడయ్యే సరిస్థితి ఉంది. టార్పాలిన్లు, గోదాముల సౌకర్యం లేక రాత్రింబవళ్లు కాపలా కాస్తూ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. రైతుల కష్టాన్ని గుర్తించి ప్రభుత్వం వెంటనే జొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని కోరుతున్నాం.
-రాజు యాదవ్, రైతు
ప్రభుత్వం జొన్న రైతులను ఆదుకోవాలి
జొన్న పంట పండించి మూ డు నెలల నుంచి ఆరబెట్టిన జొన్నలు గాలివానకు తడిసిపోవడంతో ఇబ్బందులు పడుతు న్నాం. రాత్రింబవళ్లు కాపలా కాస్తున్నాం. ప్రైవేట్ వ్యాపారులు తక్కువ ధరకే అడుగుతున్నారు. ప్రభుత్వం వెంటనే జొన్న కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి రైతులను ఆదుకోవాలి.
-గొర్రె పండరి, రైతు, పెద్ద కొడప్గల్