బీఆర్ఎస్ పార్టీలో సరికొత్త జోష్ కనిపిస్తున్నది. అభ్యర్థుల ప్రకటనతో గులాబీ శ్రేణుల్లో నూతనోత్సాహం వెల్లివిరుస్తున్నది. సిట్టింగ్‌లకే సీట్లు దక్కడంతో కేడర్‌లో మరింత ఊపు వచ్చింది. సీఎం కేసీఆర్ స్వయంగా పోటీ చేయనుండడంతో రాజకీయ సమీకరణలు ఒక్కసారిగా మారిపోయాయి. కాస్తో కూస్తో ఉన్న ప్రతికూలతలు కూడా మాయమై పోయాయి. మరోవైపు ప్రతిపక్షాలు అభ్యర్థులు కరువై, కేడర్ దూరమై విలవిల్లాడుతున్నాయి. సీఎం కేసీఆర్ వ్యూహాలతో కాంగ్రెస్, బీజేపీ చతికిల పడుతున్నాయి. ఇక ఎన్నికలకు ముందే బీఆర్ఎస్ గెలుపు ఖాయమైందని సర్వత్రా చర్చ జరుగుతున్నది. సిట్టింగ్‌లకే సీట్లు ఇవ్వడంతో విజయం మరింత సులభమవుతుందని, ప్రత్యర్థుల డిపాజిట్లు గల్లంతు ఖాయమని పార్టీ శ్రేణులు ధీమా వ్యక్తం చేస్తున్నాయి.
– నిజామాబాద్, ఆగస్టు 22 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)
నిజామాబాద్, ఆగస్టు 22 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): గెలిచేది మనమే..వచ్చేది మనమే.. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో ఎక్కడ చూసినా ఇదే ఒరవడి కనిపిస్తున్నది. గులాబీ అధినేత కేసీఆర్ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులను ప్రకటించడంతో ఒక్కసారిగా రాజకీయ పరిస్థితులు అనుకూలంగా మారిపోయాయి. కాస్తో కూస్తో ఉన్నటువంటి ప్రతికూల అంశాలు సైతం సానుకూలంగా మారిపోయాయి. ఎన్నికల షెడ్యూల్, నోటిఫికేషన్ జారీకి ముందే బీఆర్ఎస్ వేసిన కీలక అడుగుతో కాంగ్రెస్, బీజేపీలు విలవిల్లాడుతున్నాయి. మొన్నటి వరకు మేక వన్నె పులి మాదిరిగా గాంభీర్యాన్ని ప్రదర్శించిన వారంతా ఒక్కసారిగా కేసీఆర్ విసిరిన వ్యూహంలో చిక్కి కొట్టుమిట్టాడుతున్నారు. వచ్చే ఎన్నికల్లో వారికి అభ్యర్థులను నిలబెట్టేందుకు ఆపసోపాలు పడాల్సిన దుస్థితి ఏర్పడింది. క్రమశిక్షణ కలిగిన గులాబీ పార్టీలో 115 మంది పేర్లతో దాదాపు అన్ని నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించడంతో అంతటా జోరుగా చర్చ జరుగుతున్నది. దటీజ్ కేసీఆర్ అంటూ ప్రజలంతా గుసగుసలాడుకుంటున్నారు. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో సిట్టింగ్‌లకే ప్రాధాన్యతను ఇవ్వడంతో గెలుపు నల్లేరు మీద నడకే అన్నట్లుగా మారింది.

గులాబీ కంచుకోట…
ఆది నుంచి నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలు గులాబీ పార్టీకి కంచుకోటగా ఉంటున్నాయి. ప్రతి ఎన్నికల్లోనూ కారు గుర్తుకే ప్రజలంతా ఓట్లేసి కేసీఆర్‌ను బలపర్చారు. వరుస విజయాలతో ఉత్సాహంగా ఉన్న బీఆర్ఎస్ పార్టీకి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లోనూ అదే తీరులో ఫలితాలు రాబోతున్నాయి. ఉమ్మడి జిల్లా గులాబీ కంచుకోటగా కొనసాగడం ఖాయంగా కనిపిస్తోంది. నిజామాబాద్ అర్బన్‌లో బిగాల గణేశ్ గుప్తా ఆధ్వర్యంలో నగరాభివృద్ధి, రూరల్ నియోజకవర్గంలో కనీవినీ ఎరుగని రీతిలో జరిగిన అభివృద్ధి, బాల్కొండలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సారథ్యంలో మౌలిక సదుపాయాల కల్పన, ఆర్మూర్, బోధన్‌లో తళుకులీనుతోన్న అభివృద్ధి కాంతులతో ప్రజలంతా బీఆర్ఎస్ చేసిన మంచి పనులను గుర్తు చేసుకుంటున్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రానికి దక్కిన సదుపాయాలు, రాష్ట్రంలోనే మేటి నియోజకవర్గంగా నిలిచిన బాన్సువాడ, సరిహద్దులో ఊహించని వృద్ధితో దూసుకుపోతున్న జుక్కల్, అభివృద్ధిలో పరుగులు తీస్తున్న ఎల్లారెడ్డి నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ పార్టీ చేసిన ప్రగతి పనుల హవా ప్రజలను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.
కేసీఆర్ రాకతోనూ ఊపు..
కామారెడ్డి అసెంబ్లీ స్థానం నుంచి కేసీఆర్ పోటీ చేస్తుండడంతో బీఆర్ఎస్లో సరికొత్త ఊపు కనిపిస్తున్నది. గులాబీ శ్రేణుల్లో జోష్ నెలకొన్నది. కాంగ్రెస్, బీజేపీలు పత్తా లేకుండా పోతున్నాయి. మొన్నటి వరకు ఎగిరెగిరి దుంకిన హస్తం, కమలం పార్టీలు ప్రస్తుతం కేసీఆర్ పోటీకి వస్తుండడంతో తుత్తునియలుగా మారాయి. ఆ పార్టీలోని ముఖ్య నాయకులతోపాటు కిందిస్థాయి లీడర్లంతా డైలమాలో కొట్టుమిట్టాడుతున్నారు. కేసీఆర్‌పై పోటీ చేసే కన్నా బీఆర్ఎస్ పార్టీలో చేరడం మిన్న అనే ఆలోచన లో చాలా మంది పడ్డారు. త్వరలోనే కా మారెడ్డి నియోజకవర్గ పరిధిలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన కీలకమైన నేతలంతా గులాబీ కండువాను కప్పుకోవడం తథ్యమని తెలుస్తున్నది. కామారెడ్డి నుంచి కేసీఆర్ పోటీ చేయడం ఖాయం కావడంతో గెలుపు సైతం బీఆర్ఎస్‌దేనన్న అభిప్రాయం సర్వత్రా బలపడింది. రాష్ట్ర సాధన ఉద్యమంలో ముందుండి పోరాడిన ఉద్యమ నాయకుడు, సీఎం కేసీఆర్ అనుకున్న లక్ష్యాలను సాధిస్తూ ముందుకు సాగుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శిస్తున్న విపక్షాలు అటు బీజేపీ, ఇటు కాంగ్రెస్ అయినా ఇన్నేండ్లలో సాధించింది ఏమీ లేదు. చెప్పుకోవడానికి వారికి అంశాలే కరువైన పరిస్థితి.
అభివృద్ధి మంత్రం…
2014లో రాష్ర్టాన్ని తెచ్చిన పార్టీగా ప్రజల్లోకి వెళ్లిన గులాబీ దళపతి కేసీఆర్‌ను ప్రజలు ఆశీర్వదించి పట్టం కట్టారు. ఆ తర్వాత చేసిన అభివృద్ధిని ప్రజల ముందు పెట్టి 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ ఓట్లడిగారు. ప్రజలంతా కేసీఆర్ చేసిన పనులను మెచ్చి భారీ మెజార్టీతో గెలిపించారు. 2014 కన్నా మిన్నగా 2018లో అత్యధిక సీట్లలో బీఆర్ఎస్ అభ్యర్థులే విజయం సాధించారు. తాజాగా 2023 అసెంబ్లీ ఎన్నికల్లోనూ ముచ్చటగా మూడోసారి ఇదే తీరు ప్రస్ఫుటం కానున్నది. ఈసారి గత ఎన్నికల కన్నా ఎక్కువ అసెంబ్లీ స్థానాల్లో బీఆర్ఎస్ జెండా రెపరెపలాడనున్నట్లుగా తెలుస్తోంది. కేసీఆర్ అంచనాలకు తగ్గట్లే బీఆర్ఎస్ అభ్యర్థులంతా అధిక స్థానాల్లో గెలిచి మరోసారి అధికార పీఠాన్ని అధిరోహించడం ఖాయంగానే కనిపిస్తోంది. ఇందులో భాగంగానే తొమ్మిదేండ్ల కాలంలో కేసీఆర్ పరిపాలనలో సాధించిన ప్రగతిని ప్రజల ముందుకు తీసుకెళ్లడానికి బీఆర్ఎస్ పార్టీ సమాయత్తం అవుతున్నది. ప్రగతి నివేదనను జనం ముందు ఆవిష్కరించి, వచ్చే ఐదేండ్లలో చేయబోయే కార్యక్రమాలను వివరించి ఓట్లు అడిగే వ్యూహాలకు కేసీఆర్ పదును పెడుతున్నారు. కనీవిని ఎరుగని రీతిలో అంతటా సిట్టింగ్‌లకే అభ్యర్థిత్వం ఖరారు చేయడం ద్వారా కేసీఆర్ నేరుగా ప్రతిపక్ష పార్టీలకు భారీ సవాల్‌ను విసిరినట్లు అయ్యింది.