సకల జనుల హితమే లక్ష్యంగా రూపొందిన బీఆర్ఎస్ పార్టీ మ్యానిఫెస్టోపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది. ప్రజా సంక్షేమమే పరమావధిగా సీఎం కేసీఆర్ ప్రకటించిన వరాల జల్లుపై అన్ని వర్గాల్లో ఆనందం వెల్లువెత్తుతున్నది. సన్నబియ్యం, కేసీఆర్ బీమా, సౌభాగ్యలక్ష్మి వంటి ఆకర్షణీయ పథకాలపై ప్రజల్లో ఆసక్తికర చర్చ జరుగుతున్నది. ఇప్పటికే రూపాయికి కిలోబియ్యం పథకంతో బీఆర్ఎస్ ప్రభుత్వం పేదలకు కడుపు నిండా బువ్వ పెడుతున్నది. మరోసారి అధికారంలోకి వస్తే రేషన్‌షాపుల్లో సన్నబియ్యం పంపిణీ చేస్తామని కేసీఆర్ చేసిన ప్రకటన.. పేద ప్రజలను ఆకట్టుకున్నది. అలాగే, ప్రతి కుటుంబానికీ బీమా ధీమా కల్పించడం, ఆరోగ్యశ్రీ పరిమితి పెంపు, పేద మహిళలకు నెలకు రూ.3 వేల గౌరవభృతి, రైతుబంధు సాయం, ఆసరా పింఛన్ల పెంపు వంటి హామీలు జనాల్లోకి బలంగా వెళ్లాయి. అలాగే, ఉద్యోగులు, అగ్రవర్ణాలు, మైనార్టీల సంక్షేమానికి కూడా బీఆర్ఎస్ మ్యానిఫెస్టోలో హామీలు ఇవ్వడంపైనా అన్ని వర్గాల్లో సంతోషం వ్యక్తమవుతున్నది. మొత్తంగా ఎక్కడ చూసినా కేసీఆర్ ఇచ్చిన హామీలపైనే విస్తృతంగా చర్చ నడుస్తున్నది.
భారత రాష్ట్ర సమితి అధినేత, సీఎం కేసీఆర్ ఆదివారం ప్రకటించిన ఎన్నికల మ్యానిఫెస్టోపై ఉమ్మడి జిల్లా ప్రజలు, లబ్ధిదారులు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇది సకల జనుల సంక్షేమాన్ని కాంక్షించే మ్యానిఫెస్టోగా అభివర్ణించారు. నిరుపేదలకు అండగా బీఆర్ఎస్ పార్టీ ఉంటుందని మరోసారి మ్యానిఫెస్టో ద్వారా తేల్చి చెప్పారని అభిప్రాయపడుతున్నారు. పంట పెట్టుబడి సాయం రూ.16వేలకు పెంచుతామని ప్రకటించడంపై రైతన్నలు ఆనందం వ్యక్తం చేశారు. ఆసరా పింఛన్లు రూ.5వేలకు, దివ్యాంగుల పెన్షన్‌ను రూ.6వేలకు పెంచడంపై ఆయా వర్గాలు సంబురాలు జరుపుకొన్నారు. రేషన్‌కార్డుదారులకు సన్నబియ్యం, కేసీఆర్ బీమా, రూ.400కే గ్యాస్ సిలిండర్ తదితర హామీలపై సంతోషం వ్యక్తంచేస్తున్నారు.
Cmkcr
రైతులకు మరింత మేలు..
ఆర్మూర్, అక్టోబర్16: బీఆర్ఎస్ అంటేనే రైతుల పార్టీ. తొమ్మిదేండ్ల పాలనలో రైతుబంధు, రైతుబీమాతో రైతుల స్థితిగతులు ఎంతగానో మారాయి. బీఆర్ఎస్ మ్యానిఫెస్టోలో రైతుబంధు పథకం కింద ఎకరానికి రూ.10వేల నుంచి రూ.16వేలకు పెంచడం ఆనందంగా ఉన్నది. ఎకరానికి రూ.12వేల చొప్పున ఇచ్చి పెంచుతూ రూ.16వేల వరకు చెల్లిస్తామని చెప్పడం గొప్ప విషయం. బీఆర్ఎస్ మ్యానిఫెస్టోను స్వాగతిస్తున్నాం.
– ఈ. గంగాధర్, రైతు, గోవింద్‌పేట్, ఆర్మూర్
పేద ప్రజలకు మేలు చేసేలా ఉన్నది..
ఆర్మూర్, అక్టోబర్16: బీఆర్ఎస్ మ్యానిఫెస్టోను అన్నివర్గాల ప్రజలకు మేలు చేసేలా ఉన్నది. అగ్రవర్ణాల పే దలకు మ్యానిఫెస్టోలో పెద్దపీట వేశారు. అర్హులై న వారికి రూ. 400కే గ్యాస్ సిలిండర్ ఇస్తామని చెప్పడం హర్షణీయం. రైతులు, ఉద్యోగులు, మహిళలు, వృద్ధులు, దివ్యాంగులకు మేలు చేకూర్చనున్నది. కాంగ్రెస్ ఆచరణ సాధ్యం కానీ హామీల కన్నా బీఆర్ఎస్ మ్యానిఫెస్టో ఆచరణయుక్తంగా ఉన్నది.
-పోల సుధాకర్, ఆర్యవైశ్యమహాసభ రాష్ట్ర కార్యదర్శి, ఆర్మూర్
కేసీఆర్ అంటేనే.. కొండంత అండ..
వర్ని, అక్టోబర్ 16: దివ్యాంగులకు సీఎం కేసీఆర్ అంటేనే కొండంత అండ. గతంలో ఎలాంటి హామీ ఇవ్వకుండా రూ.3016 పింఛన్ ఇచ్చిండు. మొన్నటికి మొన్న కూడా రూ.4016 కి పెంచిండు. ఇప్పుడు మళ్లీ అధికారంలోకి వస్తే రూ.6వేలకు పెంచుతామని మ్యానిఫెస్టోలో ప్రకటించిండు. సీఎం కేసీఆర్ రూ.6వేల పింఛన్ ఇస్తాడనే నమ్మకం ఉన్నది.
– సబావత్ గోపాల్, దివ్యాంగుడు, వర్ని
కేసీఆర్.. మాట తప్పడు
ముప్కాల్, అక్టోబర్ 16: మా ఇంటి పెద్ద కొడుకు కేసీఆర్ మాట ఇస్తే తప్పడు. మడిమ తిప్పనోడు కేసీఆర్ సారు. పోయిన సారి పింఛని రూ. 2016 ఇచ్చిండు, అంతకు మునుపు రూ.1000 ఇచ్చి మాటను నిలబెట్టుకున్నడు. ఇప్పుడు కూడా చెప్పింది చేస్తాడనే నమ్మకం మాకున్నది. మళ్లీ కారుకే ఓటేస్తాం.. సారును గెలిపించుకుంటాం. కాంగ్రెసోళ్లు, బీజేపోళ్లు మాటలు చెప్తరు కానీ, పింఛన్లు పెంచరని మాకు తెలుసు.
– చాట్ల అన్నపూర్ణ, ముప్కాల్
మహిళల సంక్షేమానికి కృషి..
కామారెడ్డి,అక్టోబర్ 16 : మహిళలు అన్నిరంగాల్లో ముందుంటున్నారు. కానీ ఏ ప్రభుత్వం కూడా మహిళలకు సరైన స్థానం కల్పించలేదు. బీఆర్ఎస్ ప్రభుత్వంలోకి వస్తే మహిళా సంఘాలకు భవనాలు కట్టిస్తామని మ్యానిఫెస్టోలో చేర్చడం అభినందనీయం. మహిళల సంక్షేమానికి సీఎం కేసీఆర్ ఎంతో కృషి చేస్తున్నారు. సిలిండర్ ధర సైతం తగ్గిస్తామని చెప్పడం మహిళలకు శుభవార్తే. పింఛన్లను కూడా పెంచుతూ మ్యానిఫెస్టోలో పెట్టడం సంతోషకరం.
– డి.భారతి, కామారెడ్డి
బీమా.. పేదకుటుంబాలకు ధీమా
మోర్తాడ్, అక్టోబర్ 16: సీఎం కేసీఆర్ ఎల్లప్పుడూ అన్నివర్గాల సంక్షేమం గురించి ఆలోచిస్తుంటారు. సంచలన నిర్ణయాలతో తెలంగాణను దేశంలోనే నంబర్‌వన్‌గా ఉంచారు. ఇప్పుడు ప్రకటించిన మ్యానిఫెస్టోలో తెల్లరేషన్ కార్డులు ఉన్న వారికి బీమా ప్రకటించడం సంతోషకరమైన అంశం. దీంతో ఎన్నో పేదకుటుంబాలకు ధీమా కలిగించినట్లయ్యింది. ఇది ఎవరూ ఊహించని నిర్ణయం. రైతుబీమాతో ఎంత ప్రయోజనం చేకూరుతుందో అదేవిధంగా తెల్లరేషన్ కార్డు ఉన్న కుటుంబాలకు ప్రయోజనం చేకూరే అవకాశం ఉన్నది. ఆపద సమయంలో అండగా ఉండేలా బీమా పేద కుటుంబాలకు ధీమా కానున్నది.
– జోగ నాగేశ్, సుంకెట్