నిజామాబాద్, మే 8 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : శాంతిభద్రతలను కాపాడుతూ సమాజ రక్షణ కోసం నిరంతరం పనిచేస్తున్న పోలీసులు అపఖ్యాతి మూటగట్టుకుంటున్నారు. కొంతమంది పోలీసుల తీరు తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్, కామారెడ్డి జిల్లా పోలీసుశాఖలో తాజాగా వెలుగుచూస్తున్న ఘటనలు చర్చనీయాంశంగా మారాయి. వక్రదారిపడుతున్న ఖాకీలపై పోలీస్బాసులు వేటు వేస్తున్నప్పటికీ క్షేత్రస్థాయిలో మార్పు కనిపించడం లేదు. ఎవరో ఒకరు, ఎక్కడో ఒక చోట ఆమ్యామ్యాలకు ఆశ పడుతూనే ఉన్నారు.
నిబంధనలకు విరుద్ధంగా పోలీస్స్టేషన్లను సెటిల్మెంట్లకు అడ్డాగా చేసుకుని దర్జాగా డబ్బులు సంపాదిస్తున్నారు. వారిని నిలువరించేవారే కరువయ్యారు. కామారెడ్డి జిల్లాలో ఇటీవల తాడ్వాయి ఎస్సైని సస్పెండ్ చేశారు. విధుల నిర్వహణలో నిర్లక్ష్యం వహించడంపై ఎస్పీ రాజేశ్ చంద్ర సమర్పించిన నివేదిక ఆధారంగా ఐజీ చర్యలు తీసుకున్నారు.
ఇదే ఠాణాలో పలు భూ దందాలు భారీగా జరిగినట్లుగా ఆరోపణలు గుప్పుమంటున్నాయి. ఓ రిటైర్డ్ పోలీస్ అధికారికి సంబంధించిన కుటుంబీకుల వ్యవహారంలో స్థానిక ఎస్సై తలదూర్చి చిత్రహింసలకు గురి చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. సివిల్ తగాదాల్లో వేలు పెట్టొద్దంటూ పోలీస్ ఉన్నతాధికారుల ఆదేశాలున్నప్పటికీ కింది స్థాయిలో కొంత మంది బేఖాతరు చేస్తున్నారు.
టాస్క్‌ఫోర్స్ నుంచి ట్రాఫిక్ వరకు..
నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్‌లో టాస్క్‌ఫోర్స్ విభాగంపై ఆనేక ఆరోపణలు వెల్లువెత్తాయి. ఓ ఏసీపీ స్థాయి అధికారి తీరుతో ఖాకీల పరువు కూడా బజారున పడింది. సంఘ విద్రోహ శక్తుల ఆట కట్టించే టాస్క్‌ఫోర్స్‌లో ఉన్నతాధికారులు, కింది స్థాయి వ్యక్తులు కలిసి అక్రమ దందాకు తెర లేపారు. ఈ వ్యవహారంపై ‘నమస్తే తెలంగాణ’లో వరుస కథనాలు రావడంతో నాటి సీపీ కల్మేశ్వర్ స్పందించారు. విచారణ చేసి వాస్తవాలు నిగ్గు తేల్చారు. డీజీపీకి నివేదిక సమర్పించగా గతేడాది అక్టోబర్‌లో ఏసీపీని సస్పెండ్ చేశారు.
ఏసీపీ స్థాయి వ్యక్తిని అవినీతి ఆరోపణలతో సస్పెండ్ చేయడంతో కమిషనరేట్‌లో మార్పు వస్తుందని అంతా అనుకున్నారు. కానీ ట్రాఫిక్ విభాగంలోనూ అంతులేని దందా కనిపిస్తోంది. నిత్యం రోడ్లపై సామాన్యులను హెల్మెట్ పేరుతో జరిమానాలు విధించే ట్రాఫిక్ విభాగం పోలీసులే కొంత మంది వ్యాపార, వాణిజ్య వర్గాలను టార్గెట్ చేసి డబ్బులు డిమాండ్ చేస్తున్నారు.
ఇందులో భాగంగానే ఏసీపీపై వచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఉన్నతాధికారులు విచారణ చేపట్టి వేటు వేశారు. అతితక్కువ కాలంలోనే ఇద్దరు ఏసీపీలు అవినీతి ఆరోపణలతో సస్పెండ్ కావడం తీవ్ర దుమారం రేపుతోంది. ఈ ఏడాది జనవరిలోనే భీమ్‌గల్ పోలీస్ స్టేషన్లో సివిల్ పంచాయి తీలు, మధ్యవర్తుల దందాపై ఫోకస్ పెట్టి ఓ సీఐ, ఎస్సైపై వేటు వేశారు. వారం క్రితం ఆరో ఠాణా పరిధిలో ఓ హెడ్ కానిస్టేబుల్ విధుల్లో నిర్లక్ష్యం వహించడంతో సీపీ చర్యలు తీసుకున్నారు. అక్రమాలకు తోడుగా బహిరంగంగానే లం చం తీసుకుంటూ ఎస్సైలు ఏసీబీకి చిక్కుతున్నారు. వర్ని, లింగంపేట మండలాల్లో వరుసగా నెలల వ్యవధిలోనే ముగ్గురు ఎస్సైలు పట్టుబడడం గమనార్హం.
వేటు వేస్తున్నా..కానరాని మార్పు
నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలకు సీపీగా సాయి చైతన్య, ఎస్పీగా రాజేశ్ చంద్ర వచ్చిన తర్వాత పలువురు పోలీసులపై వేటు పడింది. విధుల్లో నిర్లక్ష్యం, అవినీతి ఆరోపణల నేపథ్యంలో ఉన్నతాధికారులు తగిన చర్యలు తీసుకుంటున్నారు. అయినప్పటికీ మార్పు మాత్రం కానరావడం లేదు. సీపీ, ఎస్పీలు ఇద్దరూ నిరంతరం ఫీల్డ్ విజిట్లకు వెళ్తున్నారు. ఈ సమయంలోనే పోలీస్ స్టేషన్లలో స్థితిగతులను ఓ కంట కనిపెట్టి చర్యలకు శ్రీకారం చుడుతున్నారు.
హనుమాన్ జయంతి సమయంలో తాడ్వాయి పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన ఎస్పీ రాజేశ్ చంద్ర ఆ తర్వాత సంబంధిత స్టేషన్ హౌస్ ఆఫీసర్‌పై చర్యలకు సిఫార్సు చేశారు. తదనంతరం ఎస్సై సస్పెండ్ అయ్యారు. రామారెడ్డి ఠాణాలో ఓ హత్య కేసులో లోతైన దర్యాప్తు చేయడంలో ఎస్సై నిర్లక్ష్యం వహించాడు. అనేక అనుమానాలు ఉన్నప్పటికీ ఆధారాల సేకరణపై ఆసక్తి చూపలేదు. హంతకులను గాలికి వదిలేయడంతో బాధిత కుటుంబాల్లో ఆందోళన మొదలైంది.
హత్యను అనుమానాస్పద మృతిగానే పోలీసులు కొనసాగిస్తుండడంతో బాధిత కుటుంబం ఉన్నతాధికారులను కలిసి ఫిర్యాదు చేయగా అసలు గుట్టు రట్టయ్యింది. భార్యనే భర్తను చంపి నాటకం ఆడినట్లుగా తేలడంతో ఎస్సైపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు. పాస్‌పోర్ట్ జారీలో పోలీసుల విచారణ కీలకం. స్పెషల్ బ్రాంచ్ పోలీసులు ఇందులో ముఖ్య పాత్ర పోషిస్తారు. ప్రాథమిక విచారణలో ఓ కానిస్టేబుల్ నిర్లక్ష్యం చూపడంతో ఎస్పీ రాజేశ్ చంద్ర దృష్టి సారించగా.. సదరు కానిస్టేబుల్‌ను సస్పెండ్ చేస్తూ డీఐజీ ఉత్తర్వులిచ్చారు.
సవాళ్లు గాలికి వదిలేసి..
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో పోలీసులను అనేక సవాళ్లు వెంటాడుతున్నాయి. తరచూ దొంగతనాలు, చైన్ స్నాచింగ్‌లతో పాటు హత్యలు, లైంగిక దాడి ఘటనలు అనేకం వెలుగు చూస్తున్నాయి. వీటికి తోడు రోడ్డు ప్రమాదాలు పెద్దసంఖ్యలో జరుగుతున్నాయి. గంజాయి సరఫరా, వినియోగం భారీగా పెరిగింది. కల్తీ కల్లు విచ్చలవిడిగా విక్రయిస్తున్నారు. ఇందులో ఆల్ఫ్రాజోలం భారీగా వినియోగిస్తున్నారు. మత్తుపదార్థాల దందా రోజురోజుకూ గ్రామీణ ప్రాంతాలకు సైతం వ్యాప్తి చెందుతున్నది. పోక్సో కేసులు సైతం పెరుగుతున్నాయి. పట్టపగలే తాళాలు పగులగొట్టి చోరీలు చేస్తున్న ఘటనలతో పోలీసులు తలలు పట్టుకుంటున్నారు.
ఆందోళన కలిగిస్తున్న నేరాలు,ఘోరాలు
నేరాలు, ఘోరాలు పెరిగిపోతుండడం ఆందోళన కలిగిస్తున్నది. ఈ నేపథ్యంలో పోలీసులు బాధ్యతగా వ్యవహరించాల్సిన అవసరం ఉన్నది. నేరారోపిత, నేరాల్లో సాంకేతికతను వినియోగించి దర్యాప్తును పకడ్బందీగా నిర్వహించి అక్రమార్కులను పట్టుకోవాలి. క్షేత్ర స్థాయిలో కొంతమంది ఈ సవాళ్లను గాలికి వదిలేసి జేబులు నింపుకొనేందుకు ఎగబడుతున్నారు. ఇందుకోసం ఇసుక వ్యాపారులతో ములాఖత్ అవుతూ దందా కొనసాగిస్తున్నారు. అధికార పార్టీ నేతల మెప్పును దక్కించుకుంటూ పోస్టింగ్‌ను కాపాడుకుంటున్నారు.
విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించిన కానిస్టేబుళ్లను ఉన్నతాధికారులు సులువుగా సస్పెండ్ చేస్తున్నారు. బాన్సువాడ, జుక్కల్, బోధన్ నియోజకవర్గాల్లోని మంజీరా పరీవాహక ప్రాంతాల్లో ఇసుక అక్రమాల్లో కొంతమంది పోలీస్ అధికారులు నేరుగా పాత్రధారులుగా మారుతున్నారని ఆరోపణలు గుప్పుమంటుండగా ఇప్పటివరకు చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. ఏండ్లుగా ఒకే చోట పోస్టింగ్‌లో స్థిరత్వం దక్కించుకుని అన్నీ తామై వ్యవహరిస్తున్న ఖాకీలపై నిఘా కూడా కరువైందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.