Nizamabad | సిరికొండ, ఏప్రిల్24 : ఉపాధి హామీ కూలీలకు బకాయి ఉన్న కూలి డబ్బులను వెంటనే చెల్లించాలని, వ్యవసాయ కార్మికులకు ఎలాంటి షరతులు లేకుండా ఆత్మీయ భరోసాను అందించాలని అఖిలభారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం(ఏఐపీకేఎంఎస్) జిల్లా ప్రధాన కార్యదర్శి ఇట్టంపేట రమేష్ డిమాండ్ చేశారు.
మండల ప్రజల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీవో మనోహర్ రెడ్డికి గురువారం వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా రమేష్ మాట్లాడుతూ గ్రామాల్లో ఉపాధి హామీ కూలీలకు రోజువారి కూలి డబ్బులు చెల్లించడంలో నెలల తరబడిగా బకాయిలు పెండింగ్ లో పెట్టడం వల్ల వారికి దినదినం గండంగా మారిందని వాపోయారు. ఉపాధి కూలీలకు బకాయిలు ఉన్న వేతనాలు తక్షణమే చెల్లించాలని కోరారు.
రాష్ట్ర ప్రభుత్వం ఆరు గ్యారంటీల్లో భాగంగా వ్యవసాయ కార్మికులకు ఇస్తానన్న ఆత్మీయ భరోసా పథకం కింద రూ.12వేలు ఇప్పటికీ అందించలేదని, గ్రామాల్లో గ్రామసభలు పెట్టి అర్హుల జాబితాను ప్రకటించినప్పటికీ ఇంకా ఆత్మీయ భరోసా అందించలేదని మండిపడ్డారు.
ఈ కార్యక్రమంలో సీపీఐ (ఎంఎల్) మాస్ లైన్ డివిజన్ నాయకులు ఆర్ దామోదర్, అఖిలభారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం ( ఏఐపికేఎంఎస్) జిల్లా ఉపాధ్యక్షులు బి కిషోర్, సహాయ కార్యదర్శి జి. సాయరెడ్డి, కోశాధికారి ఎస్ కిషోర్, జిల్లా నాయకులు ఎర్రన్న, ఎల్ నరేష్, సర్పంచ్, మండల నాయకులు ఎండి ఖదీర్ తదితరులు పాల్గొన్నారు.