మహిళల ఆరోగ్య రక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన ఆరోగ్య మహిళ కార్యక్రమం సత్ఫలితాలనిస్తున్నది. ఆడబిడ్డల కండ్లలో సంతోషాన్ని చూడాలన్న ఉద్దేశంతో సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా కామారెడ్డి జిల్లాలోని మూడు దవాఖానల్లో ప్రతి మంగళవారం వైద్య పరీక్షలు నిర్వహిస్తుండగా.. మహిళలు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. వైద్య సిబ్బంది వారిని ఆప్యాయంగా పలకరిస్తూ ఉచితంగా సేవలందిస్తున్నారు. ఆరోగ్య మహిళ కార్యక్రమంలో భాగంగా కామారెడ్డి జిల్లాలో ఇప్పటివరకు 2,253 మందికి వైద్యపరీక్షలు నిర్వహించగా, 109 మందిని జిల్లా దవాఖానకు రెఫర్ చేశారు.
– తాడ్వాయి, మే 8
తల్లి బాగుంటేనే ఇల్లు బాగుంటుంది. ఆమె ఆరోగ్య సమస్యలతో సతమతం అయితే కుటుంబం మొత్తం ఇబ్బంది పడాల్సి వస్తుంది. కుటుంబ బాధ్యతలు, డబ్బుల ఖర్చు దృష్ట్యా చాలా మంది మహిళలు ఎవరికీ చెప్పుకోలేక తమ అనారోగ్య సమస్యలను బయటపెట్టుకోరు. చిన్నచిన్న ఇబ్బందులు వచ్చినా దవాఖానకు వెళ్లడం తక్కువే. ఈ విషయం గుర్తించిన సీఎం కేసీఆర్ మహిళలంతా సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలన్న లక్ష్యంతో ఆరోగ్య మహిళా కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మహిళలు ఎదుర్కొంటున్న ప్రధాన ఆరోగ్య సమస్యలకు సంబంధించిన పరీక్షలు నిర్వహించి, వారు స్వేచ్ఛగా తమ ఇబ్బందులను వైద్యులకు చెప్పుకునేలా ప్రారంభించిన ఈ కార్యక్రమం సత్ఫలితాలనిస్తున్నది. కామారెడ్డి జిల్లాలో ఆరోగ్య మహిళా కార్యక్రమానికి మూడు కేంద్రాలను ఏర్పాటు చేశారు.
– తాడ్వాయి, మే 8
మహిళా సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నది. మహిళల కోసం ప్రత్యేక పథకాలు అమలు చేస్తున్నది. జననం నుంచి మరణం వరకు వర్తించేలా సీఎం కేసీఆర్ అనేక వినూత్న పథకాలను ప్రారంభించారు. కేసీఆర్ కిట్, అమ్మఒడి, న్యూట్రిషన్ కిట్ తదితర కార్యక్రమాలతో మహిళల ఆరోగ్య సంరక్షణకు చర్యలు తీసుకుంటున్నారు. తాజాగా ఆడబిడ్డల కండ్లలో ఆనందం చూడాలన్న ఉద్దేశంతో ప్రారంభించిన ఆరోగ్య మహిళ కార్యక్రమం విజయవంతంగా సాగుతున్నది. కామారెడ్డి జిల్లాలోని మూడు ప్రభుత్వ దవాఖానల్లో ఆరోగ్య మహిళ కార్యక్రమాన్ని ప్రారంభించి ప్రతి మంగళవారం సేవలందిస్తున్నారు.
కామారెడ్డి జిల్లాలో..
కామారెడ్డి జిల్లాలోని తాడ్వాయి మండలం ఎర్రాపహాడ్ పీహెచ్సీ, డోంగ్లీ పీహెచ్సీ, బీర్కూర్ దవాఖానల్లో ఆరోగ్య మహిళా కార్యక్రమం కింద ప్రతి మంగళవారం మహిళలకు ఎనిమిది రకాల వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఎవరికైనా వ్యాధులు ఉన్నట్లు నిర్ధారణ అయితే వైద్య చికిత్సలతోపాటు మందులు అందిస్తున్నారు. ఆరోగ్య మహిళ కార్యక్రమంలో వైద్య సిబ్బంది మొత్తం ఆడవారే ఉండడంతో మహిళలు ఇబ్బంది పడుతున్న అనారోగ్య సమస్యలను స్వేచ్ఛగా చెబుతున్నారు.
మార్చి 8న ప్రారంభమైన ఆరోగ్య మహిళా కార్యక్రమంలో భాగంగా ఇప్పటి వరకు ఎర్రాపహాడ్ పీహెచ్సీలో 922 మంది మహిళలు ఆరోగ్య పరీక్షలు చేసుకున్నారు. ఇందులో 192 మందికి వివిధ రకాల వ్యాధులు ఉన్నట్లు గుర్తించగా, 56 మందిని మెరుగైన వైద్యం కోసం జిల్లా దవాఖానకు రెఫర్ చేసినట్లు వైద్యాధికారిణులు అర్జుమన్ నజీరా, పావని పేర్కొన్నారు. బీర్కూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఇప్పటి వరకు 711 మంది మహిళలు వైద్య పరీక్షలు చేయించుకోగా, 36 మందిని కామారెడ్డి దవాఖానకు రెఫర్ చేశారు. మిగతా వారికి మందులు అందజేసినట్లు వైద్యాధికారిణి శ్రీలేఖ తెలిపారు. డోంగ్లీలో ఇప్పటి వరకు 620 మంది మహిళలకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించగా, 603 మందికి చికిత్సలు నిర్వహించామని డాక్టర్ రీతు పాటిల్ తెలిపారు. 17 మందిని జిల్లా దవాఖానకు రెఫర్ చేసినట్లు పేర్కొన్నారు.
వైద్యపరీక్షలు.. మెరుగైన వైద్యం
ఆరోగ్య మహిళ కార్యక్రమంలో భాగంగా పీహెచ్‌సీకి వచ్చిన మహిళలను వైద్య సిబ్బంది ఆప్యాయంగా పలకరిస్తున్నారు. ప్రధాన వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. బీపీ, షుగర్, రక్తహీనత వంటి ప్రాథమిక పరీక్షలు చేయడంతోపాటు మహిళలు చెప్పిన లక్షణాల ఆధారంగా ఓరల్, సర్వైకల్, రొమ్ము క్యాన్సర్లు, మూత్రకోశ సంబంధిత ఇన్ఫెక్షన్లు, నెలసరి సమస్యలు వంటివి స్క్రీనింగ్ చేస్తున్నారు. అధిక లేదా తక్కువ బరువు, సుఖ వ్యాధులపై అవగాహన కల్పిస్తున్నారు. థైరాయిడ్ పరీక్ష, సూక్ష్మ పోషకాల లోపాలు, అయోడిన్, ఫోలిక్ యాసిడ్, ఐరన్ లోపం, విటమిన్ బీ 12, విటమిన్ డీ లోప నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారు. ఈసీజీ, ఎక్స్-రే, అల్ట్రాసోనోగ్రఫీ, మామోగ్రామ్, పాప్‌స్మియర్ వంటి యంత్రాలను అందుబాటులో ఉంచారు. వీటితో ప్రతి మంగళవారం నమూనాలను సేకరించి ల్యాబ్‌కు పంపిస్తున్నారు. మెరుగైన వైద్యం కోసం పైదవాఖానలకు రెఫర్ చేస్తున్నారు.
స్వచ్ఛందంగా వచ్చి పరీక్షలు చేయించుకుంటున్నారు..
ప్రభుత్వం గ్రామీణ ప్రాంత మహిళల సంపూర్ణ ఆరోగ్యమే లక్ష్యంగా ప్రారంభించిన ఆరోగ్య మహిళా కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తున్నది. మహిళలు స్వచ్ఛందంగా కేంద్రానికి వచ్చి వైద్య పరీక్షలు చేయించుకుంటున్నారు. వైద్య సిబ్బంది మొత్తం మహిళలే ఉండడంతో తమ ఇబ్బందులను నిర్మోహమాటంగా వివరిస్తున్నారు. దీంతో అవసరమైన వారికి మందులతోపాటు మెరుగైన వైద్యానికి రెఫర్ చేస్తున్నాం.
-డాక్టర్ చంద్రశేఖర్, డిప్యూటీ డీఎంఅండ్‌హెచ్‌వో
సంతోషంగా ఉన్నది..
రాష్ట్ర ప్రభుత్వం మహిళల కోసం ప్రారంభించిన కార్యక్రమంలో భాగంగా సేవలందించడం సంతోషంగా ఉన్నది. ప్రభుత్వ ఆదేశాల మేరకు మహిళలకు ఎనిమిది రకాల వైద్య పరీక్షలు చేస్తున్నాం. అవసరమైన వారికి స్కానింగ్ చేసి వ్యాధులను నిర్ధారించి మందులు అందజేస్తున్నాం. మహిళలు ఆరోగ్యంగా ఉండేలా నిరంతరం పనిచేయడం సంతోషంగా ఉన్నది.
– డాక్టర్ పావని, మండల వైద్యాధికారిణి