లింగంపేట, జనవరి20: పండుగ పూర్తయినా ప్రయాణికులను ఆర్టీసీ వదలడంలేదు. స్పెషల్ పేరిట బస్సు చార్జీలను వసూలు చేస్తున్నది. కామారెడ్డి డిపో పరిధిలోని కామారెడ్డి, ఎల్లారెడ్డి రూట్లో ఇటీవల ఎక్స్ప్రెస్ బస్సు సర్వీసు ప్రారంభించారు. కామారెడ్డి నుంచి లింగంపేటకు టికెట్ ధర 50 రూపాయలుగా నిర్ణయించారు. సోమవారం నుంచి పాఠశాలలు పునః ప్రారంభం కావడంతో పండుగకు ఇంటికి వచ్చిన విద్యార్థులు తిరుగు ప్రయాణమవుతున్నారు. స్వగ్రామాలకు వచ్చిన ఉద్యోగులు కూడా విధులు నిర్వహించే ప్రాంతాలకు తరలివెళ్తున్నారు.
సోమవారం కామారెడ్డి, ఎల్లారెడ్డి రూట్లో నడిచే ఎక్స్ప్రెస్ బస్సులో పది రూపాయలు అదనంగా చార్జి వసూలు చేశారు. టికెట్ ధర రూ.50 ఉండగా, రూ. 60 వసూలు చేశారు. కామారెడ్డి నుంచి లింగంపేటకు వెళ్తున్న ఓ ప్రయాణికుడి వద్ద ఎక్స్ప్రెస్ బస్సుకు సరిపడా డబ్బులు లేకపోవడంతో తాడ్వాయి మండలం దేవాయిపల్లి గ్రామ రహదారిపై మార్గమధ్యంలో దించివేశారు. స్పెషల్ బాదుడుపై ప్రయాణికులు మండిపడ్డారు. ఆర్టీసీ అధికారులు తీరుపై నిరసన వ్యక్తంచేశారు. ‘స్పెషల్’ బాదుడుతో ప్రయాణికుల జేబులకు చిల్లులు పడగా, ఆర్టీసీకి మాత్రం భారీగా ఆదాయం చేకూరింది.