ఖలీల్‌వాడి/కామారెడ్డి, సెప్టెంబర్ 15 : ఉమ్మడి జిల్లాలో టెట్ ప్రశాంతంగా ముగిసింది. టెట్ కేంద్రాన్ని నిజామాబాద్ కలెక్టర్ రాజీవ్‌గాంధీ హన్మంతు శుక్రవారం తనిఖీ చేశారు. జిల్లా కేంద్రంలోని సుభాష్‌నగర్‌లో ఉన్న ఎస్వీ కళాశాలలో కొనసాగుతున్న కేంద్రాన్ని తనిఖీ చేసి, పరీక్షల నిర్వహణ తీరుతెన్నులను పరిశీలించారు. చీఫ్ సూపరింటెండెండ్లను పలు వివరాలను అడిగి తెలుసుకున్నారు. నిబంధనలను పాటిస్తూ సమయానుసారంగా ప్రశ్నాపత్రాలను తెరిచారా అని ఆరా తీశారు. అభ్యర్థులకు తాగునీటి వసతి కల్పించాలన్నారు. పరీక్షా కేంద్రాల వద్ద పోలీసు బందోబస్తును పరిశీలించారు. ఏమైనా సమస్యలు ఎదురైతే అధికారుల దృష్టికి తీసుకురావాలని చీఫ్ సూపరింటెండెంట్‌కు సూచించారు. నిజామాబాద్ జిల్లాలో టెట్ పరీక్షలు ప్రశాంతగా ముగిసిందని డీఈవో దుర్గా ప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు. 64 కేంద్రాలను ఏర్పాటు చేశారు.
మొదటి పేపర్‌కు 15,263 మందికి 12,520 మంది హాజరుకాగా 2,743 మంది గైర్హాజరయ్యారు. రెండో పేపర్‌కు 50 కేంద్రాల్లో 11,573 మందికి 10,395 మంది హాజరుకాగా 1,178 మంది గైర్హాజరైనట్లు తెలిపారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో టెట్ ప్రశాంతంగా జరిగిందని డీఈవో రాజు తెలిపారు. కామారెడ్డి జిల్లాలో మొదటి పేపర్ 24 కేంద్రాల్లో నిర్వహించిగా 5,535 మందికిగాను 4,700 మంది హాజరయ్యారు. 835 మంది గైర్హాజరయ్యారు. రెండో పేపర్‌ను 19 కేంద్రాల్లో నిర్వహించగా 4,205 మందికిగాను 3,971 మంది హాజరయ్యారు. 234 మంది గైర్హాజరయ్యారు. కామారెడ్డిలోని శ్రీఆర్యభట్ట, జీవదాన్ హైస్కూల్లో ఎస్పీ శ్రీనివాస్‌రెడ్డి టెట్ కేంద్రాన్ని పరిశీలించారు. విద్యార్థుల హాజరుశాతం, పరీక్షల రికార్డులను పరిశీలించారు. పరీక్ష అనంతరం పత్రాలను పోలీసు బందోబస్తు మధ్య తరలించారు. ఆయా పరీక్షా కేంద్రాలను డీఈవో రాజు, పరీక్షల విభాగం అధికారి నీలం లింగం పరిశీలించారు.