రామారెడ్డి, నవంబర్ 22: రామారెడ్డి పోలీస్‌స్టేషన్‌లో శుక్రవారం అర్ధరాత్రి హంగామా చోటుచేసుకున్నది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భీమవరంతోపాటు రామారెడ్డి పోలీసులతో పలువురు మద్దికుంట వాసులు వాగ్వాదానికి దిగారు. వివరాలు ఇలా ఉన్నాయి. రామారెడ్డి మండలం మద్దికుంటకు చెందిన రమేశ్ జీవనోపాధి కోసం గతంలో దుబాయ్ వెళ్లాడు. అక్కడ ఆయనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం భీమవరం మండలానికి చెందిన భూసి బేబీతో పరిచయం ఏర్పడింది. ఆమెతో సహజీవనం చేసిన ఆయన.. కొన్నాళ్లకు ఇండియాకు వచ్చాడు. బేబీ కూడా ఇండియా వచ్చి మద్దికుంటలో రమేశ్‌తో కలిసి ఉంటున్నది. రమేశ్ మరో మహిళను వివాహం చేసుకోవడంతో బేబీ భీమవరం వెళ్లింది.
రమేశ్ తనను ప్రేమ పేరుతో మోసం చేశాడని, తన నుంచి రూ.12లక్షల వరకు నగదు, ఎనిమిది తులాల బంగారం తీసుకున్నాడని భీమవనం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు భీమవరం రూరల్ ఎస్సై వీరబాబు, ఇద్దరు కానిస్టేబుళ్లు సివిల్ డ్రెస్‌లో శుక్రవారం మద్దికుంటకు వచ్చి రాత్రి ఎనిమిది గంటల ప్రాంతంలో రమేశ్‌ను అదుపులోకి తీసుకున్నారు. వారితో రమేశ్ బంధువులు దురుసుగా ప్రవర్తించారు. మీరు పోలీసులు కాదు.. దొంగలు అంటూ వాగ్వాదానికి దిగారు. భీమవరం పోలీసులు రమేశ్‌ను తమ కారులో నేరుగా రామారెడ్డి పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లారు.
పలువురు రమేశ్ బంధువులు రామారెడ్డి పోలీస్‌స్టేషన్‌కు వచ్చి విధుల్లో ఉన్న పోలీసులతో తాగిన మైకంలో అసభ్యంగా ప్రవర్తించారు. పోలీస్‌స్టేషన్‌లో గొడవకు దిగారు. విషయం తెలుసుకున్న ఉన్నతాధికారులు అక్కడ పోలీసు బలగాలను పంపించారు. మాచారెడ్డి, రామారెడ్డి ఎస్సైలు అనిల్, రాజశేఖర్.. రమేశ్ బంధువులు, కుటుంబ సభ్యులతో మాట్లాడారు. అతడిని భీమవరం పోలీసులకు అప్పగించారు. కాగా.. పోలీస్‌స్టేషన్‌లో హంగా మా చేసి, పోలీసుల విధులకు ఆటంటం కలిగించిన మద్దికుంటకు చెందిన పది మందిపై కేసు నమోదు చేసినట్లు రామారెడ్డి ఎస్సై రాజశేఖర్ శనివారం తెలిపారు.