నిజామాబాద్ : జిల్లా కేంద్రానికి శివారు ప్రాంతంలో గల మాధవనగర్ వద్ద తాత్కాలిక రోడ్డు వరద నీటికి కొట్టుకుపోయింది. మాధవ్ నగర్ రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణంతో తార్ రోడ్డుకు బదులుగా తాత్కాలిక రోడ్డు ద్వారా హైదరాబాద్ – నిజామాబాద్ మార్గాన్ని ప్రభుత్వ యంత్రాంగం కలిపింది. రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు వరద ఉధృతంగా రావడంతో మట్టి రోడ్డు నామరూపల్లేకుండా కొట్టుకుపోయింది.
దీంతో హైదరాబాద్ మార్గంలో వెళ్లేందుకు నగరవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. బైపాస్ రోడ్డు మీదుగా వాహనాలను ట్రాఫిక్ పోలీసులు మళ్లిస్తున్నారు. కాగా భారీ వర్షాలకు జిల్లాలో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. పలు చోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. వానలు జోరుగా కురుస్తుండటంతో రైతులు సాగు పనుల్లో నిమగ్నమయ్యారు.