నిజామాబాద్, మార్చి 27, (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : తెలంగాణ యూనివర్సిటీ పాలన అస్తవ్యస్తంగా మారింది. పాలకవర్గం గడువు గతేడాది ఫిబ్రవరితో ముగియగా.. ఇప్పటివరకూ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్(ఈసీ) నియామకంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టిసారించడంలేదు. ఈసీ నియామక ప్రక్రియకు ఒక్క అడుగు కూడా ముందుకుపడకపోవడం గమనార్హం. వర్సిటీ నిర్వహణకు కీలకమైన ఈసీ లేకపోవడంతో ప్రస్తుతం జవాబుదారీతనం లేకుండా పోయింది. అసలేం జరుగుతున్నదో తెలియని పరిస్థితి నెలకొన్నది. రహస్యంగానే ఫైళ్ల కదలికలకు వీసీ, రిజిస్ట్రార్లు ప్రయత్నిస్తున్నట్లు ప్రచారం జరుగుతున్నది. పద్ధతి ప్రకారం ఏవైనా కార్యకలాపాలు నిర్వహించాలంటే ఈసీ ఉంటేనే సాధ్యమవుతుంది.
పాలకవర్గంలో ఆయా అజెండా అంశాలను చర్చించి, కూలంకషంగా అనుమానాలను నివృత్తి చేసుకున్న తర్వాతే ఈసీ ఆమోదంతో ఏ కార్యక్రమమైనా చేపట్టాల్సి ఉంటుంది. ఈసీ లేకపోవడంతో కొంతకాలంగా వర్సిటీలో ఇష్టారాజ్యం కొనసాగుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. పాలకవర్గం రాకపోతేనే నయం అనే ధోరణిలో టీయూ పెద్దలు భావిస్తున్నట్లు సమాచారం. సీఎం రేవంత్ రెడ్డి చేతుల్లోనే విద్యాశాఖ ఉన్నది. విశ్వవిద్యాలయాలను పర్యవేక్షించేందుకు ప్రత్యేకంగా మంత్రి లేడు. ఉమ్మడి జిల్లాకు మంత్రి పదవీ లేదు. ఇన్చార్జి మంత్రి ఉన్నా తూతూ మంత్రంగానే పర్యటనలు చేసి మమ అనిపిస్తున్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సైతం టీయూ వ్యవహారాన్ని గాలికి వదిలేశారు.
గతంలో ఎన్నడూ లేని విధంగా ఏడాది పొడవునా టీయూ పాలకవర్గం నియామకంలో నిర్లక్ష్యం వహిస్తుండడంతోపాటు రాజకీయ రంగు పులుముకుంటున్నది. ఈసీ సభ్యుల నియామకానికి నోటిఫికేషన్ జారీ కావాల్సి ఉంది. ఇంత వరకూ ప్రకటన విడుదల కాలేదు. రేపో మాపో ఈసీ వస్తుందంటూ ఊహాగానాలు చక్కర్లు కొట్టడమే తప్ప, వాస్తవానికి ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ రూపకల్పనపై ప్రభుత్వం దృష్టి పెట్టిన దాఖలాలే కనిపించడంలేదు.
ఈసీలో మెంబర్‌గా కొనసాగేందుకు కాంగ్రెస్ పార్టీ సానుభూతిపరులు పైరవీలు షురూ చేసినట్లు సమాచారం. రాజకీయ నిరుద్యోగులకే చోటు కల్పించేందుకు సర్కారు సుముఖత వ్యక్తం చేసినట్లు టీయూ వర్గాలు చెబుతున్నా యి. రాజకీయాలకతీతంగా నియామకం చేపడితే వర్సిటీ గాడిలో పడేందుకు అవకాశం ఉంటుంది. భారీ లక్ష్యాలను పెట్టుకుని ఈసీ నియామకంలో జాప్యం చేయడం, సభ్యులుగా పైరవీ చేసుకునే వారికే చోటు కల్పించే దిశగా పావులు కదుపుతుండడంతో సర్కారు లక్ష్యాలు నెరవేరబోవని విద్యావేత్తలు భావిస్తున్నారు. చెప్పేదొకటి చేసేదొకటి అన్న రీతిలోప్రభుత్వం పని చేస్తున్నదంటూ విద్యార్థి సంఘా లు విమర్శిస్తున్నాయి. విద్యార్హతలు, అకడమిక్ అనుభవాలు పక్కన పెట్టి సర్కారుకు కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులే సిఫార్సు చేసినట్లు ప్రచారం జరుగుతున్నది.
టీయూకి సంబంధించిన 50ఎకరాలకు పైగా విలువైన భూమిని ప్రైవేటు వ్యక్తులు ఆక్రమించారని ఆరోపణలున్నాయి. ఈ వ్యవహారంపై హైకోర్టులో కేసు సాగింది. విచారణ సమయంలో టీయూ వర్గాలు ఆసక్తి చూపకపోవడంతో విలువైన భూముల కేసులో ప్రైవేటు వ్యక్తులకు అనుకూలంగా తీర్పు వచ్చింది. అప్పీల్‌కు వెళ్లే అవకాశం ఉండగా టీయూ వర్గాలు స్పందించడం లేదు. టీయూ భూములను న్యాయపరంగా కొట్లాడి దక్కించుకోవాల్సిన పెద్దలు ఇప్పుడు మౌనంగా ఉండిపోతున్నా రు. ఇదే హైకోర్టులో విచారణలో ఉన్న మరో వివాదాస్పద అంశాన్ని రాత్రికి రాత్రే చేతుల్లోకి తీసుకుని సింగిల్ జడ్జి ఇచ్చిన ఆర్డర్ కాపీ ఆధారంగా ముగింపు పలికేందుకు పాకులాడుతుండడం ప్రాధాన్యతను సంతరించుకున్నది.
టీయూ పెద్దల తీరు ఒక్కో వ్యవహారంలో ఒక్కో లా కనిపిస్తుండడంపై విద్యార్థుల్లోనూ అనుమానాలకు తావిస్తోంది. వర్సిటీలో కొత్త కోర్సులు, పరిశోధన, అభివృద్ధిపై దృష్టి సారించాల్సి ఉండగా వాటిని గాలికి వదిలేసి, వివాదాస్పద అంశాల జోలికి వెళ్లడంపై చర్చ నడుస్తున్నది. టీయూలో మితిమీరుతున్న ఆగడాలకు చెక్ పడాలంటే పాలకవర్గం నియామకమే నూటికి నూరు శాతం కరెక్ట్ అని టీయూ వర్గాలు భావిస్తున్నాయి. ప్రజాస్వామ్యబద్ధంగా, పారదర్శకంగా పనులు జరిగేందుకు అవకాశం ఉంటుందని అభిప్రాయపడుతున్నారు.