బోధన్ / కోటగిరి, ఆగస్టు 26: సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డిని మరోమారు భారీ మెజార్టీతో గెలిపించాలని రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్ అలీ అన్నారు. బాన్సువాడకు వస్తే తనకు పుట్టింటికి వచ్చినట్టు ఉంటుందని, పోచారంతో తన అనుబంధం అలాంటిదని పేర్కొన్నారు. కోటగిరి మండల కేంద్రంలో రూ.6.75 కోట్లతో నిర్మించిన మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్ భవనాన్ని సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డితో కలిసి శనివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో హోంశాఖ మంత్రి మాట్లాడారు. ఉమ్మడి ఏపీలో ముస్లింలకు తీరని అన్యాయం జరిగిందన్నారు. మైనార్టీల సంక్షేమం కోసం ఎన్నోసార్లు ధర్నాలు, ఆందోళనలు చేయాల్సివచ్చేదని, అయినప్పటికీ పాలకులు నిర్లక్ష్యం చేశారని గుర్తుచేశారు. స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ మైనార్టీలకు ఎన్నో సంక్షేమ పథకాలను అమలుచేస్తున్నారని తెలిపారు. తెలంగాణలో మతకలహాలు లేవని, అన్ని మతాల ప్రజలు కలిసిఉంటూ గంగా జమునా తెహజీబ్ సంస్కృతిని చాటుతున్నారన్నారు. ఇలా పాలన చేయడం 56 ఇంచుల ఛాతీ ఉంటే సాధ్యంకాదని, ఆరు ఇంచుల హృదయంతో మానవత్వం చాటినప్పుడే సాధ్యమవుతుందని పేర్కొన్నారు. కేసీఆర్ మానవత్వం కలిగిన మనిషి కాబట్టే.. రాష్ట్రంలో అన్ని వర్గాల సంక్షేమం జరుగుతున్నదని, రాష్ట్రం ఎంతో అభివృద్ధిని సాధిస్తున్నదని మహమూద్ అలీ అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో మైనార్టీ వ్యక్తి డిప్యూటీ సీఎం కాలేదని, స్వరాష్ట్రంలో మైనార్టీ వర్గానికి చెందిన తనను డిప్యూటీ సీఎం చేశారని, ఇది ఆయన గొప్ప మనుస్సుకు నిదర్శనమన్నారు.
మైనార్టీ విద్యార్థుల కోసం పెద్ద ఎత్తున రాష్ట్రంలో రెసిడెన్షియల్ పాఠశాలలు ఏర్పాటుచేసి, నాణ్యతతో కూడిన విద్యను అందిస్తున్నారని మహమూద్ అలీ అన్నారు. కేవలం రెండేండ్ల వ్యవధిలోనే రాష్ట్రంలో 204 రెసిడెన్షియల్ పాఠశాలలు ఏర్పాటుచేశారన్నారు. దీంతో ఈ పాఠశాలల్లో చదివిన విద్యార్థులు ఉన్నత విద్య చదవగలుగుతున్నారని తెలిపారు. విదేశాలకు కూడా వెళ్తున్నారని అన్నారు. అమెరికా, ఆస్ట్రేలియా, లండన్ తదితర దేశాలకు విద్య కోసం వెళ్లే విద్యార్థులకు ఓవర్సీస్ స్కాలర్పిప్లుగా రాష్ట్ర ప్రభుత్వం రూ.20 లక్షలు ఇస్తున్నదని చెప్పారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు కూడా విదేశీ విద్యకు ఆర్థిక సహాయం చేస్తున్నదన్నారు. కోటగిరిలో నిర్మించిన మైనార్టీల రెసిడెన్షియల్ పాఠశాల ఎంతో బాగున్నదని, కేవలం 14 నెలల వ్యవధిలోనే స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో నిర్మాణం పూర్తిచేసుకోవడం అభినందనీయమన్నారు. మైనార్టీల షాదీ ముబారక్ పథకం కోసం రాష్ట్రంలో ఇప్పటివరకు రూ.2,225 కోట్లు ఖర్చుచేసినట్లు తెలిపారు.
జిల్లాలో మైనార్టీబంధు ఆర్థిక సాయం పంపిణీ కార్యక్రమంలో కోటగిరిలో జరిగిన బహిరంగసభలో ప్రారంభించారు. శనివారం మొత్తం 52 మంది మైనార్టీలకు రూ.లక్ష ఆర్థిక సహాయం చెక్కులను రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్ అలీ, స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి పంపిణీచేశారు. కార్యక్రమంలో రాష్ట్ర మైనార్టీ కమిషన్ చైర్మన్ తారీఖ్ అన్సారీ, మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ మహ్మద్ ఇంతియాజ్, ఉర్దూ అకాడమీ చైర్మన్ ముజీబుద్దీన్, వక్ప్‌బోర్డ్ చైర్మన్ మసీఉల్లాఖాన్, నిజామాబాద్, కామారెడ్డి జడ్పీ చైర్మన్లు దాదన్నగారి విఠల్‌రావు, దఫేదార్ శోభ, కలెక్టర్ రాజీవ్ గాంధీ హన్మంతు, బోధన్ ఆర్డీవో రాజాగౌడ్, మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్ సెక్రటరీ షఫీఉల్లా, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు పోచారం సురేందర్‌రెడ్డి, ఎంపీపీ వల్లేపల్లి సునీత, జడ్పీటీసీ శంకర్ పటేల్, సర్పంచ్ పత్తి లక్ష్మణ్, జడ్పీ ఏఎంసీ చైర్మన్ మహ్మద్ అబ్దుల్ హమీద్ తదితరులు పాల్గొన్నారు.