నిజామాబాద్, సెప్టెంబర్ 14 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) తెలంగాణ నాన్-గెజిటెడ్ ఆఫీసర్స్ (టీఎన్జీవో) అసోసియేషన్‌లో అసమ్మతి సెగ మరింత రాజుకుంటున్నది. ఉద్యోగ సంఘంలో ప్రచ్ఛన్న యుద్ధం కొనసాగుతున్నది. ఏండ్లుగా పాతుకుపోయి, అంతా తామై నడిపిస్తున్న వారిపై తీవ్ర వ్యతిరేకత వెల్లువెత్తుతున్నది. ఇదే అంశాన్ని ఎత్తిచూపుతూ ‘నమస్తే తెలంగాణ’ ఇటీవల ప్రత్యేక కథనం ప్రచురించిన నేపథ్యంలో రాష్ట్ర నాయకత్వం రంగంలోకి దిగింది.
అసలు టీఎన్జీవోకు సారథ్యం వహించేందుకు అర్హత లేకపోయినప్పటికీ సంవత్సరాల తరబడి తిష్ట వేసిన వారిని తప్పించేందుకు సన్నాహాలు ప్రారంభించింది. ఇందులో భాగంగానే రాష్ట్ర అధ్యక్షుడు జగదీశ్ వారం క్రితం నిజామాబాద్‌కు వచ్చారు. సంస్థకు జవసత్వాలు చేకూర్చేందుకు కొత్త నాయకత్వాన్ని ఎన్నుకోవాలన్న ఎజెండాతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఏమైందో ఏమో కానీ, ఆ సమావేశం ఎటూ తేల్చకుండానే ముగిసింది. అయితే, అటు రాష్ట్ర నాయకత్వం, ఇటు జిల్లా కార్యవర్గం కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ నాయకత్వ మార్పు తథ్యమన్న సంకేతాలను ఇస్తున్నాయి.
కార్యవర్గంలో మార్పులు, చేర్పులు ఖాయమేనన్న ప్రచారంతో ఆశావహులు అధ్యక్ష స్థానంపై కన్నేశారు. సామాజిక సమీకరణలను దృష్టిలో పెట్టుకుని పావులు కదుపుతున్నారు. టీఎన్జీవోకు చేసిన సేవలను పరిగణనలోకి తీసుకుని జిల్లా కార్యవర్గంలో కీలక స్థానాల కోసం ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. ఓ వైపు కార్యవర్గం కూర్పుకై పోటీ, మరోవైపు పాత వారిలో అలుముకున్న అసంతృప్తి వెరసి మొత్తంగా ప్రచ్ఛన్న యుద్ధం జరుగుతున్నట్లు తెలిసింది. అటు కామారెడ్డి టీఎన్జీవో కార్యవర్గంలోనూ ముసలం రాజుకుంటున్నది.
టీఎన్జీవోలో అనర్హులు ఉన్నారన్న వ్యవహారంపై ‘నమస్తే తెలంగాణ’ 2024 ఫిబ్రవరి 28న ‘సీటు వదలం’ అనే శీర్షికతో ప్రచురించిన కథనం ఉద్యోగ వర్గాలను ఆలోచనల్లో పడేసింది. అనర్హులదే రాజ్యం నడుస్తుందన్న వాదనకు బలం చేకూర్చేలా చాలా మంది టీఎన్జీవో సభ్యులు కేంద్ర నాయకత్వానికి, ప్రభుత్వానికి ఫిర్యాదులు చేశారు. సాధారణ పరిపాలన శాఖ (జీఏడీ)కి నమస్తే తెలంగాణలో వచ్చిన కథనాన్ని ఫిర్యాదులకు జత చేశారు. అనర్హులను తొలగించి అర్హులైన వారికే పదవులు కట్టబెట్టాలని, మార్పు కనిపించకపోతే తామంతా తప్పుకుని ప్రభుత్వ శాఖల వారీగా, కులాల వారీగా కొనసాగుతున్న ఉద్యోగ సంఘాల్లో పని చేసుకుంటామని అల్టిమేటం జారీ చేశారు.
ఈ వివాదానికి ప్రభుత్వం చెక్ పెట్టింది. గెజిటెడ్ ఉద్యోగులెవ్వరూ నాన్ గెజిటెడ్ ఉద్యోగుల సంఘాల్లో కొనసాగడానికి వీల్లేదని ఉత్తర్వులు జారీ చేసింది. పదవులను త్యజించకపోతే చర్యలు తప్పవని హెచ్చరించడం ద్వారా ప్రభుత్వమే ప్రచ్ఛన్న యుద్ధానికి తెర వేయనున్నది. మరోవైపు, కామారెడ్డి జిల్లా టీఎన్జీవోలోనూ అంతర్యుద్ధం తారాస్థాయికి చేరుకుంది. జిల్లా సెక్రెటరీగా పని చేసిన వ్యక్తి ఈ మధ్యే హైదరాబాద్‌కు బదిలీ అయ్యారు. సాంకేతికంగా ఈయనకు కామారెడ్డి టీఎన్జీవో పదవుల్లో కొనసాగకూడదు. స్వచ్ఛందంగానే తప్పుకోవాలి.
కానీ అలా జరుగక పోవడంపై టీఎన్జీవో అధినాయకత్వానికి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. సెక్రెటరీ పోస్టుకు వేరే వారిని నియమించాలని కోరుతుండడంతో ఇక్కడ కూడా వివాదం రాజుకున్నట్లయింది. హైదరాబాద్‌కు బదిలీపై వెళ్లిన సదరు ఉద్యోగి ఆన్ డిప్యుటేషన్(ఓడీ) ద్వారా తిరిగి కామారెడ్డి వచ్చేందుకు పాకులాడుతున్నట్లుగా తెలిసింది. ఓడీ పేరిట వచ్చి టీఎన్జీవో పదవిని కాపాడుకోవాలని యోచిస్తున్నట్లు ప్రచారం జరుగుతున్నది. డిప్యుటేషన్‌పై వచ్చే వారికి వర్కింగ్ ప్లేస్ ఉన్నటువంటి జిల్లాలో తప్ప ఇతర జిల్లాల్లో టీఎన్జీవో పదవులను చేపట్టే అవకాశం లేదని బైలా చెబుతుండడం విశేషం.
కొన్నేండ్లుగా నిజామాబాద్ టీఎన్జీవోస్లో ఎన్నికలు అన్నవే లేకుండా పోయాయి. గతంలో సీనియర్ నాయకుల సలహాలు, సూచనల మేరకు తాలూక స్థాయిలో మొదటగా ఎన్నికలు నిర్వహించే వారు. ఆ తర్వాత జిల్లా స్థాయి కార్యవర్గాన్ని ఎన్నుకునే వారు. దశాబ్ద కాలంగా ఈ తరహా ప్రక్రియ నామమాత్రంగానే కొనసాగుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఏకఛత్రాధిపత్యంలో అంతా తానై వ్యవహరించిన కీలక నేత ఇదేది పాటించకుండానే కొత్త సభ్యత్వాలను ప్రోత్సహించకుండానే కార్యవర్గాల్లో తనకు నచ్చిన వారికి చోటు కల్పించారని ఉద్యోగులు మండిపడుతున్నారు.
జీఏడీ నుంచి వచ్చిన ఆదేశాలతో ఎట్టకేలకు టీఎన్జీవో కేంద్ర నాయకత్వం ఈ వ్యవహారాలపై దృష్టి సారించడంపై సభ్యుల్లో హర్షం వ్యక్తమవుతున్నది. నాన్ గెజిటెడ్ సంఘంలో గెజిటెడ్ ఉద్యోగులకు స్థానం లేకపోయినప్పటికీ, బైలాను తుంగలో తొక్కి కొందరు పదవులను దక్కించుకున్నారు. ఇప్పుడు బైలాను ముందు పెట్టి నిబంధనల మేరకు అర్హులైన వారికే పదవులను అంటగట్టేందుకు టీఎన్జీవో నాయకత్వం చర్యలు చేపట్టింది. ఈ హఠాత్పరిణామాలు ఏళ్లుగా పాతుకుపోయిన వారిలో షాక్‌కు గురి చేస్తుండగా, సభ్యుల్లో కొంగొత్త ఆశలను రేకెత్తిస్తున్నాయి. త్వరలోనే ఎన్నికలు జరుగుతుండటంతో టీఎన్జీవోకు మంచి రోజులు వచ్చాయంటూ సంబురాలు చేసుకుంటున్నారు.