నిజామాబాద్, సెప్టెంబర్ 9, (నమస్తే తెలంగాణ ప్రతినిధి): గ్రూప్ 1 పరీక్ష మూల్యాంకనంలో అవకతవకలు, పరీక్ష కేంద్రాల కేటాయింపు, హాల్ టికెట్ల జారీ, పరీక్ష ఫలితాల్లో అనుమానాలు, అక్రమాల ఆరోపణల నేపథ్యంలో హైకోర్టు కీలక తీర్పును వెలువరించింది. గతంలో ప్రకటించిన జనరల్ ర్యాంకింగ్ లిస్టును రద్దు చేసింది. మెయిన్స్ పరీక్ష పేపర్లను మళ్లీ మూల్యాంకనం చేయాలని టీజీపీఎస్సీని ఆదేశించింది. రీవాల్యుయేషన్ ఆధారంగానే ఫలితాలు వెల్లడించాలని సూచించింది.
పునఃమూల్యాంకనం సాధ్యం కాకపోతే 8నెలల్లో మళ్లీ మెయిన్స్ పరీక్షలను నిర్వహించాలని స్పష్టం చేసింది. రాష్ట్ర అత్యున్నత న్యాయ స్థానం ఇచ్చిన తీర్పుతో కాంగ్రెస్ ప్రభుత్వం డొల్లతనాన్ని తేటతెల్లం చేసినట్లు అయ్యింది. లోప భూయిష్టంగా పరీక్షలు నిర్వహించి విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతోన్న సీఎం రేవంత్ రెడ్డి తీరుపై నిరుద్యోగ యువత తీవ్ర స్థాయిలో మండిపడుతున్నది.
హడావిడిగా పరీక్షలు నిర్వహించి, అవకతవకలకు పాల్పడ్డ ప్రభుత్వ పెద్దల తీరుకు, సర్కారు నిర్లక్ష్యానికి విద్యార్థులు, నిరుద్యోగులు బలి కావాల్సిన దుస్థితి ఏర్పడింది. గప్పాలు కొట్టే కాంగ్రెస్ ప్రభుత్వానికి పరీక్షలు ఎలా నిర్వహించాలో తెలియదా? అని గ్రూప్ 1 అభ్యర్థులు నిలదీస్తున్నారు. రీవాల్యూయేషన్ సాధ్యమయ్యే పరిస్థితి లేకపోవడంతో గ్రూప్ 1 ప్రాథమిక పరీక్షలు(ప్రిలిమ్స్) సైతం తిరిగి నిర్వహించాలని దరఖాస్తుదారులు డిమాండ్ చేస్తున్నారు.
నిరుద్యోగుల అనుమానమే నిజమైంది…
గ్రూప్ 1 ప్రాథమిక పరీక్ష, మెయిన్స్ పరీక్షల్లో ఆది నుంచి నిరుద్యోగులు అనుమానాలు వ్యక్తం చేశారు. రిజర్వేషన్ వర్తింపులో నిబంధనలు తుంగలో తొక్కడంతో పాటుగా పారదర్శకంగా ప్రిలిమ్స్ పరీక్షా ఫలితాలను వెల్లడించలేదు. ఈ వ్యవహారంపై కాంగ్రెస్ సర్కారు చేస్తోన్న తొండి వాదనను తప్పు పడుతూ యువత పెద్ద ఎత్తున ఆందోళనకు దిగింది. అయినప్పటికీ రేవంత్ రెడ్డి సర్కారు పట్టించుకోలేదు. మెయిన్స్ ఎగ్జామ్‌ను ఆగమేఘాల మీద నిర్వహించింది. హైకోర్టులో కేసు విచారణ జరుగుతుండగానే మెయిన్స్ పరీక్షలు పూర్తి చేసి ఫలితాలను రాకెట్ వేగంతో టీజీపీఎస్సీ వెల్లడించింది.
ఇందులోనూ అనేక లోటుపాట్లు వెలుగు చూడడంతో సర్కారు తప్పిదాలు అనేకం బయట పడ్డాయి. మెయిన్స్ ఫలితాల్లో అక్రమాలు చోటు చేసుకోవడంతో నిరుద్యోగులు ఆందోళన చేశారు. ఒకే సెంటర్, ఒకే గదిలో పరీక్షలు రాసిన వారంతా ఉత్తీర్ణత సాధించడం, తెలుగు మీడియం అభ్యర్థులకు తీరని అన్యాయం జరిగింది. గ్రూప్ 1 ప్రిలీమ్స్, మెయిన్స్ ఎగ్జామ్ ఫలితాల్లో గందరగోళం చోటు చేసుకోవడంతో పలువురు హైకోర్టును ఆశ్రయించారు. న్యాయ స్థానం సుదీర్ఘంగా విచారించి తుది తీర్పును వెలువరించడంతో రేవంత్ రెడ్డి ప్రభుత్వ తీరు బట్టబయలైంది. నిరుద్యోగుల అనుమానాలే నిజమయ్యాయి.
పత్తాలేని జాబ్ నోటిఫికేషన్లు..
అధికారంలోకి రాక మునుపు కాంగ్రెస్ ప్రభుత్వం కల్లబొల్లి మాటలు చెప్పింది. నిరుద్యోగులకు అనేక హామీలిచ్చింది. జాబ్ క్యాలెండర్ ప్రకారం నోటిఫికేషన్లు జారీ చేసి ఉద్యోగ భర్తీని చేపడుతామని చెప్పింది. గత సర్కారులో విడుదలైన గ్రూప్ 1 పరీక్షను నిర్వహించడంలోనే రేవంత్ రెడ్డి సర్కారు ఫెయిల్ కావడంతో ఇప్పుడు అందరికీ అనేక అనుమానాలు బలపడుతున్నాయి. జూన్ 2, 2025న 2లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు జారీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డితో సహా మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ప్రచారం చేశారు.
ముఖ్యమంత్రి సైతం అనేక మార్లు జాబ్ క్యాలెండర్‌పై ప్రకటనలు ఇచ్చి ఇప్పుడు మిన్నకుండి పోయారు. 2023, డిసెంబర్ 7న అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటి వరకు జాబ్ క్యాలెండర్ ప్రకారం ఒక్క నోటిఫికేషన్ జారీ చేయకపోవడం విడ్డూరంగా మారింది. కేవలం డీఎస్సీ భర్తీని మాత్రమే చేపట్టింది. కేసీఆర్ హయాంలో నిర్వహించిన పరీక్షలకు ఫలితాలు ఇచ్చి ఉద్యోగాలు సాధించిన వారికి నియామక పత్రాలు అందించి తన ఘనతగా రేవంత్ రెడ్డి చెప్పుకుంటూ కాలం గడుపుతుండటం ముక్కున వేలేసుకునేలా చేస్తోంది.
గ్రూప్ 1 తిరిగి మొదట్నుంచి నిర్వహించాలి..
గ్రూప్ 1 ప్రిలిమ్స్, మెయిన్స్ ఎగ్జామ్ నిర్వహణలో ఎక్కడా పారదర్శకత లేదు. మొండిగా పరీక్షలు నిర్వహించి, ఇష్టమొచ్చినట్లుగా ఫలితాలు ఇచ్చారు. నిరుద్యోగుల జీవితాలతో కాంగ్రెస్ ప్రభుత్వం ఆటలాడుకుంది. హైకోర్టు తీర్పుతో కాంగ్రెస్ సర్కారు తీరు తెలిసి పోయింది. విలువైన సమయాన్ని వృథా చేసినందుకు యువతకు సీఎం రేవంత్ రెడ్డి క్షమాపణలు చెప్పాలి. గ్రూప్ 01 తిరిగి మొదట్నుంచి నిర్వహించాలి.
– మధుకర్ రెడ్డి, బీఆర్ఎస్వీ నగర కార్యదర్శి, నిజామాబాద్
హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం..
గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షపై హైకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నాము. జీవో నెంబర్ 29 రద్దు చేయాలి. సెలక్షన్స్‌లో రిజర్వేషన్స్ పాటించలేదు. తెలుగు మీడియం విద్యార్థులకు తీవ్ర అన్యాయం జరిగింది. రీవాల్యుయేషన్ కాకుండా గ్రూప్ -1 పరీక్షలు మళ్లీ నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నాము.
– జన్నారపు రాజేశ్వర్, పీడీఎస్‌యూ జిల్లా ప్రధాన కార్యదర్శి