ధర్పల్లి/ఇందల్వాయి/సిరికొండ, ఆగస్టు 29: నిజామాబాద్ జిల్లాలో రెండ్రోజులపాటు కురిసిన భారీ వర్షాలు అంతులేని నష్టాన్ని మిగిల్చాయి. ధర్పల్లి, సిరికొండ, ఇందల్వాయి, భీమ్గల్, బోధన్, సాలూర, నవీపేట తదితర మండలాలు భారీ వరదలతో అతలాకుతలమయ్యాయి. హోన్నాజీపేట్ గ్రామ అటవీ ప్రాంతంలోని ముత్యాల చెరువు తెగడంతో వరద వచ్చి ధర్పల్లి మండలంలోని వాడీ, బీరప్ప, నడిమి తండాల్లో తీవ్ర నష్టం వాటిల్లింది.
పునరావాస కేంద్రాల నుంచి శుక్రవారం ఇండ్లకు చేరుకున్న బాధితులు తడిసిన నిత్యావసరాలు, విలువైన సామగ్రిని చూసి కన్నీటిపర్యంతమయ్యారు. బంధువులను పిలిపించుకుని పేరుకుపోయిన బురదను తొలగించారు. వాడీలో వరద ఉధృతికి బస్టాండ్ పునాదితో సహా కొట్టుకు పోయింది. పాఠశాల ప్రహరీ కూలిపోయింది. నడిమి తండాలో ట్రాక్టర్లు కొట్టుకుపోయాయి. నడిమి తండా, లక్ష్మీ చెరువు తండా, బీరప్ప తండా, వాడీ గ్రామాల పరిధిలోని పంటలు తీవ్రంగా దెబ్బ తిన్నాయి.
పొలాల్లో వేసి న ఇసుక మేటలు వేసి ఎడారిని తలపిస్తున్నాయి. ఇందల్వాయి మండలం సిర్నాపల్లి గ్రామం జలదిగ్బంధంలో చిక్కుకున్నది. రాం సాగర్ చెరువు కట్ట తెగిపోవడంతో పంటలు దెబ్బతిన్నాయి. ట్రాన్స్ఫార్మర్లు, విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. పలు ఇండ్లు కూలిపోయాయి. ఇందల్వాయిలోని తోట చిన్నరాజన్నకు చెందిన కోళ్లఫామ్ను వరద ముంచెత్తడంతో 5 వేల కోళ్లు మృతి చెం దాయి. సిరికొండ మండలం తూంపల్లి, మై లారం, సిరికొండ, పందిమడుగు, చీమన్పల్ల్లి గ్రామాల్లో 3,540 ఎకరాల్లో పంట నష్టం వాటిల్లింది.