లింగంపేట, ఫిబ్రవరి 26: పల్లెల్లో సౌర వెలుగులు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తున్నది. దేశంలోనే ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణలో గృహాలకు, వ్యవసాయానికి 24గంటలపాటు నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేస్తున్నది. సాంకేతిక కారణాలతో అక్కడక్కడా విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతుంది. అది కూడా ఏర్పడకుండా ఉండేందుకు సోలార్ యూనిట్ల ఏర్పాటును ప్రోత్సహిస్తున్నది. సోలార్ యూనిట్ ఏర్పాటుకు బ్యాంకుల ద్వారా రుణాలు అందించడంతోపాటు స్వయం సహాయక సంఘాల వారికి 40శాతం సబ్సిడీపై అందించడం విశేషం. లబ్ధిదారుల ఆసక్తి మేరకు 2కేవీ నుంచి 10కేవీ విద్యుత్ ఉత్పత్తి చేసే సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం కల్పించారు. కామారెడ్డి జిల్లాలో సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేసుకోవాలనుకునే లబ్ధిదారులను సెర్ప్ అధికారులు గుర్తిస్తున్నారు. జిల్లాలోని ఆయా మండలాల్లో స్వయం సహాయక సభ్యులకు అవగాహన కల్పించి ప్లాంటు ఏర్పాటు చేసుకునేలా చర్యలు చేపడుతున్నారు. గ్రామాల్లో 2కేవీ, 10కిలోవాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం గల ప్లాంట్ల ఏర్పాటుకు లబ్ధిదారులకు అవకాశం కల్పించారు.
లబ్ధిదారులు ఎంచుకున్న విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్ వ్యయంపై రూ.లక్ష నుంచి రూ. రెండు లక్షల వరకు బ్యాంకు లింకేజీ నుంచి రుణాలు అందిస్తున్నారు. సోలార్ ప్లాంట్ నుంచి ఉత్పత్తి అయిన విద్యుత్ నుంచి గృహవసరాలకు వినియోగించుకోగా మిగిలిన విద్యుత్‌ను గ్రిడ్‌కు సరఫరా చేసే అవకాశాన్ని కల్పిస్తున్నారు. యూనిట్‌కు ఐదు సంవత్సరాల వారంటీ ఉండగా సోలార్ పలకలు 25 సంవత్సరాల వరకు పని చేయనున్నాయి. కామారెడ్డి జిల్లాలోని లింగంపేట మండలాన్ని పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేశారు. మండలంలోని మోతె గ్రామంలో నాలుగు సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేసి విద్యుదుత్పత్తి చేస్తున్నారు.
సోలార్ యూనిట్ ఏర్పాటు చేసుకున్న నుంచి విద్యుత్ బిల్లుల భారం తగ్గింది. యూనిట్ ఏర్పాటుకు ముందు ఆలోచించాల్సి వచ్చింది. యూనిట్ ఏర్పాటు చేసుకున్న తర్వాత విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా పోయింది. యూనిట్ ఏర్పాటుకు సెర్ప్ అధికారులు లింగంపేటలోని తెలంగాణ గ్రామీణ బ్యాంకు నుంచి లోన్ ఇప్పించారు. లోన్ నెలసరి వాయిదాలు చెల్లించుకుంటున్నాం.
– సుమలత, లబ్ధిదారు, మోతె
కామారెడ్డి జిల్లాలో ఇప్పటి వరకు 150 సోలార్ యూనిట్లు ఏర్పాటు చేశాం. జిల్లాలోని బీర్కూర్ మండలం తిమ్మాపూర్, లింగంపేట మండలం మోతె, నస్రుల్లాబాద్ మండలం అంకోల్ క్యాంపు గ్రామాలను పైలెట్ గ్రామాలుగా ఎంపిక చేసి యూనిట్లు ఏర్పాటు చేశాం. మోతెలో నాలుగు, అంకోల్ క్యాంపులో 17, తిమ్మాపూర్‌లో 25 యూనిట్లు ఏర్పాటు చేశాం. 50మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యం గల యూనిట్లు నెలకొల్పేందుకు లక్ష్యంగా పెట్టుకున్నాం. సెర్ప్ అధికారుల సహకారంతో బ్యాంకు లింకేజీ రుణాలు అందిస్తున్నాం.
– గంగాధర్,
రెడ్కో సంస్థ ఉమ్మడి జిల్లాల మేనేజర్.