కోటగిరి అక్టోబర్ 29 : వివాహ వయసు నిండక ముందే బాల్య వివాహాలు చేయడం వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని తహసీల్దార్ గంగాధర్ అన్నారు. బుధవారం నిజామాబాద్ జిల్లా కోటగిరి మండల కేంద్రం లోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఐసీడీఎస్, ఐసీపీఎస్ ఆధ్వర్యంలో బాల్య వివాహాల నిర్ములనపై అవగాహనా సదస్సు నిర్వహించారు. ఈ సందర్బంగా పలువురు వక్తలు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాలలో బాల్యవివాహాలు వల్ల అతి చిన్న వయసులో గర్భం దాల్చుతున్నారు. దీనివల్ల తల్లి బిడ్డలు ఇద్దరికీ ప్రమాదకరం అన్నారు. తీవ్ర పౌష్టికాహారం లోపం వల్ల రక్తహీనతతో మాత శిశువు మరణాల సంఖ్య పెరుగుతుందన్నారు.
బాల్య వివాహాలను నిర్మూలించేందుకు ప్రతి ఒక్కరు సహకరించాలని పేర్కొన్నారు. ఎక్కడైనా బాల్య వివాహాలు జరిగితే వెంటనే టోల్ ఫ్రీ నెంబర్ 1098 కు సమాచారం అందించాలని వారి వివరాలు గొప్యంగా ఉంచి బాల్య వివాహ నిర్ములన కు తగిన చర్యలు చేపట్టడం జరుగుతుందన్నారు. ఈ సందర్భంగా బాల్య వివాహాలను అరికట్టి వారి హక్కులను కాపాడే కర పత్రాలను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ విష్ణు, ఎంపీవో క్యాకప్ప, సూపరిటెంట్ శ్రీనివాస్ రెడ్డి, ఐసీడీఎస్ కోటగిరి సెక్టార్ సూపర్ వైజర్ కొమురవ్వ, నిజామాబాద్ ఐసీపీఎస్ విభాగం ప్రతినిధులు శ్రీ హరి, స్రవంతి,ఆయా గ్రామాల పంచాయతీ కార్యదర్శులు, అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు.